2026 వరకు నియోజకవర్గాల పెంపు లేనట్లే

First Published Sep 8, 2017, 11:00 AM IST
Highlights

విశేష వార్తలు

  •  2019 జనవరి నాటికి కుతుబ్ షాహి టూంబ్స్ మెుదటి దశ పునరుద్దరణ పనులు పూర్తి 
  • 2026 వరకు నియోజకవర్గాల పెంపు ఉండదన్న భన్వర్ లాల్
  • మాజీ అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం కు ఆత్మీయ సత్కారం
  • తెలంగాణలో  ఇవాళ, రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం 

మహా బతుకమ్మను విజయవంతం చేద్దాం

తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 26 న   ఎల్బీ స్టేడియంలో ప్రతిష్టాత్మకంగా  తలపెట్టిన మ‌హా బ‌తుక‌మ్మ వేడుక‌ ను విజయవంతం చేయాలని తెలంగాణ జాగృతి కార్య‌క‌ర్త‌కు జాగృతి అద్యక్షురాలు కవిత  సూచించారు. ఈ వేడుకలో మహిళలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పండగ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన నాటి నుండి రాష్ట్ర  ప్ర‌భుత్వం బ‌తుక‌మ్మ పండుగ‌ను రాష్ట్ర పండుగా ప్రకటించడం మన పండుగలకు దక్కిన పెద్ద గౌరవంగా పేర్కొన్నారు.  తెలంగాణ సాంస్కృతిక  శాఖ  ఇత‌ర రాష్ట్రాలు, విదేశాల్లో నిర్వ‌హించే బ‌తుక‌మ్మ సంబురాల‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న తెలంగాణ జాగృతి కార్య‌క‌ర్త‌లు విజ‌య‌వంతం చేస్తున్నారని, వారిని అభినందించకుండా ఉండలేక పోతున్నానని ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత తెలిపారు.
 

నో ప్లై లిస్ట్ విడుదల

ఇటీవల విమానయాన సిబ్బందిపై పెరుగుతున్న దాడులపై కఠినంగా వ్యవహరించాలని కేంద్ర విమానయాన శాఖ నిర్ణయించింది. ఇందుకోసం నో ప్లై లిస్టును విడుదల చేసింది.ఇందులో విమానాల్లో మూడు కేటగిరిలలో నిషేదాన్ని విధించనున్నట్లు పేర్కొంది. మొదటి కేటగిరిలో దురుసు ప్రవర్తనకు 3 నెలల నిషేదం, రెండవ కేటగిరిలో దాడికి పాల్పడినట్లయితే 6 నెలలు నిషేదాన్ని విధించనున్నారు. ఇక మూడవ కేటగిరిలో హత్యాయత్నానికి పాల్పడితే 2 సంవత్సరాల నిషేదం విధించనుంది.
 

ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

హైదరాబాద్ : రవీంద్రభారతిలో జరిగిన గురు పూజోత్సవ కార్యక్రమంలో  ఉత్తమ ఉపాధ్యాయులను విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఘనంగా సన్మానించారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై అవార్డు తీసుకుంటున్న టీచర్లపై మరింత బాధ్యత పెరిగిందని, ఇంకా బాగా పనిచేసి విద్యార్థులకు నాణ్యమైన బోధన  అందించి ప్రభుత్వ పాఠశాలను ఉత్తమ పాఠశాలగా తీర్చిదిద్దాలని అన్నారు. గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, ప్రత్యేక అతిధులుగా ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ హాజరయ్యారు. 

వచ్చే జనవరి కల్లా కుతుబ్ షాహి టూంబ్స్ రెడీ (వీడియో) 
 

కుతుబ్ షాహి టూంబ్స్ మెుదటి దశ పునరుద్దరణ పనులను వచ్చే జనవరి కల్లా పూర్తవుతాయని తెలంగాణ టూరిజం కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.తెలంగాణ టూరిజం కార్యదర్శి బుర్రా వెంకటేశం,  అగాఖాన్ ట్రస్ట్  డైరెక్టర్  ఎమన్ మహిర్ లు సచివాలయంలో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో కులికుతుబ్ షాహి టూంబ్స్ అధునికీకరణ పనులపై చర్చించారు. సమావేశం వివరాలను తెలంగాణ టూరిజం కార్యదర్శి బుర్రా వెంకటేశం మీడియా కు వివరించారు. డిల్లీ లోని హూమాయిన్ టూంబ్స్ పునరుద్దరణ  స్థాయిలో హైదరాబాద్ లోని కులికుతుబ్ షాహి టూంబ్స్ ను పునరుద్దించే బృహత్ కార్యక్రమాన్ని అగాఖాన్ ట్రస్ట్ చేపడుతోందని ఆయన తెలిపారు. అందుకోసం సుమారు 100 కోట్ల సొంత నిధులతో పాటు పురావస్తూ శాఖ ద్వారా మరో 100 కోట్ల నిధులతో పునరుద్దరణ కార్యక్రమాలు  చేపడుతున్నట్లు వెంకటేశం తెలిపారు. 

2026 వరకు నియోజకవర్గాల పెంపు లేనట్లే
 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి నియోజకవర్గాల పెంపు ఉండబోదని తెలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ స్పష్టం చేశారు.  ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమలకు వచ్చి శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం, ఏపీలోని అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెరగాల్సి వున్నాయని,  అయితే 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026 వరకూ పునర్విభజనకు అవకాశం లేదని ఆయన అన్నారు.                                                              

రాజా సదారాం కు ఆత్మీయ సత్కారం

ఇటీవల అసెంబ్లీ కార్యదర్శిగా పదవీవిరమణ చేసిన రాజా సదారామ్ కు  తెలంగాణ ప్రభుత్వం ఆత్మీయ సత్కారం నిర్వహించింది. ఈ సత్కార కార్యక్రమంలో పాల్గొన్న అధికార, ప్రతిపక్ష నేతలు సదారాం అసెంబ్లి కార్యదర్శిగా వందకు వంద మార్కులు సాధించారని కొనియాడారు.  శాసన సభ , మండలి బాగా నడవడానికి సదారామ్ ప్రభుత్వ సలహాలతో పాటు, విపక్షాల సహాకారం కూడా కోరే వారని ఆయన పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ సన్మాన కార్యక్రమంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఉప సభాపతి పద్మా దేవేందర్ రెడ్డి, ప్రతిపక్ష నేత జానారెడ్డి, మండలి సభ్యులు హబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. 

 

 

బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి వికలాంగుల విన్నపం

2012 లో నిర్వహించిన డిఎస్సి లో వికలాంగుల కోటలో మిగిలిన పోస్టులను జీఓ 23 ప్రకారం అర్హులైన వికలాంగ అభ్యర్థులతో భర్తీ చేయాలని తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి ని కోరారు. అయితే వికలాంగుల కార్పొరేషన్ నుంచి ఈ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ కి సంభందించి చట్టపరమైన అంశాల గురించి ప్రభుత్వానికి నోట్ ఇస్తే దీనిపై ఆలోచిస్తామని కడియం ఆయనకు వివరించారు. కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పాత బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి గల అవకాశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.
 

ఇవాళ, రేపు తెలంగాణలో మోస్తరు వర్షాలు

తెలంగాణలో శుక్ర, శనివారాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. కొన్నిచోట్ల మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణపై ఏర్పడిన ద్రోణి ప్రభావంతో అన్ని జిల్లాల్లోనూ జల్లులు కురుస్తాయని తెలిపింది. కాగా గడిచిన 24 గంటల్లో ఖమ్మం జిల్లా అశ్వారావుపేట, కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లలో 7సెం.మీ. వర్షం కురిసింది.మిగతా నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, వరంగల్లు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 3నుంచి 5సెం.మీ వర్షం కురిసింది.

click me!