
ఏడుగురు స్నేహితులు సరదాగా విహారయాత్రకు వెళ్లారు.. వారిలో ఇద్దరు సాహసం చేయడానికి ప్రయత్నించారు. సరదాగా చేసిన వారి ప్రయత్నం.. ప్రాణాలు తీసింది. 2వేల అడుగులపై నుంచి కిందకు దూకారు. కాపాడాల్సిన మిగిలిన స్నేహితులు వీడియో తీశారు.
వివరాల్లోకి వెళితే..మహారాష్ట్రలోని అంబోలి ఘాట్ చాలా ప్రాముఖ్యం ఉన్న పర్యాటక ప్రదేశం. ఏడుగురు స్నేహితులు సరదాగా విహారయాత్రకు అక్కడికి వెళ్లారు. అందులోని ఇద్దరు మాత్రం మందుకొడుతూ రైలింగ్‌పై సాహసకృత్యాలకు దిగారు. ఇదంతా చూస్తున్న స్నేహితులు వారిని ఆపే ప్రయత్నం చేయకుండా వీడియో తీస్తూ, కేరింతలు కొడుతూ వారికి ఇంకాస్త ఉత్సాహపరిచారు.. వీడియో తీస్తున్నారని గమనించిన వారు మందు మైకంలో ఇంకాస్త అతిగా ప్రవర్తిస్తూ రైలింగ్‌కు అవతలి పక్క చివర నిలబడి చేతులు వూపుతూ స్నేహితులకు సైగలు చేశారు. సహచరులు దిగమని గట్టిగా అరుస్తున్నప్పటికీ వారు వినిపించుకోలేదు. వర్షం పడుతుండటం, మందు మైకంలో ఉండటంతో అందులోని ఓ వ్యక్తికి పట్టుతప్పింది. లోయలో పడిపోతూ పక్కనే ఉన్న తన స్నేహితుణ్ని గట్టిగా పట్టుకున్నాడు. స్నేహితులంతా ఒక్కసారిగా అరుస్తూ అక్కడికెళ్లి చూసేసరికి వారు 2000 అడుగుల కింద పడి చనిపోయారు. మృతులను ఇమ్రాన్ గరాడి (26), ప్రతాప్ రాథోడ్(21)గా పోలీసులు గుర్తించారు. శవాలు ఇంకా లభ్యం కాలేదని భారీగా వర్షం పడుతుండటంతో గాలింపు చర్యలు ఆలస్యమవుతున్నాయని తెలిపారు. వీరంతా కొల్హాపూర్‌లోని ఫౌల్ట్రీ ఫామ్‌లో పనిచేస్తున్నారని పోలీసు ఉన్నతాధికారి సునీల్ ధనావా పేర్కొన్నారు.