సింగపూర్ లో బతుకమ్మ వేడుకలు

First Published Sep 11, 2017, 10:46 AM IST
Highlights
  • సింగపూర్ లో బతుకమ్మ వేడుకలు
  • హుజూర్ నగర్ లో జరిగిన జి.ఓ 39  వ్యతిరేక ధర్నాలో పాల్గొన్న పీసిసి చిఫ్ ఉత్తమ్ 
  • ఓయూకి చేరిన డీఎస్సి మహా పాదయాత్ర
  • జీవో 39 కి వ్యతిరేకంగా కల్వకుర్తి లో కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా
  • తెలంగాణ ప్రభుత్వం పై సుప్రీం కోర్టు ఆగ్రహం  

ఐలయ్యకు బాసటగా నిలిచిన అసదుద్దిన్ ఓవైసీ

హైదరాబాద్: సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు పేరుతో పుస్తకాన్ని విడుదల చేసిన పుస్తక రచయిత ప్రొపెసర్ ఐలయ్యకు ఆర్య వైశ్యుల నుంచి బెదిరింపులు ఎక్కువయ్యాయి. దీనిపై స్పందించిన ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసి ఐలయ్యకు బాసటగా నిలిచారు. ఆయనపై దాడులు జరిగే అవకాశం వున్నందున ప్రభుత్వంమే రక్షన కల్పించాలని కోరారు.
 ఇప్పటికే తనకు రక్షణ కల్పించాలని ఐలయ్య ఉస్మానియా పోలీసులను ఆశ్రయించాడు. అయితే ఆయనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు నమోదయింది. దీంతో పోలీసులు న్యాయ సలహా తీసుకుని తదుపరి చర్యలు లీసుకుంటామని చెబుతున్నారు. 
 

సింగపూర్ లో బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ పండగను సింగపూర్ లో అట్టహాసంగా నిర్వహించడానికి ప్రవాస తెలంగాణవాసులు ఏర్పాట్లు చేస్తున్నారు. సింగపూర్ లోని సంబవాంగ్ పార్కులో ఉత్సవాలను నిర్వహించడానికి  తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్(టీసీఎస్ఎస్) సిద్దమైంది. సెప్టెంబర్ 23 న జరిగే బతుకమ్మ వేడుకలకు సింగపూర్ లోని తెలంగాణ వాసులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఆ వేడుకల ప్రచారం కోసం రూపొందించిన పోస్టర్ ను విడుదల చేశారు.    
 ఈ వేడుకల వివరాల కోసం సమన్వయకర్తలైన ముదం స్వప్న, మొగిలి సునిత రెడ్డి, నడికట్ల కళ్యాణి, గోనె రజిత, చిట్ల విక్రమ్, నగేష్, రాజశేఖర్ మరియు ప్రదీప్ లను సంప్రదించవచ్చని నిర్వహకులు పేర్కొన్నారు.
 

ప్రజా పోరాటాలను దాడులతో ఆపలేరు

రైతు సమన్వయ సమితిల ఏర్పాటు కోసం తీసుకువచ్చిన జి.ఓ 39 కి వ్యతిరేకంగా హుజూర్ నగర్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ  ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తీసుకువచ్చిన 39జీవో పైన ఉద్యమం చేయడం ప్రతిపక్ష పార్టీ గా తమ బాధ్యత అని పేర్కొన్నారు.   
అలాగే  వనపర్తి  ఎమ్మెల్యే చిన్నారెడ్డి పై జరిగిన  దాడిని ఉత్తమ్ ఖండించారు. దాడులతో ప్రజా పోరాటాలను అడ్డుకోవాలని చూస్తే ఉద్యమాలు మరింత విస్తృతమవుతాయని హెచ్చరించారు. ఇలాగే దాడులు చేసి ప్రతిపక్షాలను అడ్డుకోవాలని చూస్తే తీవ్రంగా ప్రతిగటిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
 

 చెరుకు సుధాకర్ ను పరామర్శించిన రేవంత్ రెడ్డి

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ ఇంటిపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ని టీడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న రేవంత్ తొందరగా నయం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. 
 

ఓయూకి చేరిన డీఎస్సీ మహా పాదయాత్ర
 

కేయూలో ప్రారంభమైన మెగా డిఎస్సీ మహా పాదయాత్ర  7 రోజుల తర్వాత ఓయూ కి చేరింది.  పాదయాత్రలో పాల్గొన్న సహచరులకు ఓయూ విద్యార్థులు ఘనస్వాగతం పలికారు.ఈ సందర్భంగా  మహా పాదయాత్రకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు,విద్యార్థులకు, నిరుద్యోగులకు  ధన్యవాదాలు తెలిపారు. 149 కిమిలు పాదయాత్రను చేపట్టినా డీఎస్సీపై  ప్రభుత్వం స్పందించకపోవడాన్ని వారు తప్పేపట్టారు. త్వరలో ఓయూలో జరగబోయే నిరుద్యోగ గర్జనలో ప్రభుత్వానికి బుద్ది చెప్పేలా కార్యాచరణను ప్రకటిస్తామని వారు తెలిపారు.

రాజకీయ నాయకుల అక్రమాస్తులపై దర్యాప్తు
 

రాజకీయ నాయకుల ఆస్తులపై సుప్రీం సంచలన తీర్పు వెలువరించింది. దేశంలోని వివిధ రాష్టాలకు చెందిన ఏడుగురు ఎంపీలు,98 మంది ఎమ్మేల్యేల అక్రమ ఆస్తులపై దర్యాప్తు జరపాలంటూ సీబీడీటీ (సెంటర్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ టాక్సస్)ను సుప్రీం కోర్టు ఆదేశించింది. వీరి జాబితాను సీల్డ్ కవర్ లో సీబీఐటీ కి అందించింది. యూపీ లోని లోక్ ప్రహారి  స్వచ్చంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం పై విధంగా తీర్పునిచ్చింది.
 

కర్నూలులో కంచె ఐలయ్య పై కేసు
 

ఆర్య వైశ్యులను కించపరుస్తూ పుస్తకం రాసిన కంచె ఐలయ్యపై కర్నూలు లో కేసు నమోదయింది. కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆర్యవైశ్యుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు టీజీ భరత్ ఐలయ్య పై ఫిర్యాదు చేసాడు. ఐలయ్యపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోకుంటే ఆందోళనలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.  ఐలయ్య పై కులాల మద్య చిచ్చు పెట్టడానికే ఇలాంటి పుస్తకాలు రాస్తున్నారని విమర్శించారు. 
 

రైతులను సంఘటితం చేయడానికే సమన్వయ సమితిలు 

నిర్మ‌ల్ జిల్లా: రాష్ట్రంలోని రైతులను సంఘటితం చేసేందుకే గ్రామాల్లో రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేస్తున్నట్లు గృహ నిర్మాణ‌,న్యాయ‌,దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పేర్కొన్నారు.   సోన్ మండల కేంద్రంలో జరిగిన రైతు సమన్వయ సమితి  అవగాహన సదస్సుకు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఇకపై రైతులు రుణాలు, సబ్సిడీ పరికరాలు, విత్తనాలు పొందేందుకు సమన్వయ సమితులు కీలకపాత్ర పోషిస్తాయని చెప్పారు.

వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి పై దాడి

వనపర్తి జిల్లా పెబ్బేరులో రైతు సమన్వయ సమితి కార్యక్రమంలో వ్యవసాయ అధికారిని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. 

చెన్నమనేని రమేష్ పౌరసత్వం రద్దుపై హైకోర్టు స్టే 

హైకోర్టులో చెన్నమనేని రమేష్ కు ఊరట లభించింది. ఆయన పౌరసత్వ రద్దు అంశంపై విచారణ జరిపిన కోర్టు 6 వారాల వరకు స్టే విధించింది. ఈ ఆరు వారాల్లోగా  సెక్షన్ 5a కింద నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోంశాఖ కు హైకోర్టు అదేశించింది.
 

1,77,000 మందితో రైతు సమన్వయ సమితిల ఏర్పాటు (వీడియో)
 

రైతులకు అండగా ఉంటూ, సలహాలు ఇవ్వడానికే రైతు సమన్వయ సంఘాలను ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. వీటిని రాజకీయ నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేశామని ప్రతిపక్షాలు విమర్శించడం తగదన్నారు.  ఇవాళ భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్ముపేట, ఖమ్మం జిల్లా పెనుబల్లిలలో జరిగిన  "రైతు సమన్వయ సమితులకు అవగాహన సదస్సు" కార్యక్రమంలో ఆయన  పాల్గొన్నారు.  రాష్ట్రంలోని మొత్తం 10733 గ్రామ సంఘాలు,  577 మండల రైతు సమన్వయ సంఘాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తంగా 1,77,000 మంది ఈ రైతు సమితులలో సభ్యులుగా ఉంటారని  మంత్రి తెలిపారు. 
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మంత్రితో పాటు రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
 

కల్వకుర్తిలో కాంగ్రెస్ నేతల ధర్నా

రైతు సమన్వయ సమితుల ఏర్పాటు కోసం జారీ చేసిన జీవో 39ని వెంటనే రద్దు చేయాలని  డిమాండ్‌ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి లో కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు.   ఎమ్మార్వో కార్యాలయం వద్ద చేపట్టిన ఈ కాంగ్రెస్ పార్టీ రైతు ధర్నాలో  ఎమ్మేల్యే వంశీచంద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...  రైతు సమితుల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను అడ్డుకుని, జీవో 39 రద్దయ్యేవరకు  పోరాడతామని  హెచ్చరించారు. 
 

 తెలంగాణ  ప్రభుత్వం పై సుప్రీం కోర్టు ఆగ్రహం
 

ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం సర్కారు బడుల్లో టీచర్ల నియామకం చేపట్టకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో సెప్టెంబర్‌లోగా నియామకాలు పూర్తిచేస్తామని తెలిపిన ప్రభుత్వం,మళ్లీ ఇపుడు వాయిదా కోరడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అసలు ఇప్పటివరకు నియామకాలు చేపట్టకపోవడానికి గల కారణాలు తెలపాలని ఆదేశించింది. అందుకోసం తదుపరి విచారణకు తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి తమ ఎదుట హాజరుకావాలని  ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్‌ 28కి వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం.  

అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జోగు రామన్న 

హైద‌రాబాద్: ఇవాళ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా నెహ్రూ జూ పార్క్ లో జరిగిన కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన అడవుల రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులు అర్పించారు. అటవీ సంపదను కాపాడడాన్ని ప్రతి ఒక్కరు సామాజిక భాద్యతగా భావించాలని పిలుపునిచ్చారు. సహజ వనరులను కాపాడటానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, అడవులను పేంచే ఉద్దేశంతోనే హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. 
 

 ఆప్తోమెట్రీ  వరల్డ్ కాంగ్రెస్ సదస్సులో  పాల్గొన్న మంత్రి లక్ష్మారెడ్డి   
 

హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరుగుతున్న ఆప్తోమెట్రీ 2వ వరల్డ్ కాంగ్రెస్ సమావేశాలను  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి ప్రారంభించారు.  కంటి ఆరోగ్యం, నాణ్యమైన చూపు, అందరికీ అందుబాటులో ఉండాలన్న లక్ష్యం తో  మూడు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ...  ప్రపంచానికి హెల్త్ హబ్ గా మారిన హైదరాబాద్ లో ఈ సమావేశాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. బంగారు తెలంగానే కాదు, ఆరోగ్య తెలంగాణ ను సాధించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి ప్రపంచ సదస్సులు     అంధత్వ నివారణకు తోడ్పడతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇండియా విజన్ సీఈఓ వినోద్ డేనియల్, అప్తోమెట్రీ వరల్డ్ కౌన్సిల్ ఎండి స్యూ చైలిస్, అధ్యక్షురాలు ఉదోకు ఉదం, ఛైర్ పర్సన్ కెవిన్ నాయుడు, శమిమ్ రజాక్ తదితరులు పాల్గొన్నారు.

click me!