ఏషియానెట్-తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్

First Published Sep 7, 2017, 10:56 AM IST
Highlights

విశేష వార్తలు

  • సెప్టెంబర్ 20 నుంచి 28 తేదీ వరకు బతుకమ్మ ఉత్పవాల నిర్వహణ - సీఎస్
  • చింతలపూడి రెండో దశ ఎత్తిపోతల పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
  • మెట్రో మొదటిదశను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ
  • పాత బస్తీలో యువకుడిపై దాడికి పాల్పడిన దుండగులు (వీడియో)
  • రక్షణ శాఖ బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్

 35 వేల మంది తెలంగాణ ఆడపడుచులతో బతుకమ్మ సంబురాలు
 

హైదరాబాద్ :  సెప్టెంబర్ 26 వ తేదిన ఎల్బీ స్టేడియం లో 35 వేల మంది తెలంగాణ ఆడపడుచులతో బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నట్లు సీఎస్ ఎస్పీ సింగ్ తెలిపారు. ఆయన ఇవాళ బతుకమ్మ పండగ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 20 నుంచి 28 తేదిల్లో పల్లెపల్లెన బతుకమ్మ ఉత్పవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. సద్దుల బతుకమ్మ రోజున ట్యాంక్ బండ్ పై నిమజ్జన ఏర్పట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బతుకమ్మ చీరల పంపిణి  కార్యక్రమాన్ని కూడా పకడ్బందీగా చేయాలని అధికారులను సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో డీజీపీ అనురాగ్‌శర్మ,  సిపి మహేందర్‌ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టుకు శంకుస్థాపన
 

చింతలపూడి రెండో దశ ఎత్తిపోతల పనులకు సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు.కృష్ణా జిల్లాలోని రెడ్డి గూడ మండలం మద్దుల పర్వ వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన భూమి పూజ చేశారు.    ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 3,200 కోట్ల నిధులను కేటాయించినట్లు సీఎం తెలిపారు. 2 లక్షల ఎకరాలకు నీరందించే బృహత్తర ప్రణాళికతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. అందులో భాగంగా నిర్మించిన ఫైలాన్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
 

పోలీసుల అదుపులో కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప 

మంగుళూరు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పతో పాటు పలువురు బీజేపి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేకుండా బిజేపి యువమోర్చ ఆద్వర్యంలో బైక్ ర్యాలీ చేపడుతుండటంతో వారిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమీషనర్ తెలిపారు. కేవలం నెహ్రూ మైదానంలో ధర్నాకు మాత్రమే వారికి అనుమతిచ్చామని, ఇలా బయట ర్యాలీలు చేయడానికి కాదని ఆయన తెలిపారు. 
 

బాసరలో జేఏసి పోస్టర్ లాంచింగ్ 

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో  చేపట్టనున్న 5 వ విడత అమరవీరుల స్ఫూర్తి యాత్రకు టీ జేఏసీ ఏర్పాట్లు చేస్తుంది. అందులో భాగంగా బాసరలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర టీజేఏసీ నాయకులు గోపాలశర్మ, రతన్ రావులు పాల్గొని స్పూర్తి యాత్ర పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జెఎసి జిల్లా కన్వీనర్ రామకృష్ణ  గౌడ్, ముదోల్ జెఎసి చైర్మన్ ఆర్ రమేశ్, బాసర జెఎసి చైర్మన్ మనోహర్, నిజామాబాద్ జిల్లా కన్వీనర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. 
 

 హైదరాబాద్ మెట్రో ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

హైదరాబాద్ లో నిర్మించిన మెట్రో రైల్ ప్రాజెక్టు మొదటిదశను ప్రారంభించాల్సిందిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆహ్వానించారు. ఈ మేరకు ప్రధానికి గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. ఈ ఏడాది నవంబర్ 28 నుంచి 30 వరకు హైదరాబాద్ లో జరిగే ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నందున అదే సమయంలో హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం కూడా చేయాలని సిఎం కోరారు.

పట్టణ ప్రాంత ప్రజల రవాణా కోసం నిర్మిస్తున్న ప్రతిష్టాత్మకమైన, అతి పెద్ద ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు నిలుస్తుందని ముఖ్యమంత్రి ఈ లేఖలో పేర్కొన్నారు. రూ.15000 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు.. దేశంలోనే అతి పెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ (పిపిపి) ప్రాజెక్టు అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. గత మే నెల 25నే మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించిన విషయాన్నిగుర్తు చేసిన సిఎం, నవంబర్ నెలలో ఈ కార్యక్రమం పెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు వెల్లడించారు.

మూడు కారిడార్లలో మొత్తం 72 కిలోమీటర్ల మేర హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం జరుతున్నది. మొదటి దశలో మియాపూర్- అమీర్ పేట మార్గం 13 కిలోమీటర్లు, అమీర్ పేట- నాగోల్ మార్గం 17 కిలోమీటర్లు పూర్తయింది. స్టేషన్ల నిర్మాణం కూడా జరిగింది. ట్రయల్ రన్ కూడా విజయవంతమయింది. భద్రతాపరమైన అనుమతులు కూడా వచ్చాయి. ఈ మార్గాలను ఈ నవంబర్ లో ప్రారంభించించాలని ప్రభుత్వం నిర్ణయించింది.                        
                       
 

బ్లూవేల్ గేమ్ పై ఉపాధ్యాయులు అవగాహన కల్గివుండాలి - మేనకా గాంధి 
 

బ్లూ వేల్ గేమ్ కు బానిసలుగా మారి ఆత్మహత్యలకు పాల్పడుతున్న చిన్నారులను కాపాడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధి అన్నారు. అందుకు అనుగునంగా విద్యార్థుల ప్రవర్తనపై దృష్టి పెట్టాలని పేర్కొంటూ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల ప్రిన్సిపాళ్లకు లేఖ రాసారు. వారి ప్రవర్తనపై ఏదైనా అనుమానం కల్గితే 1098 టోల్ ఫ్రీ నంబర్ కు సమాచారం అందించాలని వివరించారు. అలాగే ఈ గేమ్ మొబైల్స్ లో డౌన్ లోడ్ కాకుండా ఉండేలా సాంకేతికతను ఉపయోగించాలని టెక్నాలజీ మంత్రిత్వ శాఖను కోరినట్లు ఆమె తెలిపారు. 
 

మరణించి కూడా సామాజిక సేవ చేస్తున్న గౌరీ లంకేశ్

మంగళవారం హత్యకు గురైన సీనియర్ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త గౌరీ లంకేశ్ తన కళ్లు దానం చేశారు. అది గౌరీ కోరిక అని ఆమె తమ్ముడు ఇంద్రజీత్ లంకేశ్ తెలిపారు. ఆమె కళ్లను బెంగళూరులోని మింటో ఆప్తాల్మిక్ ఆస్పత్రిలో దానం చేశారు. గౌరీ హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమె హత్యపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గౌరీ హత్యపై కర్నాటక సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. అయితే గౌరీ హత్యపై సిబిఐతో విచారణ చేయించాలన్న డిమాండ్ దేశ వ్యాప్తంగా వినిపిస్తోంది. 

పాతబస్తీ లో దారుణం (వీడియో)
 

హైదరాబాద్ పాత బస్తీలో దారుణం జరిగింది. డబీర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని పురాని హావేలి బిలియర్డ్స్ పార్లర్ లో షబ్బీర్ హుస్సేన్ అనే వ్యక్తి పై కొందరు దుండగులు కత్తులతో, బేస్ బాల్ స్టిక్స్ తో విచక్షణారహితంగా దాడి చేశారు. దుండగులు ఒకేసారి షబ్బీర్ మీద పడి కత్తితో పొడుస్తున్న దృశ్యాలు సిసిటివిలో రికార్డయ్యాయి.  విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న షబ్బీర్ ను ఉస్మానియా హాస్పత్రికి తరలించారు. అలాగే సీసీటీవీ రికార్డ్స్ ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.                        

రక్షణ శాఖ బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్
 

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్  రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 3న జరిగిన మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆమెకు కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ ఇవ్వడం, ఆ తర్వాత రక్షణ శాఖ ను ఆమెకు కేటాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ  బాధ్యతా స్వీకరణతో దేశ చరిత్రలో పూర్తిస్థాయి మహిళ రక్షణ మంత్రిగా నిర్మలా  సీతారామన్ నిలిచారు.  

జీహెచ్ఎంసి కి జాతీయ అవార్డు

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌  2015–16 సంవత్సరానికి జాతీయ పర్యాటక పురస్కారానికి ఏంపికైంది. జీహెచ్ఎంసి  ఉత్తమ  పౌరసేవల నిర్వహణ విభాగంలో,  ఈ అవార్డుకు ఎంపికైంది.  అలాగే పర్యాటకులను ఆకర్శించడానికి చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు, వీటిలో  ప్రజల భాగస్వామం తదితర అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని ఈ అవార్డుకు  జీహెచ్ఎంసి ని ఎంపిక చేసినట్లు కేంద్ర పర్యాటక శాఖ తెలిపింది. త్వరలో డిల్లీలో జరగనున్న కార్యక్రమంలో రాష్ట్రపతి చేతులమీదుగా  ఈ అవార్డును జీహెచ్ఎంసీ అందుకోనుంది.  

click me!