ఈ మాజీ మంత్రి ఇంట్లో సీఎం దెయ్యం వదిలారంట

First Published Feb 22, 2018, 3:46 PM IST
Highlights
  • లాలూ కొడుకు ఇంట్లో దెయ్యాలు
  • సీఎం, డిప్యూటి సీఎం వదిలారంటున్న తేజ్ ప్రతాప్
  • అందువల్లే బంగ్లా ఖాళీ చేస్తున్నట్లు ఆరోపణ

బీహార్ రాజకీయాలు ఎప్పుడూ రంజుగా సాగుతుంటాయి. ఎప్పుడు ప్రతిపక్షం మిత్రపక్షంగా మారుతుందో, మిత్రపక్షం ప్రతిపక్షంగా మారుతుందో తెలీదు. గత ఎన్నికల్లో బీజేపితో కాదని కాంగ్రెస్, ఆర్జేడీలతో చేతులు కలిపి బంపర్ మెజారిటీతో గెలిచి అధికారాన్ని చేజిక్కించుకున్నారు  ప్రస్తుత సీఎం నితీష్ కుమార్. అయితే కొద్దిరోజులకే కాంగ్రెస్, ఆర్జేడీల అవినీతిని తట్టుకోలేక వాటితో తెగతెంపులు చేసుకున్నారు. ఆ తర్వాత జనతాదళ్(యునైటెడ్), బీజేపీలు చేతులు కలిపి కొత్త ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. దీంతో బీహార్ ఆరోగ్యమంత్రి పదవి కోల్పోయిన మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ తనయుడు తేజ్‌ప్రతాప్ ఇపుడు తాజాగా అధికారిక నివాసాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ప్రభుత్వం, సీఎం పై బాగా గుర్రుగా ఉన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు అధికారికింగా కేటాయించిన ఇంట్లో సీఎం నితీశ్, డిప్యూటి సీఎం సుశీల్ కుమార్ మోదీలు దయ్యాలను వదిలారని ఆరోపించారు. అందువల్ల తాను ఈ బంగ్లాను వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.

మొదటినుండి లాలూ ప్రసాద్ కుటుంబానికి మూడనమ్మకాలు ఎక్కువ. అందువల్ల ఈ అధికారిక బంగ్లాలోకి వచ్చినప్పటినుండి తనకు ఏదీ మంచి జరగడం లేదని తేజ్ ప్రతాప్ మొదటినుండి సన్నిహితులతో చర్చించేవాడు. ఈ ఇంటి వాస్తు సరిగ్గా లేదంటూ పలు మార్పులు చేసినట్లు సమాచారం. ఇలా తనకు అచ్చిరాని ఇంట్లో ఉండకూడదనుకోవడం ఒక కారణమైతే ఈ ఇంటిని ఖాళీ చేయడానికి మరో కారణం ఉంది. 

బీహార్ ప్రభుత్వంలో ఆరోగ్యమంత్రిగా ఉన్నపుడు ఈ బంగ్లాను అధికారిక కార్యకలాపాల కోసం తేజ్ ప్రతాప్ కు కేటాయించారు. అయితే అతడు పదవిని కోల్పోయి ఆరు నెలలు గడుస్తున్నా ఇంకా ఈ అధికారిక నివాసంలో ఉంటున్నాడు. దీంతో ఈ బంగ్లా ఖాళీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీచేసింది. ఈ మద్య బంగ్లాను ఖాళీచేయాలని ప్రభత్వం నుండి ఒత్తిడి  మరీ ెక్కువవడంతో ఎట్టకేలకు దీన్ని ఖాళీ చేయాలని నిర్ణయించుకున్న తేజ్ ప్రతాప్ ఈ ఇంటిని, సీఎంను, డిప్యూటీ సీఎం ను కలిపి విమర్శించారు.ఇంట్లో సీఎం, డిప్యూటీ సీఎం వదిలిన దెయ్యాలు తనను వెంటాడుతున్నాయని ఆరోపించారు. అందువల్లే తాను ఈ ఇంటిని ఖాళీ చేసి మరో నివాసానికి మారుతున్నట్లు తేజ్ ప్రతాప్ తెలిపారు.

click me!