దాడి తర్వాత బిత్తిరి సత్తి ఎలా ఉన్నాడంటే ?

First Published Nov 27, 2017, 7:13 PM IST
Highlights
  • టీవీ ఆర్టిస్ట్ బిత్తిరి సత్తిపై దాడి
  • స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సత్తిని పరామర్శించిన పొన్నాల
  • దాడిని ఖండించిన అల్లం నారాయణ, బసవ పున్నయ్య 

మణికంఠ అనే దుండగుడి దాడితో గాయపడ్డ టీవీ ఆర్టిస్ట్ రవి అలియాస్ బిత్తిరి సత్తి ప్రస్తుతం ఎలాఉన్నాడన్న ఉత్కంఠ తెలుగు ప్రజల్లో నెలకొంది. సత్తి ఆరోగ్య పరిస్థితిపై సర్వత్ర చర్చ జరుగుతున్నది. పత్తి ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారాన్ని ఏషియా నెట్ అందిస్తోంది. చదవండి.  
 ప్రస్తుతం సత్తి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. గాయపడ్డ సత్తి ప్రస్తుతం స్టార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సత్తిని రాజకీయ నాయకులు, జర్నలిస్టు సంఘాలల నాయకులు పరామర్శిస్తున్నారు. బంజారాహిల్స్ లోని హాస్పిటల్ కు చేరుకుని మాజీ పిసిసి అద్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సత్తిని  పరామర్శించారు. సత్తి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఆయన ఈ దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులకు సూచించారు.


అలాగే మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కూడా సత్తిపై జరిగిన దాడిని ఖండించారు. సత్తి తెలంగాణ భాషను నాశనం చేశాడంటూ నిందితుడు పేర్కొనడం దారుణమన్నారు. బిత్తిరి సత్తి తన యాస ద్వారా తెలంగాణ భాషను బ్రతికిస్తున్నాడని అల్లం నారాయణ ప్రశంసించారు.దాడికి పాల్పడిన వ్యక్తికి మతి స్థిమితం లేదని, అందువల్లే ఈ దాడులకు పాల్పడ్డాడని అన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ దాడిపై తెలంగాణ వర్కింగ్ జర్కలిస్ట్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ బసవ పున్నయ్య కూడా స్పందించారు. టీవీ జర్నలిస్టుగా పనిచేస్తున్న బిత్తిరి సత్తిపై దాడి జరగడం దురదృష్టకరమని అన్నారు. దాడికి పాల్పడిన నిందితున్ని కఠినంగా శిక్షించాలని, ఈ దాడి వెనుక ఉన్న కుట్రలను వెలికితీయాలని టీడబ్ల్యూజేఎప్ తరపున డిమాండ్ చేస్తున్నట్లు బసవపున్నయ్య తెలిపారు.


వీ6 చానెల్ లో జర్నలిస్టుగాను, టీవి ఆర్టిస్టుగా పనిచేస్తున్న బిత్తిరి సత్తి తీన్మార్ ప్రోగ్రాం ద్వారా పాపులర్ గా మారాడు రవి. అయితే ఇందులో సత్తి వాడే భాష తెలంగాణ యాసను అవమానించే విధంగా ఉందంటూ, అందుకే అతడిపై దాడికి పాల్పడినట్లు నిందితుడు మణికంఠ చెబుతున్నాడు. ఈ దాడిలో సత్తి మొహంపై గాయాలయ్యాయి.  ఈ దాడిపై వెంటనే అప్రమత్తమైన చానెల్ సిబ్బంది దాడి చేసిన దుండగులను పట్టుకుని పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో అప్పగించారు. సత్తిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సత్తి కోలుకుంటూ ఉండటంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

click me!