తమిళనాడు రాజకీయాలు నడిపిస్తున్నదెవరు?

First Published Aug 21, 2017, 8:12 AM IST
Highlights
  •  నంద్యాల ఎన్నికల్లో సర్వేల నిషేదంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సర్వే సంస్థలు
  •  అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళ బహిష్కరణ
  •  మహానటి సావిత్రి సినిమాలో నటించనున్న ప్రకాష్ రాజ్
  • ఒక్కటైన పన్నీరు సెల్వం,పళని స్వామి వర్గాలు

ట్రిపుల్ తలాక్ పై రేపే తుది తీర్పు

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ట్రిపుల్ తలాక్ అంశంపై రేపు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన దర్మాసనం దీనిపై విచారించి తుది తీర్పును ప్రకటిస్తారు. ముస్లిం సామాజిక వర్గాల్లో విడాకుల కోసం వాడే ఈ పదం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీనిపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం వెలువరించే తీర్పుపై సర్వత్రా ఉత్కంట నెలకొంది. 

నంద్యాల ఎన్నికల్లో సర్వేల నిషేదంపై హైకోర్టులో పిటిషన్

నంద్యాల ఉప ఎన్నికలపై ఎలాంటి సర్వేలు చేపట్టవద్దంటు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఓ సర్వే సంస్థ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసింది .దీనిని విచారణ కు స్వీకరించిన హైకోర్టు మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల ప్రధాన అధికారి , నంద్యాల ఎన్నికల రిటర్నింగ్ అధికారిని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది దర్మాసనం.

గన్నవరంలో పట్టపగలే చోరీ

గన్నవరం మండలం శ్రీనగర్ కాలనీలో పట్ట పగలే చోరీ జరిగింది.గుర్తు తెలియని వ్యక్తి సొంత బంధువే ఎవరూ లేని సమయంలో ఇంటిలోకి చొరబడి మహిళ గొంతు నొక్కి మెడలోని 5 కాసుల గొలుసు లాక్కుని బైక్ పై పరారయ్యాడు.ఈ దృశ్యాలన్ని సమీపంలో ఉన్న సీ.సీ.టీవీ కెమెరాలో రికార్డయ్యాయి.ఈ సమాచారం తెలుసుకున్న ఏసీపీ విజయ భాస్కర్, గన్నవరం ఇన్ఛార్జి సిఐ.కె.శ్రీధర్ కుమార్,ఎస్ఐ.శ్రీనివాసరావు లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్థానికేతర నేతలు నంద్యాలను వీడాలి 

ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసాక వేరే ప్రాంతాల నేతలు, కార్యకర్తలు ఎవ్వరూ నంద్యాలలో ఉండకూడదని ప్రదాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్ హెచ్చరించారు. అలాగే సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ను ప్రసారం చేయడం, ప్రచారానికి వాడుకోవడం చట్టవిరుద్దమని అన్నారు. బల్క్ మెసేజ్ లపై కూడా నిషేదం వుందని తెలిపారు. అలాగే ఓటు ఎవరికి వేసారో చెప్పడం కూడా నేరంగా పరిగనిస్తామని ఆయన తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు మద్యం షాపులను మూసేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఓటర్లను ప్రలోబాలకు గురిచే ప్రజలు అందరూ ఓటు హక్కును వినియోగించుకుని ఓటింగ్ శాతాన్ని పెంచాలని  కోరారు. 

తమిళనాడు రాజకీయాలు ఇలా ఉన్నాయి

ఈ రోజు తమిళనాడు ఎఐఎడిఎంకె పార్టీ ముఠాలు రెండు కలిసిపోయాయి. జైలులో ఉన్న శశికళను బహిష్కరించారు. కచ్చితంగా ఏదో స్క్రిప్ట్ ప్రకారం జరగుతున్నట్లు అని పిస్తుంది. నాటకం ఎవరు నడుపుతున్నారో, స్క్రిప్టు ఎవరు రాశారో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పోటో చూస్తే అర్థమవుతుంది.

​సిరిసిల్ల ఎస్పీపై వేటు

నేరెళ్ల ఘటనలో బాదితులపై దాడి కేసులో తీవ్ర ఆరోపనలు ఎదుర్కొన్న సిరిసిల్ల ఎస్పీ విశ్వజిత్ పై వేటు పడింది. ఆయన్ని  పోలీసుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు లడఖ్ కు పంపిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. దాదాపు నెల రోజులు ఆయన అక్కడే ఉండనున్నాడు. అప్పటివరకు  కరీంనగర్ సీపి కమలాసన్ రెడ్డి సిరిసిల్ల ఎస్పీగా అదనపు భాద్యతలు చేపట్టనున్నారు. నెరేళ్ల ఘటనతో సంబంధం ఉందంటూ విపక్షాల ఆందోళనల నేపథ్యంలో విశ్వజిత్ ను  ఎస్పీ బాధ్యతల నుంచి తప్పించడం పై ప్రాధాన్యత సంతరించుకుంది.
 

శశికళ బహిష్కరణ

తమిళనాడులో మరోసారి రాజకీయ ప్రకంపనలు రేగాయి. అన్నాడీఎంకేలోని రెండు వైరి వర్గాలు పళని, పన్నీర్ వర్గాలు ఒక్కటైన మరుక్షణమే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పార్టీలో చిన్నమ్మ శశికళపై వేటు వేశారు. అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించారు. రెండు వర్గాల విలీన ప్రక్రియ ముగిసిన తర్వాత పార్టీ కార్యాలయంలోనే భేటీ శశికళ బహిష్కరణపై ప్రకటన చేశారు.

పన్నీరే పార్టీ అద్యక్షుడు

ఎట్టకేలకు తమిళనాడులో రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన అన్నాడీఎంకే పార్టీ లోని చీలికవర్గాలు ఒక్కటయ్యాయి. ఈ విషయాన్ని పన్నీరు సెల్వం ప్రకటించారు.అమ్మ ఆత్మ, ప్రజల కోరిక మేరకు ఈ విలీనం జరిగినట్లు ఆయన తెలిపారు. పన్నీరుకు పార్టీ అద్యక్ష పదవితో పాటు డిప్యూటి సీఎం పదవిని కేటాయించారు సీఎం పళని స్వామి. అలాగే పన్నీర్ వర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు హోం,గృహ,ఆర్థిక శాఖలను కేటాయించారు.

 మాజీ మంత్రి బొచ్చు సమ్మయ్య మృతి

మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత, దళిత నాయకుడు బొచ్చు సమ్మయ్య మృతి పట్ల ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి తీవ్ర సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.

క్రికెట్ బెట్టింగ్ నోటీసుల వెనక ప్రభుత్వ హస్తం, కోటంరెడ్డి అనుమానం

క్రికెట్ బెట్టింగ్ వ్యవహరాన్ని రాజకీయ కక్షగా మారిస్తే ఏ  స్థాయిలోనయినా  ఎదుర్కొంటామని వైసిపి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు క్రికెట్  బెట్టింగ్ వ్యవహారంలో  ఆయనకు, సిటి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.  రేపు కోటంరెడ్డి   ఎస్పీ ఆఫీస్ లో హాజరు కావలసి ఉంది.  ఈ నేపథ్యంలో సోమవారం నాడు  ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో ఎమ్మెల్యేలు, మంత్రుల పాత్ర లేదంటూ మూడుసార్లు  స్పష్టం చేసినా జిల్లా ఎస్పీ రామకృష్ణ  ఉన్నపలంగా హాజరుకావాలంటూ ఇద్దరు వైసిపి ఎమ్మెల్యేలకు నోటీసులు పంపడం వెనక ప్రభుత్వం వత్తిడి ఉందని  ఆయన అనుమానం వ్యక్తం చేశారు. క్రికెట్ బెట్టింగ్ ను జిల్లా నుంచి తరిమేసేందుకు తాము అన్ని విధాలా పోలీసులకు సహకరిస్తామని కూడ ఆయన హామీ ఇచ్చారు. అయితే,రాజకీయంగా అణగదొక్కాలని ప్రయత్నిస్తే ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉంటామని హెచ్చరిక చేశారు.
 

సింగరేణి ఎన్నికల నోటిఫికేషన్

సెప్టెంబర్ 14 నుండి 16 వ తేది వరకు నామినేషన్ల స్వీకరణ,
సెప్టెంబర్ 19 వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు,
సెప్టెంబర్ 20 న నామినేషన్ల పరిశీలన, ఎన్నికల లిస్టు ప్రకటన.
అక్టోబర్ 5 వ తేదీన ఉదయం 7 నుండి 5 గంటల వరకు పోలింగ్
 అక్టోబర్ 6 వ తేదీన ఓట్ల లెక్కింపు.

షాపింగ్ మాల్ లో దొంగతనం

హైదరాబాద్ : సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని అనుటెక్స్ షాపింగ్ మాల్ లో భారీ చోరి జరిగింది. షోరూం బాత్ రూమ్ కిటికీ గ్రిల్స్ తొలగించి లోపలికి ప్రవేశించిన దుండగులు క్యాష్ కౌంటర్ లో ఉన్న  రూ. 12 లక్షల నగదును అపహరించుకు పోయారు.  దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు,షోరూంకు చేరుకుని వివరాలు సేకరించారు. దీనిపై  విచారణ జరిపి సాద్యమైనంత త్వరలో దొంగలను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

ధర్నా చౌక్ తరలింపును అడ్డుకోండి

ధర్నా చౌక్ ను ఇందిరా పార్కు వద్దే కొనసాగించాలని కోరుతూ ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ, అఖిల పక్షం పార్టీల ఆధ్వర్యంలో  టీజేఏసీ చైర్మన్ కోదండరాం హోమ్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ ను కలిసారు. తమ సమస్యలపై ధర్నా చేసుకునే స్వేచ్చను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తుందని వారు హోం మినిస్టర్ కు తెలియచేసారు. దర్నా చౌక్ తరలింపును కేంద్ర ప్రభుత్వం తరపున అడ్డుకోవాలని కోరారు. దీనిపై హోం మినిస్టర్ సానుకూలంగా స్పందించారని వారు మీడియాకు తెలియజేశారు. తర్వాత తెలంగాణ జేఏసీ, అఖిల పక్షం ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. 
 

తమిళనాడు లో ఫలించిన చర్చలు

 తమిళనాడులో రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన అన్నాడీఎంకే పార్టీ లోని చీలికవర్గాలు ఒక్కటయ్యాయి. చర్చల ద్వారా ఇరు వర్గాల మద్య సయోద్య కుదిరింది. అయితే చర్చల సందర్బంగా సీఎం పదవికై పట్టుబట్టిన పన్నీరు సెల్వం ఎట్టకేలకు ఓ మెట్టు దిగి ఉప ముఖ్యమంత్రి పదవికి ఓకే చెప్పారు. ఇవాళ 3 గంటలకు ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. పన్నీరు తో పాటు ఆయన వర్గంలోని మరో ఇద్దరికి మంత్రి పదవులు రానున్నాయి. అయితే అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో సీఎం పళని స్వామి, పన్నీరు సెల్వంలు మరో సారి బేటీ అయి ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలన్న దానిపై చర్చించనున్నారు.  

మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితుడికి బెయిల్

మాలేగావ్‌ పేలుళ్ల కేసులో ప్ర‌ధాన నిందితుడు శ్రీకాంత్ పురోహిత్‌కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  ఆర్మీ ఆఫీసర్ గా విధులు నిర్వహించిన పురోహిత్ రిటర్మెంట్ అనంతరం విద్రోహ శక్తులతో చేతులు కలిపి మాలేగావ్ పేలుళ్లకు బాంబును సరఫరా చేసినట్లు అభియోగాలున్నాయి. ఆయితే తనకు పేలుళ్లకు ఎలాంటి సంభందం లేదని, ఈ కేసును ద‌ర్యాప్తు చేస్తున్న నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ  అధికారులు తనను అక్రమంగా దీనిలో ఇరికించారని ఆయన కోర్టుకు తెలిపారు. అయితే ఈ పేలుడుతో సంభందమున్న  అతడికి బెయిల్ మంజూరుచేయరాదని ఎన్ఐఏ కోర్టుకు తెలిపినప్పటికి వారి మాటలను పరిగణలోకి తీసుకోకుండా బెయిల్ మంజూరు చేసింది సుప్రీం దర్మాసనం.
 

మహానటి సావిత్రి టీం లో ప్రకాష్ రాజ్

మహానటి సావిత్రి జీవిత నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ నటించనున్నారు. నాగ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ  మూవీలో విల‌క్ష‌న న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌ముఖ నిర్మాత ఆలూరి చ‌క్రపాణి పాత్రను పోషించనున్నారు.కీర్తి సురేష్  టైటిల్ రోల్ సావిత్రి పాత్రను పోషిస్తున్న ఈ మూవీలో ఇప్పటికే  జెమినీ గ‌ణేష‌న్ గా దుల్క‌ర్ స‌ల్మాన్, జర్నలిస్ట్ పాత్రలో సమంత , ఆమెకు భర్తగా విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. అయితే  రైట‌ర్, నిర్మాత‌, ద‌ర్శ‌కుడు ఇలా ప‌లు విభాగాల‌లో త‌న స‌త్తా  చాటిన చక్ర‌పాణి పాత్రకోసం ప్రకాష్ రాజ్ ని కాస్ట్ చేసింది మూవీ బృందం. అప్ప‌ట్లో ఏషియాలోనే అతి పెద్ద స్డూడియోగా రికార్డు నెలకొల్పిన విజ‌య వాహిని స్టూడియోని చక్ర‌పాణి స్థాపించాడు. అలాంటి గొప్ప నిర్మాత పాత్రలో నటించడానికి ప్ర‌కాశ్ రాజ్ ఈ రోజు నుండి మ‌హాన‌టి టీంతో క‌ల‌వ‌నున్నాడ‌ు. 
 

ఉప రాష్ట్రపతికి తెలంగాణ ప్రభుత్వ పౌర సన్మానం

రాజ్ భవన్ లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పౌర సన్మాన కార్యక్రమం ప్రారంభమయింది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు గవర్నర్ నరసింహన్, ఉప ముఖ్య మంత్రులు మహమద్ అలీ,కడియం శ్రీహరి,అసెంబ్లీ స్పీకర్ మదుసూదనాచారి మరియు వివిధ శాఖల మంత్రులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న వెంకయ్యనాయుడు

రెండు రోజులు హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.  ఆయనకు తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ లతో పాటు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మరియు రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా రాజ్ భవన్ లో జరిగే పౌరసన్మాన కార్యక్రమానికి  వెంకయ్య బయల్దేరారు. 

నగరంలో నేడు,రేపు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన సందర్బంగా సోమ,మంగళ వారాలు  ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఇవాళ ఉదయం 10.45 గంటల నుంచి 11.30 గంటల వరకు బేగంపేట ఎయిర్‌ పోర్టు, పీఎన్‌టీ జంక్షన్‌, శ్యాంలాల్‌బిల్డింగ్‌, హెచ్‌పీఎస్‌, బేగంపేట ఫ్లై ఓవర్‌, గ్రీన్‌ల్యాండ్‌ జంక్షన్‌, మోనప్ప ఐ లాండ్‌, ఎంఎంటీఎస్‌, రాజ్‌భవన్‌ రైల్వే గేట్‌, వీవీ విగ్రహం మార్గాల్లో వాహనాలను వేరే మార్గాలకు మళ్లించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే 22వ తేదీన ఉదయం 7.15 నుంచి 8 గంటల వరకు రాజ్‌భవన్‌, యశోద ఆస్పత్రి, మోనప్ప ఐ లాండ్‌, ఎంఎంటీఎస్‌, గ్రీన్‌ల్యాండ్‌ జంక్షన్‌, బేగంపేట ఎయిర్‌పోర్టు దారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు వుంటాయని తెలియజేశారు.  

ఉపరాష్ట్రపతి పర్యటనకు ఘనంగా ఏర్పాట్లు

తెలుగు వారి ఖ్యాతిని దేశ నలుమూలలకు చాటిచెప్పిన ముప్పవరపు వెంకయ్య నాయుడు మొదటిసారి భారత ఉప రాష్ట్రపతి హోదాలో  హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఆయన రాకను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా నగరంలో పలుచోట్ల స్వాగత ప్లెక్సిలను ఏర్పాటు చేశారు. బేగంపేట విమానాశ్రయం లో దిగనున్న ఉపరాష్ట్రపతికి సీఎం కేసీఆర్ తో పాటు మంత్రివర్గ సహచరులు ఘనస్వాగతం పలుకుతారు.
 

టీటీడి మాజీ ఈవో పీవీఆర్కే ప్రసాద్ మృతి
 

శనివారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో బంజారాహిల్స్‌ కేర్‌ అస్పత్రిలో చేరిన టిటీడి మాజీ ఈవో, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పీవీఆర్‌కే ప్రసాద్‌(77)  ఈ రోజు కన్నుమూశారు. తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. పీవీఆర్కే ప్రసాద్‌ మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం  ప్రకటించారు.
 

బాలానగర్ లో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ : బాలానగర్ లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టెందుకు తెలంగాణ ప్రభుత్వం పూనుకుంది. ఎన్నో సంవత్సరాలుగా ప్రతిపాదనల దశలోనే వున్న బాలానగర్ ప్లైఓవర్ పనులకు నేడు పురపాలక శాఖ మంత్రి తారక రామారావు శంకుస్థాపన చేయనున్నారు. సిటీలో చేపడుతున్న వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకంలో భాగంగా ఈ నిర్మాణం చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. రూ 387 కోట్ల వ్యయంతో  హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టనుంది. శంకుస్థాపన అనంతరం అక్కడే జరిగే బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ఈ ప్రాజెక్టు వివరాలు తెలియజేస్తారని హెచ్ఎండీఏ కమీషనర్ చిరంజీవులు తెలిపారు.       

click me!