ఏషియానెట్-తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్

First Published Sep 6, 2017, 10:59 AM IST
Highlights
  • డిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో సమావేశమైన హరిష్ రావు
  • నవంబర్ 27 లేదా 28 తేదిల్లో హైదరాబాద్ మెట్రో ప్రారంభం
  • పర్యాటక శాఖ మంత్రి అఖిల ప్రియ సంతకం ఫోర్జరి 
  • గౌరీ లంకేశ్ హత్య కేసు విచారణకు సిట్  ఏర్పాటు  
  • విజయవంతంగా ముగిసిన సీఎం కేసీఆర్ కంటి ఆపరేషన్

డిల్లీ పర్యటనలో హరిష్ రావు బిజీ బిజీ

డిల్లీ పర్యటనలో భాగంగా మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు కేంద్ర మంత్రి స్మృతి ఇరానితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో అదనంగా సిసిఐ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు, పత్తికి మద్దతు ధర కల్పించాలని ఆమెను కోరారు. అలాగే తెలంగాణ లో పర్యటించాల్సిందిగా కేంద్ర మంత్రిని  ఆహ్వానించారు హరిష్. 
అనంతరం మరో కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ తో సమావేశమైన హరిష్ వ్యవసాయానికి సంభందించిన అంశాలపై చర్చించారు.

రాకీ యాదవ్ కు జీవిత ఖైదు

 పాట్నా: జేడీయూ బహిష్కృత ఎమ్మెల్సీ మనోరమదేవి కుమారుడు రాకీ యాదవ్ కు ఓ హత్య కేసులో జీవిత ఖైదును విధించింది గయా కోర్టు. గతంలో తన కారును ఓవర్ టేక్ చేశాడని ఆదిత్య సచ్ దేవ్ అనే యువకున్ని రాకీ యాదవ్ గన్ తో కాల్చి చంపిన విశయం తెలిసిందే. ఈ హత్య కేసును విచారించిన గయా కోర్టు రాకీ యాదవ్ తో పాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు విదించింది. అలాగే నిందితులను తప్పించడానికి ప్రయత్నించాడన్న అభియోగాలపై రాకీ యాదవ్ తండ్రి బింది యాదవ్ కు 5 సంవత్సరాల సాధారణ శిక్ష విధించింది గయా కోర్టు.
 

నందమూరి జయకృష్ణ కు జైలు శిక్ష

ఓ చెక్ బౌన్స్ కేసులో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తనయుడు నందమూరి జయకృష్ణ కు ఎర్రమంజిల్ కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. శిక్షతో పాటు 25 లక్షల ఫైన్ విధించింది. 2016 సంవత్సరం లో రామకృష్ణ థియేటర్ లో క్యాంటీన్, పార్కింగ్ లీజ్ విషయంలో జమకృష్ణ ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందంటూ నర్సింహ రావు అనే వ్యక్తి   ఎర్రమంజిల్ కోర్ట్ లో  పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై గత 3 సంవత్సరాల సుదీర్ఘ విచారణ కొనసాగగా,ఈ రోజు తుది తీర్పు వెలువడింది. అయితే జయకృష్ణ కు హైకోర్టులో అప్పీల్ చేసుకోడానికి నెల రోజులు గడువు ఇచ్చిన కోర్ట్, బెయిల్  మంజూరు చేసింది.

నూతన సచివాలయాన్ని నిర్మించి తీరతాం

ఖమ్మం: బైసన్ పోలో గ్రౌండ్ లో నిర్మించనున్న నూతన సచివాలయ నిర్మాణానికి సంభందించిన మ్యాప్ ను మీడియా ఎదుట ప్రదర్శించారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. అన్ని శాఖలను ఒకే దగ్గరకు తీసుకువచ్చి, పరిపాలనను సులభతరం చేయడానికే నూతన సచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మూడంతస్తుల విశాల భవన నిర్మాణం త్వరలో ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని విధాలుగా అడ్డుకున్నా సచివాలయ నిర్మాణాన్ని ఆపబోమని తుమ్మల స్పష్టం చేశారు.
 

జర్నలిస్టులకు సన్మానం
 

నల్గొండ :ఈ రోజు జర్నలిస్ట్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కట్టంగుర్ మండల కేంద్రంలో నల్గొండ జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ స్థానిక విలేకర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కట్టంగుర్ మాజీ జడ్పీటీసీ సుంకరబోయిన నర్సింహ్మ యాదవ్ తో పాటు స్థానిక నేతలు మహబూబ్ అలి, గాదె చంద్రయ్య, సతీష్, సైదులు, నాగరాజు, శివ, సుదర్శన్, ఆంజనేయులు, సాగర్ రాములు, సంజయ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.  
 

ఎట్టకేలకు హైదరాబాద్ మెట్రో ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

హైదరాబాద్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రో పరుగులు త్వరలోనే మొదలవనున్నాయి.నగర ప్రజల ఎదురుచూపులకు తెరదించుతూ ప్రభుత్వం  మెట్రో ప్రారంభోత్పవానికి ముహూర్తం ఖరారు చేసింది. నవంబర్ 27 లేదా 28 తేదిల్లో హైదరాబాద్ మెట్రో ప్రారంభం కానుంది. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తుండగా,నిర్మాణ సంస్థ  కూడా దీనికి సిద్దమవుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పీఎం నరేంద్ర మోది ప్రారంభించనున్నారు. మొదటి విడతలో మియాపూర్ -ఎస్సార్ నగర్ మరియు నాగోల్ - మెట్టగూడ ల మద్య మెట్రోను ప్రారంభించనున్నారు. 

తెలుగు జర్నలిస్ట్ పై దాడిచేసిన నిందితుల అరెస్టు

తెలుగు జర్నలిస్ట్ శివరామకృష్ణ  దాడికి పాల్పడిన దుండగులను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  కృష్ణ నిన్న బద్వేల్ లోని తన ఇంట్లో నిద్రించి వుండగా అర్థరాత్రి ఇద్దరు దుండగులు ఇంట్లోకి ప్రవేశించి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారించిన పోలీసులు అదే ఇంట్లో పనిచేసే పట్ల నాగరాజు తో పాటు కొడిగె మల్లేష్ లు ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించారు. దొంగతనం కోసమే తాము ఇంట్లోకి ప్రవేశించామని, దీనికి కృష్ణ అడ్డుకోవడంతో దాడికి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. బంగారం,నగదును దోచుకోవడంతో పాటు దాడి చేసినందుకు పోలీసులు వీరిపై కేసు నమోదు చేసి కస్టడిలోకి తీసుకున్నారు. వీరు దొగిలించిన నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

గౌరీ లంకేష్ హత్యపై నివేదిక కోరిన కేంద్ర హోం శాఖ

సీనియర్ మహిళా జర్నలిస్ట్ హత్యకు సంభందించిన వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని కేంద్ర హోం శాఖ కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆమె హత్యకు పాల్పడిన నిందితులను పట్టుకోడానికి చేపట్టిన చర్యలను కూడా తెలియజేయాల్సిందిగా ఆదేశించింది.
మరోవైపు గౌరి లంకేష్ హత్యపై కేంద్ర మంత్రులు కూడా స్పందించారు. ఈ కేసును సిబిఐ కి అప్పగించాలని కర్ణాటక ఎంపి,కేంద్ర మంత్రి సదానంద గౌడ  కర్ణాటక ప్రభుత్వాన్ని కోరగా, నిస్పాక్షిక విచారణకు ఆదేశించాలని అనంత్ కుమార్ డిమాండ్ చేశారు.   

ఫేస్ బుక్, వాట్సాఫ్ సంస్థలకు హైకోర్టు నోటీసులు
 

సోషల్ మీడియా సంస్థలైన ఫేస్ బుక్, వాట్సాఫ్ సంస్థలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోగా ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ఈ సంస్థలను ఆదేశించింది. వినియోగదారుల వివరాలను ఇతర సంస్థలకు బదిలీ చేయబోమని తెలుపుతు హామీ పత్రాన్ని కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.  

ఏకంగా మంత్రి సంతకమే ఫోర్జరి

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి అఖిల ప్రియ సంతకాన్ని ఫోర్జరి చేసిన వ్యక్తిని ఎస్పిఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వివరాల్లోకి వెళితే పర్యాటక శాఖలో ఉద్యోగానికి అఖిల ప్రియ సిఫారసు చేసినట్లుగా  అలీ అనే వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించి సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. ఆమె సంతకం పై అనుమానం రావడంతో అధికారులు ఎస్పిఎఫ్ పోలీసులకు సమాచారం అందించారు. వారు  మంత్రి సంతకం నకిలీదని,సంతకాన్ని ఫోర్జరి చేశాడని గుర్తించి నిందితుడు అలీని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై అఖిల ప్రియ స్పందిస్తూ  తాను ఎప్పుడూ, ఎవరికి రికమెండేషన్ చేయలేనని, ఈ లెటర్లలో తన సంతకం చూసి షాక్ అయ్యానని తెలిపారు.  
 

నూతన సచివాలయ నిర్మాణానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నా

హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు    బైసన్ పోలో గ్రౌండ్ వద్ద ధర్నా చేపట్టారు. సచివాలయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖకు చెందిన గ్రౌండ్ ను అప్పగించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు వారు తెలిపారు. బైసన్ ఫోలో గ్రౌండ్ ను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడాన్ని తాము వ్యతిరేకించడం లేదని,  ఇక్కడ సచివాలయాన్ని నిర్మించడాన్నే తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ లతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.  
 

నగరంతో ముగిసిన నిమజ్జన కార్యక్రమం

వినాయక నిమజ్జన కార్యక్రమం అనుకున్న సమయానికే ప్రశాంతంగా ముగిసినట్లు జీహెచ్ఎంసీ కమీషనర్ జనార్ధన్ రెడ్డి తెలిపారు. ఈ రోజు వరకు 12 వేల విగ్రహాలు నిమజ్జనం అయినట్లు ఆయన తెలిపారు. వివిధ శాఖల సహకారంతో ఖైరతాబాద్ గణేషున్ని ముందుగా నిమజ్జనం చేయడంతో, వేరే ప్రాంతాలపై దృష్టి పెట్టడానికి సమయం దొరికిందని అన్నారు. అలాగే స్వచ్చ వాలంటీర్లు, మండప నిర్వహకుల సాయంతో నిమజ్జనంలో స్వచ్చత పాటించేలా చూశామని, ఈ ప్రయోగం ఫలించిందని తెలిపారు. మొత్తంగా ఎలాంటి అవాంతరాలు లేకుండా నిమజ్జన కార్యక్రమం ముగించడానికి సహకరించిన అందరికి కమీషనర్ కృతఙ‌తలు తెలిపారు.   
 

గౌరీ లంకేష్ హత్య కు నిరసనగా కదం తొక్కిన జర్నలిస్టులు
 

ప్రముఖ కన్నడ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యకు నిరసనగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఆద్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని వారు డిమాండ్ చేశారు. నీతి నిజాయతీగా పనిచేస్తున్న జర్నలిస్టులపై ఇటీవల దాడులు పెరిగిపోయాయని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. గౌరీ లంకేష్ హత్యకు పాల్పడిన నిందితులను వెంటనే పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు. 

గౌరీ లంకేశ్ హత్యకేసు విచారణకు సిట్ ఏర్పాటు

జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యకేసు విచారణకు ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ ను ఏర్పాటుచేస్తున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రకటించారు. ఇందుకోసం సిబిఐ విచారణ అవసరం లేదని స్పష్టం చేశారు. హంతకులను గుర్తించేందుకు ఇప్పటికే 3 పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.హంతకులు రాష్ట్రం విడిచి పారిపోకుండా రహదారులను మూసివేసి మరీ గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ హత్యకు గల కారణాలు, ఎంతమంది ఈ హత్యలో పాల్గొన్నారన్న విషయాలు తేలాల్సి ఉందని సీఎం సిద్దరామయ్య తెలిపారు.   

హరితహారంలో అందరికి ఆదర్శం

రెండవ విడత హరితహారం లో పోలీస్ విభాగం తరపున అత్యధికంగా 11 లక్షలకు పైగా మొక్కలను నాటించి రాష్ట్రంలోనే వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆదర్శంగా నిలిచింది. అందుకోసం కృషి చేసిన నగర పోలీస్ కమిషనర్ జి.సుధీర్ బాబు కు రాష్ట్ర ప్రభుత్వం  హరిత మిత్ర అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఈ సంవత్సరం ముప్పై ఎనిమిది లక్షలకు పైగా మొక్కలను నాటించి, వరంగల్ పోలీసు కమిషనరేట్ ను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో  నిలిపారు. ఈ సంధర్బంగా  ఈ రోజు విశ్రాంత పోలీస్ అధికారుల సంఘం సభ్యులు సుధీర్ బాబు ను సన్మానించి, అభినందనలు తెలియజేశారు.
 

సీఎం కేసీఆర్ కంటి ఆపరేషన్ సక్సెస్

కొన్ని రోజులుగా చూపు సమస్యతో భాదపడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కంటి ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. ఆయన మూడు రోజుల క్రితమే ఈ ఆపరేషన్ కోసం డిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. ఇవాళ ఆయనను లేసర్ విధానంలో కేటరాక్ట్ చికిత్సను డిల్లీ పోలీసులు అందించారు. ఈ సమయంలో సీఎంతో వెంట ఆయన కొడుకు కేటీఆర్, కూతురు కవిత, మేనల్లుడు హరిష్ రావు లు ఉన్నారు.  
 

ఆంగ్ సాన్ సూకి తో ప్రధాని మోదీ సమావేశం
 

మయన్మార్ పర్యటనలో  భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఆంగ్ పాన్ సూకితో సమావేశమయ్యారు. రాజధాని నైపైతా లో వీరు సమావేశం జరిగింది.  ఈ సందర్భంగా వారు ఉగ్రవాదం, భద్రత తదితర అంశాలను చర్చించారు. తర్వాత మోదీ మయన్మార్ అద్యక్షుడు యూ హతిన్ క్వా తో భేటీ అయ్యారు. మయన్మార్ లో తీవ్ర సమస్యగా మారిన రోహింగ్యాల అంశంపై వారు చర్చించారు.
 

అగ్రిక‌ల్చ‌ర్ లీడ‌ర్ షిప్ అవార్డును అందుకున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి  

ఐసీఎఫ్ఏ సంస్థ తెలంగాణ ముఖ్య‌మంత్రి  కేసీఆర్ ను గ్లోబ‌ల్ అగ్రిక‌ల్చ‌ర్ లీడ‌ర్ షిప్ 2017అవార్డుకు ఎంపిక చేసిన విషయం అందరికి తెలిసిందే. డిల్లీలో జరిగిన గ్లోబ‌ల్ అగ్రిక‌ల్చ‌ర్ లీడ‌ర్ షిప్ స‌మ్మిట్ 2017 లో ఈ అవార్డును కేసీఆర్ తరపున తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అందుకున్నారు.  హర్యానా గవర్నర్ కప్టన్ సింగ్ సోలంకి ఈ అవార్డును అందించారు. ఈ సందర్బంగా పోచారం మాట్లాడుతూ ఇది రైతు సంక్షేమానికి పాటుపడుతున్నందుకు ముఖ్యమంత్రికి అందిన గొప్ప అవార్డుగా అభివర్ణించారు. అలాంటి ఈ ప్రతిష్టాత్మక అవార్డును తాను అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.
 

click me!