
ఆరుషి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు జైలు శిక్షఅనుభవిస్తున్న ఆమె తల్లిదండ్రులు ఇవాళ జైలు నుంచి విడుదలయ్యారు. వీరిని నాలుగు రోజుల క్రితమే నిర్ధోషులుగా పైర్కొంటు అలహాబాద్ హై కోర్టు తీర్పునిచ్చింది. అయినా ఆర్డర్ కాఫీ ఆలస్యంగా జైలుకు చేరడంతో వారు ఇవాళ విడుదలయ్యారు. గత నాలుగేళ్లుగా దాస్నా జైల్లో శిక్షఅనుభవించిన వారు ఎట్టకేలకు నిర్దోషులుగా బైటపడ్డారు.
యాదాద్రి భువనగిరి : యాదగిరి గుట్ట భక్తులపై జీఎస్టీ ప్రభావం పడనుంది. జీఎస్టీ అమలు కారణంగా యాదాద్రి పుణ్యక్షేత్రంలో లడ్డూ, పులిహోర ధరలు పెరిగాయి. లడ్డూ ధర రూ. 15 నుంచి రూ. 20కి, అభిషేకం లడ్డూ ధర రూ. 60 నుంచి రూ. 100కు, పులిహోర ధర రూ. 10 నుంచి రూ. 15కు పెంచారు. పెరిగిన ధరలు ఈ నెల 20 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఆలయ ఈవో గీతారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ లో భారీ స్థాయిలో నకిలీ డ్రగ్స్ ను తయారుచేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. చైతన్యపురి ప్రాంతంలో నకిలీ డ్రగ్స్ తయారవుతున్నాయన్న సమాచారంతో రాచకొండ పోలీసులు తయారీ కేంద్రంపై దాడి చేశారు. గర్భిణిలు ఎక్కువగా ఉపయోగించే ప్రోటీన్ పౌడర్, టానిక్స్, పిల్లలు తాగే మిల్క్ పౌడర్‌లను ఈ ముఠా వద్ద పోలీసులు గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు.వీటి విలువ సుమారు ఐదు వందల కోట్ల రూపాయలుంటుందని భావిస్తున్నారు.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ తయారీ కేంద్రం సహయజమానిగా గుర్తించిన రాజేందర్ రెడ్డి కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు.
వరంగల్ జిల్లాలోని హన్మకొండ లో ప్రమాదం జరిగింది. స్థానిక రోహిణి హాస్పిటల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆసుపత్రిలోని గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. వెంటనే ఆసుపత్రి సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో భారీ ప్రమాదం తప్పింది.
ఆసుపత్రిలోని మూడో ఫ్లోర్ లో మొదలైన మంటలు ఆస్పత్రి మొత్తానికి వ్యాపించాయి.దీంతో ఆసుపత్రిలోని రోగులందరిని వెంటనే బయటకు తరలించారు. అయితే ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో ఇద్దరు రోగులు మృతిచెందగా, మరికొంత మంది రోగులకు, ఆసుపత్రి సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తం కావడంతో ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఈ ప్రమాదనికి సంబంధించి మరిన్న వివరాలు తెలియాల్సి ఉంది.
వరంగల్ అర్బన్ : కరిమాబాద్ కౌటిల్య హై స్కూల్ లో విషాదం చోటుచేసుకుంది. స్కూల్లో మెట్లపైనుంచి జారిపడి శ్రీ హర్షిత అనే 9వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకుని బోరున విలపిస్తున్నారు.
స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కూతురు మృతి చెందిందని విద్యార్థి ని తల్లి తండ్రులు ఆరోపిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీపావళి పండుగ సెలవుల్లో మార్పులు చేసింది. ఈ నెల 18 న ఐచ్చిక సులవును, 19 న సాధారణ సెలవును ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు ప్రకటించిన తేదీలపై ఉద్యోగులు, పండితుల నుండి అభ్యంతరాలు వ్యక్తమవడంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. ఈ రోజు వికారాబాద్ జిల్లాలోని పరిగిలో శ్రీకాంత్(16) అనే మరో బాలుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాంత్ స్వస్థలం నాగర్ కర్నూల్ కాగా పరిగిలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. శ్రీకాంత్ మృతితో ఇటు పరిగిలోను, అటు నాగర్ కర్నూల్ లోను విషాద చాయలు అలుముకున్నాయి. అయితే శ్రీకాంత్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కేంద్రంలో ప్రియుడు మోసం చేశాడంటూ ఓ యువతి అతడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. వివరాల్లోకి వెళితే మద్దుల రుచిత (18),మెట్టు శశిధర్ (20) లు గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకొంటున్నారు. వీరి ప్రేమను పెద్దలు కూడా అంగీకరించారు.
అయితే పెళ్లి విషయం ప్రస్తావనకు వచ్చేసరికి శశిధర్ మొహం చాటేశాడు. అమ్మాయిని తప్పించుకుంటూ తిరగుతుండటంతో యువతి అతడి ఇంటిముందు బైటాయించింది. శశిధర్ కాని అతడి తల్లిదండ్రులు గాని పెళ్లికి అంగీకరించేంత వరకు ఈ పోరాటం ఆపనని ఆమె తెలిపింది.
సికింద్రాబాద్ లోని మాదన్న పేట్ లో డిగ్రీ యువతి అదృశ్యమయింది. వివరాల్లోకి వెళితే కేవి రంగారెడ్డి ఉమెన్స్ కాలేజ్ లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న భవాని అనే యువతి కాలేజి కి వెలుతున్నాని చెప్పి ఇంట్లో నుండి బయటకు వెళ్లింది. రాత్రయినా ఆమె ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు యువతి ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో నారాయణ, చైతన్యల కంటే మెరుగైన కాలేజీలున్నాయని, వాటిని కాదని విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న వాటి చుట్టే విద్యార్థుల తల్లిదండ్రులు ఎందుకు తిరుగుతున్నారో తనకర్థం కావడం లేదని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఇవే కాకుండా చాలా కాలేజీల్లో ర్యాంకుల కోసం విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నారని అందువల్లే ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయని అన్నారు.
కార్పొరేట్ స్కూల్స్, కాలేజీల్లో జరుగుతున్నఆత్మహత్యలపై ఇవాళ ఆయన విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయర మాట్లాడుతూ... ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని యాజమాన్యాలకు సూచిస్తున్నామని,పాటించని యాజమాన్యాల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ ఆత్మహత్యలను ఆపడానికి ఈ నెల 17న కళాశాలల యాజమాన్యాలు, పేరెంట్స్ అసోసియేషన్ తో సమావేశమై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చిస్తామన్నారు.
కార్పోరేట్ కాలేజీలు, ఇంటర్నేషనల్ స్కూల్స్ లో కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కడియం విద్యాసంస్థలు సూచించారు.
తెలంగాణ లోని భూపాలపల్లి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, ఆయన కొడుకుల అవినీతి ఆగడాలు ఎక్కువయ్యాయని స్థానికి టీఆర్ఎస్ నేత, మార్కెట్ కమిటీ చైర్మన్ పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ఇటీవల జరిగిన సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో భూపాలపల్లి సెగ్మెంట్ లో ఓడిపోడానికి వీరి అక్రమ వసూళ్లే కారణమని ఆరోపించారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని స్పీకర్ ముగ్గురు తనయులు అక్రమాలకు పాల్పడటమే కాకుండా, దీన్ని ప్రశ్నించిన వారిని బెదిరింపులకు దిగుతున్నారని శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. వీరి అక్రమాలపై సీఎం దృష్టి పెట్టకుంటే భూపాలపల్లి లో పార్టీ నాశనమవడం ఖాయమని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
స్పీకర్ పైనే సొంత పార్టీ నాయకుడు ఇలా ఓపెన్ గా మాట్లాడటానికి టీఆర్ఎస్ లోని మరో వర్గం ప్రోత్సాహమే కారణమై ఉంటుందని స్థానిక కార్యకర్తలు భావిస్తున్నారు.
బీసీల కోసం పాటుపడుతున్నామని చెప్పుకుంటున్న తెలుగుదేశం ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే విజయవాడలో బీసీ భవన్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజి డిమాండ్ చేశారు. బిసి కులాలను ఓట్ల కోసం వాడుకుంటున్నారు తప్ప, వారికి చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
అధికార పక్షం ఇలా ఉంటే ప్రతిపక్ష వైసిపి కథ మరోలా ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా విజయవాడలో బీసీ భవన్ నిర్మాణాన్ని అడ్డుకున్న వారంతా ఇపుడు వైసీపిలో చేరి బిసిల గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారని ద్వజమెత్తారు. వారిలో ముఖ్యంగా వైకాపా నాయకులు మాజీ మంత్రి పార్థసారథి, మాజీ ఎంఎల్ఏలు జోగి రమేష్, మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్ లు ఉన్నారని,వీరంతా అసలైన బీసీ ద్రోహులని శివాజి విమర్శించారు. అప్పటి కాంగ్రెస్ సీఎం వైఎస్ ఇచ్చిన వరాలను కాల రాసిన వీరికి బీసీల ఎదుగుదల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. వీరంతా ముక్కు నేలకురాసి బిసీలందరికి క్షమాపణ చెప్పాలని, అయినా వారు క్షమిస్తారన్న నమ్మకం లేదని శివాజి విమర్శించారు.
భూపాలపల్లి జిల్లా జలగలంచ గ్రామంలో ఆదివాసుల పై ఫారెస్ట్ అధికారులు చేసిన దాడిని హైకోర్టు తప్పుపట్టింది. జలగలంచ గ్రామంలోని ఆదివాసుల ను ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేయంచొద్దని, వారికి వెంటనే మంచినీటి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది న్యాయస్థానం. అంతే కాకుండా ఈ ఘటనపై మూడు వారాల్లోగా కౌంటర్ ధాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
గిరిజనులపై పారెస్ట్ అధికారులు దాడి చేశారని పౌరహక్కుల సంఘం నేత కుంటి రవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున వాదన వినిపించిన న్యాయవాది రఘునాథ్ ఫారెస్ట్ అధికారులు 34 ఇండ్ల తో పాటు స్కూల్ ను కూడా ధ్వసం చేసారని పేర్కొన్నారు. షెడ్యూల్ ట్రైబ్ యాక్ట్, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ను ఉల్లగించిన వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై ప్రభుత్వ వాదనను విన్న తర్వాత తీర్పును వెలువరిస్తామన్న న్యాయస్థానం, తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం లో సాక్షి విలేకరి పై జరిగిన దాడికి నిరసనగా జర్నలిస్టులంతా కలిసి నిరసన చేపట్టారు. పట్టణం లోని పోలీస్ స్టేషన్ ముందున్న 63వ నెంబర్ జాతీయ రహదారిపై బైటాయించి రాస్తా రోకో నిర్వహించారు. నిజాయతీ, నిస్పక్షపాతంగా పనిచేసే తమపై దాడులు జరగడం భాధాకరమని అన్నారు. సాక్షి విలేకరిపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ఎస్పీ విద్యార్థి విభాగం ఘన విజయం సాధించడం పట్ల తెలంగాణ రాష్ట్ర సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షులు ప్రొ. సింహాద్రి హర్షం వ్యక్తం చేశారు. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ, కల్చరల్ సెక్రటరీగా ఎన్నికైన విద్యార్థి నాయకులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ... సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ నాయకత్వం వైపు యువత చూస్తోందని అన్నారు. దేశంలో మతతత్వ శక్తులను ఎదుర్కునే శక్తి అఖిలేష్ యాదవ్ నాయత్వంలోని ఒక్క సమాజ్‌వాదీకి మాత్రమే ఉందని సింహాద్రి అన్నారు.
బెంగళూరులోని ఎజిపుర ప్రాంతంలో వంటగ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం సంభవించింది. ఎజిపుర ప్రాంతంలో ఓ ఇంట్లో సిలిండర్ పేలుళ్ల దాటికి ఇల్లు కూలి ఆరుగురు మృత్యువాత పడ్డారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రెండంతస్థుల గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో భవనం కుప్పకూలడంతో పాటు, పక్కనే ఉన్న నాలుగు ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఓ నిండు గర్భిణి కూడా మృత్యువాతపడింది.
పేలుళ్ల విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాల సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు శిథిలాల కింది నుంచి ఇద్దరు చిన్నారులను సురక్షితంగా రక్షించారు. దీనిపై స్పందించిన కర్ణాటక ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కిషన్ గుడ వద్ద బెంగుళూరు - హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారుల తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించకుండా ప్రయాణికులను తరలిస్తున్న పది బస్సులపై కేసులు నమోదు చేసి, నాలుగు బస్సులు సీజ్ చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు నిబందనలు పాటించకపోవడం వల్ల ప్రమాదాలకు కారణమవుతున్నారని, అందువల్ల ఈ తనిఖీలు చేపడుతున్నట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు.
గుంటూరు జిల్లా : క్రికెట్ బుకీలతో చేతులు కలిపారన్న ఆరోపణలతో గుంటూరు జిల్లాలోని నరసరావు పేట టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఏడుగురు పోలీసుల సిబ్బంది పైన వేటు పడింది. ఎస్సైలు ఏడుకొండలు, హసన్, ఏఎస్సై సిహెచ్ శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు వసంతరవు,బాలాజీ నాయక్, హోంగార్డులువెంకటేశ్వరరెడ్డి, సైదులు పైన చర్యలు తీసుకుంటూ రూరల్ ఎస్పీ అప్పలనాయుడు నిర్ణయం తీసుకున్నారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ప్రస్తుతం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 15 నిమిషాలుగా విద్యుత్ కి అంతరాయం కలిగి, సచివాలయం మొత్తం చీకటిగా మారింది.ఉద్యోగులు సోలార్ లైట్ ల వెలుగులోనే పనిచేస్తున్నారు. ఈ కరెంట్ కటకట మంత్రుల ఛాంబర్ల ను వదల్లేదు. అక్కడ కూడా కరెంట్ లేక అంధకారం అలుముకుంది. దీంతో సచివాలయం కు చేరుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది సమస్యను గుర్తించి, సరిచేయడానికి ప్రయత్నిస్తున్నారు.
సూర్యాపేట జిల్లా అర్వపల్లి లో విషాదం చోటుచేసుకుంది. భవాని అనే నాలుగునెలల గర్భిణి అనుమానాస్పద మృతి కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే అర్వపల్లికి చెందిన కుంకుడుపాల కిరణ్ కు, భువనగిరి కి చెందిన భవాని తో ఆర్నెల్ల క్రితమే వివాహం జరిగింది. అయితే గత కొంత కాలంగా అదనపు కట్నం కోసం కిరణ్ భార్యను వేధిస్తున్నాడు.
ఈ క్రమంలో నిన్న సాయంత్రం తన భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని,కిరణ్ సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కానీ తమ కూతురు ఆత్మహత్య చేసుకోలేదని,అల్లుడే తమ కూతురిని కొట్టి హత్య చేసి,ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కూతురు గర్భవతి అని కూడా చూడకుండా అల్లుడే ఈ హత్యకు పాల్పడ్డాడని, అతడిపై చర్మ తీసుకోవాలని వారు పోలీసులను వేడుకున్నారు.
హైదరాబాద్ : కార్పోరేట్ కాలేజీల ఒత్తిడి వల్ల అమాయక విద్యార్థుల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, దీనికి నిరసనగా ఇవాళ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేట్ విద్యాసంస్థల బంద్ ను చేపడుతున్నట్లు ఎబివిపి విద్యార్థి సంఘం తెలిపింది. ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రను వదలడం తేదని, వారిచ్చే కమీషన్ల కోసం కార్పోరేట్ కళాశాలలపై చర్యలు చేపట్టడం లేదని విద్యార్థి సంఘ నాయకులు మండిపడ్డారు. చదువుల పేరుతో , ఫీజుల పేరుతో చేస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక విద్యార్థులు పిట్టల్లా రాలుతున్నా, ప్రభుత్వం మాత్రం కార్పొరేట్ కాలేజీ లకు తొత్తులా వ్యవహరిస్తోందని ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అయ్యప్ప అన్నారు.