ఏషియానెట్-తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్

First Published Sep 2, 2017, 10:47 AM IST
Highlights

నేటి విశేష వార్తలు

  • తెలంగాణ ఎస్ఐ ఫలితాలు విడుదల
  • రిజర్వేషన్ వ్యవస్థలో మార్పులు రావాలన్న పవన్ 
  • కేంద్ర మంత్రి  వర్గ విస్తరణపై బీహార్ సీఎం సంచలన వ్యాఖ్యలు 
  • డిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్
  • ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో అమిత్ షా భేటీ

పరకాలకు చేరుకున్న విమోచన యాత్ర

వరంగల్ రూరల్ : ఇవాళ భువనగిరిలో ప్రారంభమైన తెలంగాణ విమోచన యాత్ర పరకాల వరకు సాగింది. అక్కడ జరిగిన బహిరంగ సభలో పలువురు వక్తలు మాట్లాడారు.  సెప్టెంబర్ 17 రోజున తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర అద్యక్షులు కె.లక్ష్మణ్ ,మాజీ ఎంపీలు జంగా రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే జయపాల్ రెడ్డి ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

కంభంపాటి హరిబాబు కు కేబినెట్ బెర్తు ఖాయం

విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు కుటుంబ సమేతంగా డిల్లీకి బయలుదేరారు. ఆయనకు కేంద్ర కేబినెట్ లో బెర్తు ఖాయమైనట్లు అధిష్టానం నుంచి సమాచారం అందడంతో ఆయన హుటాహుటిన హస్తినకు బయలుదెరారు. రేపు ఉదయం 10.30 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం జరగనుంది.
 

గద్దర్ తో టీ మాస్‌ ఫోరం నేతల భేటీ

సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్యహత్యపై నియమించిన రూపన్వాలా కమీషన్‌ రిపోర్టుపై గద్దర్‌ టీమాస్‌ ఫోరం నేతలతో భేటీ అయ్యారు.ఈ కమిషన్‌ రిపోర్టుకు వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. అందులో భాగంగా రేపు టీమాస్‌ ఫోరం ఆధ్వర్యంలో  రిపోర్టు ప్రతులను తగులబెట్టాలని పిలుపునిచ్చారు. అలాగే రోహిత్‌ వేముల ఆత్మహత్యపై హైదరాబాద్‌ ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని నిర్ణయించారు. అందుకోసం 100 బస్తీల్లో పర్యటించి, అక్కడి బడుగు వర్గాల అభిప్రాయాన్ని సేకరించనున్నట్లు  టీమాస్‌ ఫోరం తెలిపింది.    
 

ఎట్టకేలకు ఎస్సై ఫలితాలు విడుదల

తెలంగాణ నిరుద్యోగులు ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్న  ఎస్సై ఫలితాలు  వెలువడ్డాయి. 2016 నవంబర్ 19, 20 తేధీల్లో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాల కోసం అభ్యర్ధులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు.వారి నిరీక్షణకు తెరపడింది. సెలెక్టెడ్ లిస్ట్ తో పాటు కటాఫ్ మార్కులను www,tslprb.in వెబ్ సైట్ లో ఉంచారు. ఎవరికైనా అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేయడానికి కూడా అవకాశాన్ని కల్పించారు.దీనిపై పూర్తి వివరాలను పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు వెబ్ సైట్ లో ఉంచారు.  
 

రిజర్వేషన్ వ్యవస్థలో మార్పులు రావాలి 

దేశంలో ప్రస్తుతం అమలులో వున్న రిజర్వేషన్ వ్యవస్థలో లోపాలున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అసలు రిజర్వేషన్లు లేని సమాజం వుండాలని తాను కోరుకుంటున్నాని, అదే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు మనమిచ్చే నిజమైన నివాళి అని అన్నారు. వెనుకబడిన వారికి రిజర్వేషన్లు అమలు చేయాలని, ప్రభుత్వం అందుకు క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.  ఉన్నత పదవుల వారు , సంపన్నులు తమ రిజర్వేషన్లను స్వచ్చందంగా వదులుకోవాలని సలహా ఇచ్చారు. అప్పుడే అసమానతలు లేని సమాజం ఏర్పడుతుందని పవన్  స్పష్టం చేసారు. 
 

కేంద్ర మంత్రివర్గంలో జేడీయూ చేరిక అనుమానమే

ఎన్డీఏ మంత్రివర్గ విస్తరణపై బీహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విస్తరణపై తమకు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారంగాని, ఆహ్వానం గాని అందలేదని స్పష్టం చేశారు. రేపే మంత్రివర్గాన్ని విస్తరించనున్న నేపథ్యంలో ఇప్పటివరకు జేడీయూ నేతలకు సమాచారం లేకపోవడం పై పలు అనుమానాలు నెలకొన్నాయి.ఈ ప్రకటనతో ఇప్పటివరకు ప్రచారం జరిగినట్లు జేడీయూ  కేంద్ర మంత్రివర్గంలో  చేరడంపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి.  
 

ఇంజనీరింగ్ కాలేజీలపై వేటు

నాణ్యతలేని ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలపై కఠిన  చర్యలకు ఉపక్రమించింది ఆల్‌ ఇండియా కౌన్సెల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌. అందులో భాగంగా దేశవ్యాప్తంగా ఎనిమిది వందల ఇంజనీరింగ్  కాలేజీల మూసివేతకు  నిర్ణయం తీసుకుంది. సిబ్బంది కొరత, మౌలిక వసతుల లేమి, విద్యార్థులు లేకపోవడం తదితర కారణాలతో కాలేజీల అనుమతులు రద్దు చేయనున్నట్లు  పేర్కొంది. నానాటికి పడిపోతున్న ఇంజనీరింగ్ విద్యా ప్రమాణాలను మెరుగుపర్చడానికే ఈ నిర్ణయం  తీసుకున్నట్లు ఏఐసీటిఈ తెలిపింది. 
 

కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తో కేసీఆర్ భేటీ

డిల్లీ పర్యటనలో వున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. సచివాలయ నిర్మాణం, రహదారుల విస్తరణకు అడ్డుగా వున్న రక్షణ శాఖ భూములపై జైట్లీ తో చర్చించారు.  రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు.  అలాగే  జీఎస్టి ని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రక్షణ మరియు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ని కోరారు. 
 

తెలంగాణలో టూరిజం అభివృద్ధి (వీడియో)

తెలంగాణలో టూరిజాన్ని అభివృద్ది చేసే లక్ష్యంతో నగరంలో ఏర్పాటు చేసిన డిజిటల్ ఎల్ఈడి స్క్రీన్ లను టూరిజం కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రారంభించారు.  సైఫాబాద్ లోని కోరమండల్ కాంప్లెక్స్ పైన ఈ స్క్రీన్ ను ఏర్పాటుచేశారు. రాష్ట్రంలోని టూరిజం ప్రదేశాలు, వారసత్వ కట్టడాలు,  వైల్డ్ లైఫ్ టూరిజం, బతుకమ్మ పండుగ, గిరిజన సంస్కృతి, సమ్మక్క- సారక్క ల జాతర లతో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను  డిజిటల్ స్క్రీన్స్ , సోషల్ మీడియాలలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.  పర్యాటక ప్రదేశాల విశేషాలను తెలియజేస్తూ పర్యాటకులను ఆకర్షించటమే లక్ష్యంగా ప్రమోషన్ చేస్తున్నామని వెంకటేశం వెల్లడించారు.
 

తెలంగాణ లో పోలీస్ రాజ్యం నడుస్తోంది - ఉత్తమ్ కుమార్ రెడ్డి
 

ప్రజా కవిగా ప్రభుత్వ తప్పులను ఎండగడుతున్నందుకే  ఏపూరి సోమన్న టీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్టు చేయించిందని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి  అన్నారు. ప్రజా కళాకారుడైన ఆయనను   తిరుమల గిరి పోలీసులు అక్రమంగా నిర్బంధించి దొంగలను, కేడీలను అరెస్ట్ చేసినట్టు బేడిలు వేయడం అధికార పార్టీ దాష్టికానికి నిదర్శనమని వాపోయారు. పోలీస్ రాజ్యాన్ని నడిపిస్తున్న అధికార పార్టీకి తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు.ఈ అరెస్టును కాంగ్రెస్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని, సోమన్నను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 
 
 

నూజివీడు ర్యాగింగ్ ఘటనపై మంత్రి ఆగ్రహం

నూజివీడు: కృష్ణా జిల్లా నూజివీడు ఐఐఐటిలో జరిగిన ర్యాగింగ్ వ్యవహారంపై మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్జీయూకేటీ  డైరెక్టర్‌ను ఆదేశించారు. ఈ ర్యాగింగ్ ఘటనపై సమగ్రమైన నివేదిక పంపాలని అధికారులను ఆదేశించారు. విద్యాలయాల్లో ర్యాగింగ్ ను సహించేదిలేదని ఆయన స్పష్టం చేశారు.
 

స్వగ్రామానికి చేరుకున్న మహారాష్ట్ర గవర్నర్

మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ఇవాళ తెలంగాణలో పర్యటించారు. ముంబై నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో  నేరుగా కరీంనగర్ జిల్లాలోని ఆయన సొంత గ్రామమైన నాగారం కు చేరుకున్నారు. అక్కడ ఆయన కోందండరామస్వామి ఆలయ అభివృద్ది పనులకు శంకుస్థాపన  చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ఈటెల రాజేందర్ తో పాటు పలువురు ప్రభుత్వాధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. 
 

టీఆర్ఎస్ కు అంత సీన్ లేదు - బీజేపి అధ్యక్షుడు లక్ష్మణ్
 

టీఆర్ఎస్ తో బీజేపి కలిసే ప్రసక్తే లేదని, కేంద్ర మంత్రి వర్గంలో టీఆర్ఎస్ కలుస్తుందనడం కేవలం ఊహాగానాలేనని  తెలంగాణ రాష్ట్ర బీజేపి అద్యక్షుడు లక్ష్మణ్  అన్నారు. ఇది మీడియా చేస్తున్న ప్రచారమేనని, అందులో వాస్తవం లేదని ఆయన  వివరించారు. తెలంగాణ విమోచన యాత్రలో భాగంగా ఆయన యాదాద్రి భువనగిరి జిల్లాలో మీడియాతో మాట్లాడారు. 
 ప్రభుత్వ మెడలు వంచైనా సెప్టెంబర్ 17 విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని లక్ష్మణ్ తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టీఆర్ఎస్ పాలన నిజాం నిరంకుశ పాలనను మించిపోయిందని ఎద్దేవా చేశారు.
ఈ రోజు భువనగిరి నుంచి పరకాల వరకు విమోచన యాత్ర  కొనసాగుతుందని తెలిపారు. ఈ నెల 17 వ తేదీన విమోచన దినోత్సవం సందర్బంగా నిజామాభాద్ లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని, అందులో కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ పాల్గొంటారని లక్ష్యణ్ తెలిపారు. 
 

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో అమిత్ షా భేటి

కేంద్ర మంత్రివర్గ విస్తరణ నేపద్యంలో బీజేపీ అద్యక్షుడు అమిత్ షా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి వర్గంలో చేస్తున్న మార్పు చేర్పుల గురించి ఆయనకు వివరిస్తున్నారు.  బీజేపి ఆర్ఎస్ఎస్ అభిప్రాయాలకు అధిక ప్రాదాన్యత ఇస్తుంది కావున పునర్ వ్యవస్థీకరణ పై జరుగుతున్న ఈ సమావేశంపై ఆసక్తి నెలకొంది.  
 

డిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ శుక్రవారం రాత్రి ప్రత్యేక విమానంలో డిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆయన కంటి ఆపరేషన్ కోసం డిల్లీలో నాలుగు రోజులు ఉండనున్నారు. ఈ పర్యటనలోనే ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలవనున్నారు. అలాగే నవంబర్ లో ప్రారంభించనున్న మెట్రో రైల్ ప్రారంభోత్సవానికి వారిని ప్రత్యేకంగా ఆహ్వానించనున్నాడు.   పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యల గురించి చర్చించనున్నారు. ఇలా పబ్లిక్ పనులు, పర్సనల్ పనులతో సీఎం డిల్లీలో బిజీ బిజీగా గడపనున్నారు.

click me!