ఎంపి కవితతో భేటీ అయిన శ్రమ కార్మిక బొగ్గు గని సంఘం నాయకులు

First Published Sep 19, 2017, 11:25 AM IST
Highlights

విశేష వార్తలు

  • వనజీవి రామయ్యకు ప్రధాని లేఖ
  • హెచ్ 1బీ వీసాల జారీని పున:ప్రారంభించిన అమెరికా ప్రభుత్వం 
  • తిరుమల శ్రీవారి లడ్డూకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎస్‌ఏ లైసెన్స్ 
  • విజయవాడలో ఆర్యవైశ్యుల నిరాహార దీక్షను సందర్శించిన అంబికా కృష్ణ
  • కంచ ఐలయ్యపై కేసు నమోదు చేయాలని సీఐడికి ఏపీ డీజిపి ఆదేశం 

టీబిజికేఎస్ కు పెరుగుతున్న మద్దతు

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తో శ్రమ కార్మిక బొగ్గు గని సంఘం నాయకులు ఇవాళ హైదరాబాద్ లో భేటీ అయ్యారు. త్వరలో జరగనున్న సింగరేణి ఎన్నికల్లో తమ సంఘం మద్దతు టీబిజికేఎస్ ఉంటుందని వారు కవితకు తెలియజేశారు. అలాగే సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం టీబిజికేఎస్ తరపున అద్యక్షురాలు కవిత చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసించారు.  
 ఈ భేటీలో శ్రమ కార్మిక బొగ్గు గని సంఘం అధ్యక్షుడు బీమా రంజిత్ పటేల్, పెద్దపల్లి అధ్యక్షుడు మేదరి జీవన్, కార్యదర్శి రామచంద్ర, మంచిర్యాల, భూపాలపల్లి అధ్యక్షులు కునమల్ల రమణ, ఆడెపు అభిలాష్  లు పాల్గొన్నారు.
 

కోటి మొక్కల రామయ్యకు ప్రధాని లేఖ

 

తెలంగాణ వనజీవి  కోటిమొక్కల రామయ్యకు ప్రధాని నరేంద్రమోదీ నుంచి లేఖ అందింది. ‘స్వచ్ఛతా హీ సేవా’ క్యాంపెయిన్ కు మద్దతు నీయాలని కోరుతూ ఆయన ఈ లేఖ రాశారు. కేంద్రం అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్‌కు మూడేండ్లు నిండిన సందర్భంగా ‘స్వచ్ఛతా హీ సేవా’  క్యాంపెయిన్ కు ప్రధాని అంకురార్పణ చేస్తున్నారు. దీనికి మద్దతు కోరుతూ ఆయన  వివిధ రంగాలలో ప్రముఖులకు లేఖలురాస్తున్నారు.  ఇప్పటికే పలువురు సినీతారులకు ఈ లేఖలందాయి. తెలుగు కు సంబంధించి మోహన్ బాబు, మహేశ్ బాబు, ప్రభాస్ వంటి వారికి ప్రధాని లేఖలు అందాయి. ఈ వరసలోనే పద్మశ్రీ వనజీవి కోటి మొక్కల రామయ్యకు ప్రధాని మోడీ లేఖ రాస్తూ  ‘స్వచ్ఛతా హీ సేవా’కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

 పర్యావరణ పరిరక్షణ కోసం రామయ్య చేస్తున్న సేవలను ప్రధాని ప్రశంసించారు.

హెచ్ 1బీ వీసాల జారీని పున:ప్రారంభించిన అమెరికా ప్రభుత్వం 
 

అమెరికా ప్రభుత్వం హెచ్ 1బీ వీసాల జారీ ప్రక్రియను పున:ప్రారంభించింది. ఐదు నెలల క్రితం ఈ వీసాలను జారీని నిలిపివేసిన ట్రంప్ ప్రభుత్వం మళ్లీ పరిమితులతో కూడిన వీసాల జారీకి ఆదేశించింది. ఈ నిర్ణయం వల్ల ఇండియన్ టెకీలు లభ్ది పొందనున్నారు. 2018 కి గాను 65 వేల హెచ్ 1బీ వీసాలు జారీ చేయనున్నట్లు ఇమ్మిగ్రేషన్ సర్వీస్ అధికారులు తెలిపారు.  ఈ వీసా పొందాలనుకునే వారు తమ కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు తెలిపారు.
 

శ్రీవారి లడ్డూకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎస్‌ఏ లైసెన్స్

తిరుమల లో శ్రీవారి లడ్డూతయారీకి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వద్ద టీటిడి అధికారులు లైసెన్స్ తీసుకున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన లడ్డూ మరింత నాణ్యతగా, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎస్‌ఏ నిబంధనల ప్రకారం తయారుకానుంది. గతంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎస్‌ఏ అనుమతి అవసరం లేదని, లడ్డూను ప్రసాదంగా చూడాలని, ఇది ఆహారపదార్థం కాదని టీటీడి వాదించింది. కానీ ఇపుడు లైసెన్సు కోసం ప్రభుత్వంతో పైరవీలు చేయించిమరీ అనుమతి పొందడం ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది. 

కంచ ఐలయ్యకు వ్యతిరేకంగా విజయవాడలో నిరాహార దీక్ష (వీడియో)

కంచ ఐలయ్య ఆర్య వైశ్యులను కించపరుస్తూ రాసిన పుస్తకానికి వ్యతిరేకంగా విజయవాడ లో డుండి రాకేష్ చేస్తున్న అమరణ నిరాహారదీక్ష 3 వ రోజుకి చేరుకుంది. ఇవాళ  ఈ దీక్షా శిబిరాన్ని ఏపి పిల్మ్ డెవలప్ మెంట్ బోర్డు చైర్మన్ అంబికా కృష్ణతో తో పాటు టిడిపి నేత దేవినేని అవినాష్ లు సందర్శించి దీక్షకు మద్దతు తెలిపారు. అలాగే ఆర్య వైశ్య నాయకులు కూడా దీక్షా శిబిరానికి భారీగా తరలివస్తున్నారు. ఈ సందర్బంగా ఆర్యవైశ్య  సంఘాల ఆద్వర్యంలో సత్యనారాయణపురం నుండి వస్త్రలత వరకు   భారీ ర్యాలీ నిర్వహించారు.
 

 ఎమ్మెల్యేల అనర్హతపై మద్రాస్ హైకోర్టు విచారణ

తమిళనాడు లో అనర్హతకు గురైన ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు. తమను అనర్హులుగా ప్రకటించడం చట్ట విరుధ్దమని పేర్కొంటూ దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం..విచారణకు ఆదేశించారు.                      

కంచ ఐలయ్యపై ఏపీలో కేసు నమోదు

అమరావతి : ప్రొఫెసర్‌ కంచ ఐలయ్యపై  కేసు నమోదు చెయ్యాలని సీఐడీ అధికారులను ఏపీ డీజిపి     నండూరి సాంబశివరావు ఆదేశించారు. తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా పుస్తకాన్ని రాసి కులాల మద్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ ఆయనపై పలు ఆర్యవైశ్య సంఘాల ఫిర్యాదు  చేయడంతో ఆయనపై చర్య తీసుకోవాల్సిందిగా డీజిపి సీఐడీని ఆదేశించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలమేరకే డీజిపి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.                          

click me!