టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేని కి ఏపి ప్రభుత్వం నజరాన

First Published Sep 22, 2017, 11:30 AM IST
Highlights

విశేష వార్తలు

  • సాకేత్ మైనేనికి రూ.75 లక్షలు నగదు బహుమతిని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం
  • రు 4వేల వ్యాక్సిన్ రు 150 కే, చంద్రబాబుకు ఫైజర్ హామీ
  • ఇవాళ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న 52,079 భక్తులు  
  • నూజివీడు ర్యాగింగ్ ఘటనలో ఐదు కేటగిరీలుగా  శిక్షలు
  • సదావర్తి భూముల వేలంపాట కేసుపై సుప్రీం కోర్టు విచారణ
  • విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ

బతుకమ్మ పాటల సీడిని ఆవిష్కరించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ రమేష్ రంగనాథన్ 

తెలంగాణ జాగృతి  ఆద్వర్యంలో రూపొందిన బతుకమ్మ పాటల సీడీని నేడు హైకోర్టు చీఫ్ జస్టిస్ రమేష్ రంగనాథన్ హై కోర్ట్ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ప్రజల్లో నోళ్లలో నానుతున్న ప్రముఖ జానపద గాయకులు తయారు చేసిన పాటలను సీడిల రూపంలో ఒక్క దగ్గరకు చేర్చి ఆవిష్కరించారు. సాంప్రదాయ బతుకమ్మ పాటలు వెలకట్టలేని గొప్ప మౌఖిక సాహిత్యమని, వాటిని సేకరించి రికార్డు చేయడం మంచి విషయమని,దీనికి పూనుకున్న తెలంగాణ జాగృతి ప్రతినిధులను ఆయన అభినందించారు.  
 

రు 4వేల వ్యాక్సిన్ రు 150 కే, చంద్రబాబుకు ఫైజర్ హామీ

రాష్ట్రంలో ఒక్కో చిన్నారికి రూ. 150కే నిమోనియా వ్యాక్సిన్ వేస్తామని ‘ఫైజర్’(Pfizer)  సంస్థ వెల్లడించింది. ఈ వా క్సిన్ ఖరీదు నాలుగువేలదాకా ఉంటుందని తాము నూటాయాభై కే ఇస్తానమని  శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జరిగిన  సమావేశంలో ఫైజర్ ప్రతినిధులు తెలిపారు.  ‘భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం’ ప్రతినిధి బృందం ఈ ఈ రోజు ముఖ్యమంత్రితో సమావేశమైంది. రాష్ట్రంలో తామంతా అడుగుపెట్టేందుకు సిద్ధంగా వున్నామని ఫోరం ప్రతినిధులు ముఖ్యమంత్రికి పలు ప్రతిపాదనలను సమర్పించారు. ఇందులో భాగంగానే ఫైజర్ ప్రతినిధులు కూడా ముఖ్యమంత్రితో   మాట్లాడారు.
నిమోనియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం రాష్ట్రంలో పెద్దఎత్తున వ్యాక్సినేషన్ వేసేందుకు ‘ఫైజర్’ సంస్థ సన్నద్ధంగా వుంది. ప్రపంచవ్యాప్తంగా యునిసెఫ్‌తో కలిసి వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టామని ‘ఫైజర్’ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వెల్లడించారు. ఒక్కో డోసు రూ. 4 వేలు విలువైన వ్యాక్సిన్‌ను రూ. 150కే వేసేందుకు సిద్ధమని అన్నారు. దక్షిణ భారతదేశంలోనే ఎక్కువుగా ఏపీలో నిమోనియా బాధిత చిన్నారులు వున్నందున తక్షణమే వ్యాక్సినేషన్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి చెప్పారు. 
హిమోఫీలియా సహా అరుదైన వ్యాధుల నిర్ధారణ పరీక్షా కేంద్రాలను రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో నెలకొల్పుతామని ‘షైర్ ఫార్మాస్యుటికల్స్’ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి చెప్పారు. వైద్య రంగానికి అవసరమైన ఐటీ సేవలను అందించేందుకు సిద్ధమని తెలిపారు. రాష్ట్రంలో వైద్యులు తమ విజ్ఞానాన్ని మరింత పెంచుకునేలా అంతర్జాతీయ స్థాయి శిక్షణకు వర్క్‌షాపులను నిర్వహిస్తామని అన్నారు.

విజయవాడ దుర్గామాత ఆలయాన్ని సందర్శించిన భక్తులు  52,079

👉🏾 బాలత్రిపురసుందరి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని సాయంత్రం వరుకు 52,079 భక్తులు అమ్మవారిని  సందర్శించుకున్నారని విజయవాడ కనకదుర్గ ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూర్యకుమారి తెలిపారు. ఈ రోజు ఆలయ దర్శన  సమాచారం
👉🏾 300 /- టికెట్స్ 2807 కొనుగోలు 
👉🏾100 /- టికెట్స్  4570 కొనుగోలు జరిగాయి...
👉🏾 54000 లడ్డూ అమ్మకాలు
👉🏾 పులిహార అమ్మకాలు 27400 
👉🏾 అన్నదానంలో 10436  భక్తులు పాల్గొన్నారు..
👉🏾రాత్రి 10లోపు లైన్లో ఉన్న భక్తులకు మాత్రమే దర్శనం ఉంటుంది..
👉🏾 మల్లేశ్వర స్వామి గుడి విషయంలో భక్తులు ఇబ్బందులు మాట వాస్తవమే.
👉🏾 రేపటి నుండి ఈ పదిరోజులు ఉత్సవవిగ్రహాలైన ఏర్పాటు చేయాలని అధికారులని ఆదేశిస్తాం..

టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేని కి ఏపి ప్రభుత్వ నజరాన

అర్జున అవార్డు గ్రహీత ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేనికి రూ.75 లక్షలు నగదు బహుమతిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇవాళ మంత్రులు కామినేని శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావులతో కలిసి సాకేత్ ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సంధర్భంగా ముఖ్యమంత్రి సాకేత్ ను అభినంధించారు.
అలాగే విశాఖపట్నంలో  ప్రభుత్వం తరపున టెన్నిస్ అకాడమీ ఏర్పాటు చేసి సాకేత్ ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పించాలని అధికారులకు సీఎం సూచించారు.
ఈ సమావేశం అనంతరం సాకేత్ మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడలకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తోందని, దీనికి కారణం  ముఖ్యమంత్రి నిర్ణయాలేనని సాకేత్ చంద్రబాబును కీర్తించారు.

 తెలంగాణ లో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

ప్రభుత్వ ఉద్యోగులకు 2.096 శాతం డీఏ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  గతంలో 22.008 శాతంగా ఉన్న డీఏ ఈ పెంపుతో 24.104 శాతం అయింది. ఈ పెంచిన డీఏను 2017 జనవరి 1 నుంచి అమల్లోకి రానుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ డీఏ పెంపుతో రాష్ట్ర ఖజానా పై 580 కోట్ల భారం పడనుంది.

నూజివీడు ర్యాగింగ్ ఘటనలో ఐదు కేటగిరీల్లో  శిక్షలు

నూజీవిడు ర్యాగింగ్ ఘటనపై ఐదు కేటగిరీల్లో కఠిన చర్యలు తీసుకోనుప్పట్లు విద్యాశాఖ తెలిపింది. జూనియర్లపై దాడికి పాల్పడిన 57 మంది సీనియర్లపై ఈ చర్యలు తీసుకోనున్నారు. మొదటి కేటగిరీలో ఆరగురు విద్యార్థులకు టీసి ఇచ్చి శాశ్వతంగా బయటకు పంపాలని, రెండవ కేటగిరీలో 9 మందిని ఏడాది పాటు సస్పెన్స్ విధించి, పరీక్షలకు మాత్రం అనుమతించాలని నిర్ణయించింది. ఇక 3,4,5 కేటగిరీల్లో రెండు నెలల పాటు విద్యార్థులను సస్పెండ్ చేయాలని విద్యాశాఖ ట్రిపుల్ ఐటీ అధికారులను ఆదేశించింది.  

తెలంగాణ సిఎస్ తో శ్రీలంక బృందం భేటీ

భారత దేశ పర్యటనలో భాగంగా శ్రీ లంక జర్నలిస్టుల బృందం హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా వారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పి సింగ్ తో సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా సిఎస్ వారికి తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు.  
అలాగే తెలంగాణ రాష్ట్రం నుండి ఎంతో మంది యాత్రికులు శ్రీలంకను సందర్శిస్తున్నారని, ఎంతో మంది కాంట్రాక్టర్లు వివిధ అభివృద్ధి పనుల్లో పాలుపంచుకుంటున్నారని సిఎస్ గుర్తు చేశారు.  సాహిత్య, వాణిజ్య, ఆర్ధిక పరంగా శ్రీలంకతో   సంబంధాలు మెరుగ్గా ఉన్నాయని వారికి వివరించారు. 
  17 మందితో కూడిన  సీనియర్ ఎడిటర్లు, జర్నలిస్టులతో కూడిన ఈ బృందం పర్యటన ఈ నెల  24 వరకు హైదరాబాద్ లో కొనసాగనుంది.

సిబిఐ కోర్టుకు హాజరైన జగన్మోహన్ రెడ్డి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ సిబిఐ కోర్టులో హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో ఆయనతో పాటు వైసీపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి లతో పాటు ఐఏఎస్ అధికారిణి శ్రీ లక్ష్మి లు హాజరయ్యారు.
 

స్టేట్ ఎలిజిబుల్ టెస్ట్ ఫలితాల విడుదలకు లైన్ క్లియర్

ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించిన స్టేట్ ఎలిజిబుల్ టెస్ట్ ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయింది. గతంలో ఈ పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన పిటిషన్ విచారణ సంధర్బంగా తమ తదుపరి ఆదేశాల వరకు ఫలితాలు విడుదల చేయరాదని హైకోర్టు పేర్కొంది.  ఈ పిటిషన్ పై మరో సారి విచారన జరిపిన  ధర్మాసనం ఫలితాల విడుదల విధించిన స్టే ను ఎత్తివేసింది. వెంటనే ఫలితాలను విడుదల చేయాల్సిందిగా యూనివర్సిటి అధికారులను ఆదేశించింది.                  

సదావర్తి భూముల వేలంపాట పై సుప్రీంకోర్టు ఆగ్రహం

సదావర్తి భూముల వేలంపాటు కేసులో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ భూముల వేలంపై తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్ పై విచారించిన సుప్రీం, వేలంపాట జరుపుతున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రస్ట్ ఆస్తులే కదా అని తక్కువ ధరకే విక్రయానికి పెడితే కోర్ట్ కళ్ళు మూసుకొని కూర్చోదని విచారణ సంధర్బంగా చీఫ్ జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి వేలానికి రెండో వేలానికి మద్య 40 కోట్లు తేడా ఉండడాన్ని బట్టి చూస్తే ఈ వ్యవహారంలో ఏదో అవినీతి వ్యవహారం దాగుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.  
అయితే డబ్బుల చెల్లింపుకోసం రెండో బిడ్డర్ కు ఇప్పటికే నోటీసులు పంపించామని, ఈ గడువు సమయం రేపు మధ్యాహ్నం వరకు  ఉన్నందున విచారణను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. తర్వాతి విచారణలో దీనిపై పూర్తి సమాచారం అందిస్తామని ప్రభుత్వం తెలిపింది.
దీంతో సుప్రీంకోర్టు ఈ విచారణను అక్టోబర్ 6కి వాయిదా వేసింది.                    

విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో బండారు దత్తాత్రేయ (వీడియో)

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారిని మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సతీసమేతంగా దర్శించుకున్నారు.  అక్కడి పరిసరాలను పరిశీలించిన ఆయన, స్వచ్చ సేవ కార్యక్రమాన్నిఏపి సీఎం చంద్రబాబు చాలా బాగ చేస్తున్నారని ప్రశంసించారు.
ప్రతి ఏడాది మాదిరిగానూ ఈసారి నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమానికి చంద్రబాబుని  ఆహ్వానించడానికి విజయవాడ వచ్చానని దత్తాత్రేయ అన్నారు.ఈ రోజు సాయంత్రం సీఎంని కలిసి ఆహ్వానించనున్నట్లు తెలిపారు.
 

అబ్దుల్లాపూర్ మెట్ సర్పంచ్ పై వేటు

రాచకొండ :గత కొన్ని రోజుల నుండి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అబ్దుల్లాపూర్ మెట్ సర్పంచ్ సభిత దనుంజయ్ పై వేటు పడింది. ఆమెను సస్పెండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే  ఇకనుంచి  సర్పంచ్ భాద్యతలను ఉప సర్పంచ్  నిర్వర్తిస్తారని అధికారులు తెలిపారు.
 

గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

జనగామ జిల్లాలోని శామీర్ పేట్ గ్రామంలో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ...గ్రామంలో 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయడంపై స్థానిక ప్రజాప్రతినిధులను అభినందించారు.  గ్రామంలో హరితహారం లో భాగంగా మొక్కను నాటిన మంత్రి, వివిధ అభివృద్ది సనులను పరిశీలించారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని జూపల్లి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు, స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పాల్గొన్నారు.
 

click me!