డిల్లీకి రెండు రోజులు విమాన సర్వీసులు బంద్

First Published Nov 12, 2017, 12:56 PM IST
Highlights
  • డిల్లీలో భారీగా కురుస్తున్న పొగమంచు
  •  రెండు రోజుల పాటు విమాన సర్వీసులు నిలిపివేసిన యునైటెడ్ ఎయిర్ లైన్స్

  డిల్లీలో కాలుష్య ప్రభావం ఇప్పటివరకు దేశవ్యాప్తంగానే చర్చ జరగ్గా, ప్రస్తుతం అది అంతర్జాతీయ స్థాయికి చేరింది. డిల్లీ లో కాలుష్యం కారణంగా ఇప్పటికే అంతర్జాతీయ పర్యటకుల తాకిడి తగ్గింది. దీనికి తోడు రెండు రోజుల పాటు డిల్లీకి విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ ఎయిర్ లైన్స్ పేర్కొంది. దీంతో అంతర్జాతీయంగా కూడా డిల్లీలో కాలుష్యం గురించి చర్చ మొదలైంది.
ఇప్పటికే పక్క రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాలు కాల్చడం వల్లే కాలుష్యం ఇంత విపరీతంగా పెరిగిపోయిందని డిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఆ రాష్ట్రాల సీఎంలతో మాట్లాడి కాలుష్యాన్ని తగ్గించే చర్చలు చేపడతామని డిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇప్పటికే తెలిపాడు. 
అయితే కాలుష్య తీవ్రతతో పాటు పొగమంచు డిల్లీలో విపరీతంగా పెరిగిపోయింది. ఉదయం, సాయంత్రం సమయాల్లో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. కాలుష్య తీవ్రత విపరీతంగా పెరగడంతో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కూడా కొందరు డాక్టర్లు సలహా ఇస్తున్నారు.
 వీటన్నింటిని పరిశీలిస్తున్న అంతర్జాతీయ సమాజం కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. తమ దేశ పర్యాటకులకు వివిద దేశాలు ఇక్కడ పరిస్థితిని ముందుగానే వివరిస్తున్నాయి. అలా యునైటెడ్ ఎయిర్ లైన్స్ కూడా రెండు రోజులు డిల్లీకి విమాన సర్వీసులు నిలిపివేసింది. శని, ఆదివారాలు దిల్లీకి చేరుకోవాల్సిన విమాన సర్వీసులు రద్దుచేసినట్లు,ప్రయాణికుల టికెట్లు రీ షెడ్యూల్ చేసినట్లు విమానయాన సంస్థ తెలిపింది.  

click me!