ఏషియానెట్-తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్

First Published Aug 20, 2017, 10:57 AM IST
Highlights
  •  మొదటి వన్డేలో టీం ఇండియా ఘన విజయం
  • ఆర్టీసీ బస్సులపై అశ్లీల సినిమా ప్రచార యాడ్స్ అడ్డుకోవాలన్న వీహెచ్
  • తొలి వన్డేలో  టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న టీం ఇండియా
  • హైదరాబాద్ లో డ్రగ్‌ ఫ్రీ సిటీ మారథాన్ ను ప్రారంభించిన సీపి మహెందర్ రెడ్డి 
  • 4 కోట్ల విలువైన సిగరెట్లను దోచుకున్న దోపిడి దొంగలు

వన్డేల్లోను తగ్గని టీం ఇండియా ఊపు

శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ ను టీం ఇండియా గెలుపుతో ఆరంభించింది. ఆతిద్య లంకను 216 పరుగులకే కట్టడి చేసిన విరాట్ సేన.ఈ స్పల్ప లక్ష్యాన్ని అవలీలగా చేదించింది. కేవలం 28.5 ఓవర్లలోనే 220 పరుగులు బాది విజయదుందుబిని మోగించింది. ఓపెనర్ శిఖర్ దావన్ 132 పరుగులను కేవలం 90 బంతుల్లోనే సాధించి భారత్ ను విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర వహించాడు. అగ్నికి వాయువు తోడైనట్లు శిఖర్ కి కెప్టెన్ విరాట్ కోహ్లీ ( 70 బంతుల్లో 82 పరుగులు) తోడవడంతో విజయతీరాలకు అతి సునాయాస్గంగా చేరుకున్నారు. మొత్తానికి టీం ఇండియా విజయపరంపర టెస్టుల నుంచి వన్డేలకు మారింది.   
 

కొత్త వాదన వినిపిస్తున్న విక్రమ్ గౌడ్

జైలునుంచి బెయిల్ పై విడుదలైన విక్రమ్‌గౌడ్‌ ఆయనపై జరిగిన కాల్పుల ఘటనపై కొత్త వాదన వినిపిస్తున్నారు. ఒడిశాలో కొందరు మైనింగ్‌ వ్యాపారులతో తనకు గొడవలున్నాయని ఇంటెలిజెన్స్‌ పోలీసులే అంటున్నారు. అందువల్ల వారే తనపై కాల్పులు జరిపినవారిని  గుర్తించాలని అన్నారు.    తనకు రూ. 40 కోట్లు అప్పులున్నాయి. అలాంటిది తానెలా కాల్పుల కోసం రూ. 50 లక్షల సుపారీ ఇయ్యగలనని అన్నారు.  కాల్పుల ఘటనపై తొలిసారి మీడియాతో మాట్లాడిన ఆయన.. తనపై కాల్పులు జరిపిన వారెవరో పోలీసులే నిర్థారించాలన్నారు.

నంద్యాలలో సర్వేల పై నిషేదం 
 

నంద్యాలలో ఉపఎన్నికల నేపధ్యంలో ఒపినియన్ పోల్ మరియు సర్వేలను నిషేదించామన్నారు ఎన్నికల ప్రదానాదికారి భన్వర్ లాల్. సర్వేల పేరిట ఎవరికి ఓటేస్తారో అడగడం చట్టరిత్యా నేరమని, అలా సర్వేల పేరిట ప్రసార మాద్యమాలు చట్టాన్ని అతిక్రమించరాదని సూచించారు. తాము ఏ పార్టీ పట్ల పక్షపాతాన్ని ప్రదర్శించడం లేదన్నారు. అలాగే ఫెయిడ్ యాడ్స్ పైనా దృష్టి సారించామని తెలిపారు. డీఎస్పీ పై ఎవరూ పిర్యాదు చేయలేదని, తమ విచారణలోనే అతడు తప్పు చేసినట్లు తేలిందని అందుకే బదీలీ చేయించామని భన్వర్ లాల్ తెలిపారు.

భారత స్పిన్నర్ల దాటికి లంక విలవిల 

శ్రీలంక‌ జట్టు భారత స్పిన్‌ ఉచ్చులో పడి 43.2 ఓవ‌ర్ల‌లో 216 ప‌రుగుల‌కే ఆలౌటైంది. స్పిన్న‌ర్లు అక్ష‌ర్ ప‌టేల్ 3,  చాహ‌ల్ 2, కేదార్ జాద‌వ్ 2 వికెట్లు తీసుకున్నారు. ఒక‌దశలో  మంచి రన్ రేట్ తో భారీ స్కోరు సాధించేలా కనిపించిన లంక భారత స్పిన్నర్ల దాటికి విలవిల్లాడిపోయారు.  ఓపెన‌ర్లు డిక్‌వెల్లా (64), గుణ‌తిల‌క (35), కుశ‌ల్ మెండిస్ (36) లు మంచి స్కోరే సాధించిన మిడిలార్డ‌ర్ విఫ‌ల‌మవడంతో ఆతిథ్య జట్టు ఇంత తక్కువస్కోరుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 
 

కేసీఆర్  వ్యవసాయ నాయకుడనడం పెద్ద జోక్

కేసీఆర్‌కు వ్యవసాయ నాయకత్వ అవార్డు రావడం ఈ శతాబ్దంలో అతిపెద్ద జోక్ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. అయినా ఆయనకు అవార్డునిచ్చింది కేంద్ర ప్రభుత్వం కాదని,  ఓ విత్తన కంపెనీ  ఈ అవార్డుకు ఆయన పేరును ఎంపిక చేసిందన్నారు. అయితే ఇది తెలియని గులాబీ నేతలు మాత్రం అది కేంద్ర ప్రభుత్వ అవార్డుగా ప్రచారం చేసుకుంటున్నాయని మండిపడ్డారు. స్వామినాథన్ ఒక్కసారి తెలంగాణకు వచ్చి.. ఇక్కడి రైతు కుటుంబాలను చూసినతర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటే బాగుండేదన్నారు శ్రవణ్.
 

రుణమాపీ చేయనందుకేనా అగ్రికల్చర్ లీడర్ షిప్ అవార్డు

తెలంగాణ సీఎం కేసీఆర్  ఏం సాధించారని అగ్రికల్చర్ లీడర్ షిప్ అవార్డుకు ఎంపిక చేశారో తనకు అర్థం కావడం లేదన్నారు సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి. అసలు వ్యవసాయ దారులకు కాకుండా, ఇలాంటి బీటి వ్యవసాయదారులకు అవార్డులివ్వడం మంచి సంకేతం కాదన్నారు.రైతుల రుణమాఫే సరిగ్గా అమలు చేయలేని కేసీఆర్ ను వ్యవసాయ లీడర్ గా ఎంపిక చేయడం ఏంటని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక్కసారైనా ఆయన స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశానికి హాజరయ్యారా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. రుణ ప్రణాళిక అంటే తెలియని  దేశంలోని ఏకైక సీఎం కేసీఆరె నని ఆయన ఎద్దేవాచేశారు.
 

ప్రభుత్వమే అశ్లీలతను ప్రచారం చేస్తే ఎలా

ఆర్టీసీ బస్సులపై సినిమా ప్రచార యాడ్స్ చాలా ఘోరంగా ఉంటున్నాయని, డబ్బుల కోసం ఎలాంటి దిగజారుడు యాడ్స్ నైనా ప్రభుత్వం ప్రచారం చేస్తోందని సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు  మండిపడ్డారు. ఇదేనా బంగారు తెలంగాణా అంటే అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గాంధీభవన్ లో   ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన.. ఇటీవల ఆర్టీసీ బస్సులపై కనిపిస్తున్న అర్జునరెడ్డి సినిమా పోస్టర్  యువతను చెడగొట్టే విదంగా ఉన్నాయన్నారు.  ఇప్పటికే సినిమాలు చూసి పిల్లలు చెడిపోతున్నారని  భావిస్తుంటే, ఇలాంటి పోస్టర్లతో ప్రభుత్వ రంగ సంస్థలు ఏం ప్రచారం చేయదలచుకున్నాయో చెప్పాలన్నారు. ఇలాంటి ఆశ్లీల పోస్టర్ల ప్రచారాలు అడ్డుకోవాలని యువతకు పిలుపునిస్తున్నట్లు  హన్మంతరావు తెలిపారు.
 

కరీంనగర్ లో విద్యాప్రమాణాలు పెరగాలి

కరీంనగర్ : కలెక్టరేట్ ఆడిటోరియం లో 2016-17 సంవత్సరం లో మెరిట్ సాదించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...  జిల్లాలో 10 వ తరగతి ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉందని ..  దీన్ని పెంచాల్సిన భాద్యత విద్యాశాఖ అధికారులపై ఉందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో  ఒక్కో నియోజకవర్గానికి 5 కోట్ల నిధులను ఒక్క బడి బాగు కార్యక్రమం కోసమే ఇచ్చామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వినోద్,  ఎమ్మెల్యే రసమయి బాలకిషన్,  ఎమ్మెల్సీ నారాదాసు, జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, మేయర్ రవిందరసింగ్, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్,  డీఈవో రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.
 

22 న భ్యాంకుల సమ్మె

ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఉద్యోగులు ఈ నెల 22న సమ్మెకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ బ్యాంకుల ఏకీకరణకు వ్యతిరేకంగా సమ్మె నిర్ణయానికి వచ్చినట్లు యునైటెడ్ ఫోర‌మ్ ఆఫ్ బ్యాంక్ యూనియ‌న్ తెలిపింది. అలాగే  ఉద్యోగుల సమస్యలను కూడా ఈ సమ్మె ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపింది. చీఫ్ లేబ‌ర్ క‌మిష‌న‌ర్‌తో జ‌రిపిన చ‌ర్చ‌లు విఫలమవడంతో సమ్మెకు దిగడానికే మొగ్గు చూపినట్లు ఏఐబీఓసీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ డీటీ ఫ్రాంకో తెలిపారు.
 

టాస్ గెలిచిన టీం ఇండియా

ఆతిథ్య శ్రీలంకతో జరుగుతున్న 5వన్డేల సిరీస్‌లో భాగంగా దంబుల్లాలో   జరగుతున్న తొలి వన్డేలో భారత్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది.  టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన ఉత్సాహంలో టీం ఇండియా, సీరిస్ కోల్పోయిన పరాభవంలో శ్రీలంకలు ఈ వన్డేలో బరిలోకి దిగుతోంది. పిచ్ బౌలింగ్ అనుకూలంగా వుండటంతో  టాస్ గెలిచి పీల్డింగ్ ఎంచుకున్నట్లు కెప్టెన్ కోహ్లీ తెలిపాడు. 
 
 

రెడ్డి హాస్టల్ శంకుస్థాపనకు ఏర్పాట్లు

రంగారెడ్డి జిల్లా : రాజా బహద్దూర్ వెంకట రామిరెడ్డి 100 వ జయంతి సందర్భంగా రెడ్డి హాస్టల్ భవన నిర్మాణానికి 10 ఎకరాల స్థలంతో పాటు 10 కోట్ల నిధులను తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. ఈ నెల 22 న సీఎం కేసీఆర్ రాజేంద్రనగర్ లో ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అందుకోసం జరుగుతున్న ఏర్పాట్లను మంత్రులు నాయని నర్సింహారెడ్డి, మహేందర్ రెడ్డి లు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రఘునందన్ రావు, ఎంఎల్ఏలు ప్రకాష్ గౌడ్,  చింతల రాంచంద్రారెడ్డి, తీగల కృష్ణా రెడ్డి, ఎంపిలు జితేందర్ రెడ్డి, మల్లారెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి లు పాల్గొన్నారు. 

పోలీసు బాసు ఇంట్లో ఖైదీలే కూలీలు 

గుడివాడలో జైల్లో రిమాండ్ ఖైదీలను నిభందనలకు వ్యతిరేకంగా ఎస్కార్ట్ లు లేకుండా బయటకు తీసుకువెళ్లిన అధికారి భాగోతం బయటపడింది. జైలు సూపరిండెంట్ దుర్గారావ్ ఎలాంటి అనుమతులు లేకుండా ఖైదీలను ఇంటి పనులకు వాడుకుంటున్నాడు. ఆయనతో పాటు ఇతర అధికారులు కూడా ఈ విధంగా నిభందనలకు వ్యతిరేకంగా ఖైదీలను బయటకు తీసుకెలుతున్నారు. ఖైదీల చేత గొడ్డు చాకిరి చేయిస్తున్నారు.
 

శాసనమండలి చైర్మన్ పదవి ముస్లింలకే

నంద్యాల ఉపఎన్నికల్లో రెండో రోజు ప్రచార కార్యక్రమంలో బాగంగా ముస్లిం మత పెద్దలతో   సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తికి శాసన మండలి చైర్మన్‌ పదవి కేటాయిస్తానని వారికి హామీ ఇచ్చారు. ముస్లింల అభివృద్దికి తమ ప్రభుత్వం వంద శాతం కృషి చేస్తోందని.అందుకోసమే ఇటీవల జరిగిన మంత్రివర్గంలోకి ముస్లిం ఎమ్మెల్యేకు చోటు కల్పించానని ఆయన తెలిపారు. బడ్జెట్‌లో కూడా ముస్లింలకు అధిక నిధులు కేటాయించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.
 

మసాజ్ సెంటర్లపై పోలీసుల దాడి     

హైదరాబాద్ పరిధిలో నింబందనలకు వ్యతిరేకంగా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో పలు మసాజ్ సెంటర్లపై పోలీసులు దాడి చేశారు. ఇందులో 23 మంది థాయిల్యాండ్ యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడులు గచ్చిబౌలి, మాదాపూర్, బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్ల పరిధిలోని మసాజ్ సెంటర్ లపై జరిగాయి.   

సినిమా కోసం ఆత్మహత్యాయత్నం

సండే వచ్చిందంటే సరదాగా సినిమాకు వెళ్లాలనుకుంటారు. కాని భర్త సినిమాకు తీసుకువెళ్లడం లేదని ఆత్మహత్య కు పాల్పడిన ఘటన విజయవాడలో జరిగింది.  వాంబే కాలనీకి నివాసముంటున్న రాజారెడ్డి(20), తిరుపతమ్మ(19) దంపతుల మద్య సినిమాకు వెళ్లే విషయంలో వాగ్వాదం జరిగింది. భర్త సినిమాకు తీసుకెళ్లకపోవడంతో మనస్తాపానికి గురైన తిరుపతమ్మ లెనిన్ సెంటర్ వద్ద ఏలూరు కాలువలో దూకింది. భార్య నీళ్లలో కొట్టుకుపోతుండటం చూసి ఈత రాకపోయినా  కాపాడేందుకు భర్త కూడా కాలువలో దూకాడు. దంపతులిద్దరు  నీటిలో కొట్టుకుపోతుండటం గమనించిన ఎపిఎస్పీ కానిస్టేబుల్ వారిని బయటకు తీసి కాపాడాడు. 
 

దోపిడికి కాదేది అనర్హం

యాదాద్రి భువనగిరి : చౌటుప్పల్ మండలం మల్కాపురం  సమీపంలో దోపిడీ దొంగలు భీభత్సం సృష్టించారు. కంటైనర్ లో తరలిస్తున్న 4 కోట్ల విలువైన సిగరెట్లను దోచుకున్నారు.అడ్డుకున్న డ్రైవరును తీవ్రంగా కొట్టిన 10 మంది దుండగులు కంటైనర్ తో సహా ఉడాయించారు. దీనిపై సమాచారం అందుకున్న  పోలీసుల దొంగల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

వైసీపి బెట్టింగ్ ఎమ్మెల్యేలు

నెల్లూరులో క్రికెట్ బెట్టింగ్ కేసులో ఇద్దరు వైసీపి ఎమ్మెల్యేలకు జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 22 న విచారణకు హాజరవ్వాలని ఎస్పీ వారిని ఆదేశించారు. వైసీపి ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి మరియు అనిల్ కుమార్ లు ఈ నోటీసులు అందుకున్నారు. సెక్షన్ 160 కింద వీరికి నోటీసులు అందించినట్లు జిల్లా పోలీసులు తెలిపారు.

 డ్రగ్స్ ఫ్రీ సిటీ మారథాన్

హైదరాబాద్ ని డ్రగ్‌ ఫ్రీ సిటీ గా మార్చాలని ప్రచారాన్ని కల్పిస్తూ నిర్వహిస్తున్న బిగ్‌ మారథాన్ ను పీపుల్స్‌ ప్లాజా వద్ద సిటీ సీపీ మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. నెక్లెస్ రోడ్ లో ప్రారంభమైన ఈ మారథాన్ గచ్చిబౌలి స్టేడియం వరకు కొనసాగుతుంది. సుమారు 16 వేల మంది పాల్గొనే ఈ మారథాన్‌  నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. మారథాన్‌ సమయంలో వాహనదారులు వేరే మార్గాలను ఎంచుకోవాలని,   మ‌ద్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు.  

click me!