ఏషియానెట్-తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్

First Published Aug 26, 2017, 10:17 AM IST
Highlights
  • హేయ్ పిల్లగాడ'   సినిమా టీజ‌ర్   విడుద‌ల
  • ఇందిరా పార్క్  వద్ద వాటర్ ఎటిఎంలను ప్రారంభించిన మేయర్ బొంతు రామ్మోహన్.
  • "మిల్ బంచే మద్యప్రదేశ్'' కార్యక్రమంలో  పాల్గొన్న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
  • డెంగీ జ్వరంతో భాదపడుతన్న ప్రియాంక గాంధీ  
  • ఏపీ పర్యటనలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కి ఘన స్వాగతం

 

మళ్లీ తెలుగు ప్రేక్షకులను అలరించనున్న సాయిపల్లవి

ఫిదా మూవీతో తెలుగులో మంచి మార్కెట్ సంపాదించుకున్న మళయాళీ బ్యూటి సాయిపల్లవి మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్దమైంది.  సాయిపల్లవి, దుల్కర్ సల్మాన్ జంటగా నటించిన కల్పీ అనే మళయాళ మూవీని  తెలుగులో 'హేయ్ పిల్లగాడ' పేరుతో డబ్ చేస్తున్నారు. ఆ సినిమాకు సంభందించిన టీజ‌ర్ ను విడుద‌ల చేసింది సినిమా బృందం. ఈ టీజర్ ప్రేక్షకులకు అమితంగా ఆకట్టుకోవడంతో ఈ చిత్రం పై అంచనాలు పెరిగాయి. సమీర్ తాహిర్ దర్శకత్వం  వచ్చిన ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ ని డివి కృష్ణ స్వామి తీసుకుని విడుదలకు సన్నాహాలు చేస్తున్నాడు.      
 

జీఎస్టీ టాక్స్ పేయర్స్ పై అనుమానాలున్నాయి
 

హైదరాబాద్: సచివాలయం లో తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, రెవిన్యూ (కమర్షియల్ టాక్స్ ) ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేశ్ కుమార్ సమావేశమయ్యారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. జీఎస్టీ  మొదలైనప్పటికి, టాక్స్ కట్టే వారిపై పలు అనుమానాలున్నాయని  అన్నారు.  అలాగే జీఎస్టీ అమలు తీరులో వస్తున్న సమస్యలు-పరిష్కారాలపై ప్రతినెలా వ్యాపార సంఘాలతో సమావేశం అవుతామని మంత్రి తెలిపారు.  రెండు, మూడు నెలలు దీనిపై ఇబ్బంది ఉంటుందని, ఆ తరువాత జీఎస్టీ సులభతరం అవుతుందని మంత్రి అన్నారు.

ఉగ్రదాడిలో సైనికుల బలి

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్మూలో అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన పుల్వామా లో సైనికులే టార్గెట్ గా ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఐదుగురు సైనికులు మరణించారు. సైన్యం జరిపిన ఎదురు కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.       
 

డేరా బాబా అరాచకాలకు చెక్ పెట్టేందుకేనా 

పంజాబ్, హర్యాన రాష్ట్రాల్లో జరుగుతున్న డేరా బాబా అరాచకాలపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. నిన్న హర్యానలోని పంచకుల లో జరిగిన దమనకాండ, అలాగే పంజాబ్ లోని డేరా  బాబా ఆశ్రమంలో జరుగుతున్న సంఘటనల గురించి  ముఖ్యంగా ఇందులో చర్చించనున్నట్లు సమాచారం.  పంచకుల ఘటనపై ఆ రాష్ట్ర ప్రభుత్వానికి  హై కోర్టు చీవాట్లు పెట్టిన కొద్దిసేపటికే  కేంద్రం హోం మంత్రి దీనిపై సమావేశమవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

సీనియర్ జర్నలిస్ట్ కన్నుమూత

విజయవాడ : తెలుగు మీడియా రంగంలో తనదైన  శైలిలో వార్తలను అందించిన సీనియర్ జర్నలిస్ట్ షఫీవుల్లా ఇవాళ గుండెపోటుతో మరణించారు. సాధారణ జర్నలిస్ట్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఆయన అంచెలంచెలుగా ఎదిగి విజయవాడ ప్రెస్ క్లబ్ కోశాధికారిగా,మరియు కాకతీయ దినపత్రిక విజయవాడ బ్యూరో ఇంచార్జ్ గా పనిచేసారు. ఆయన మరణం  జర్నలిజానికే తీరనిలోటని  తోటి  జర్నలిస్టులు  ఆవేదన వ్యక్తం చేశారు..  

నగరంలో వాటర్ ఎటిఎం ప్రారంభం

 హైద‌రాబాద్: నగరంలో తాగునీటిని అత్యంత చౌకగా అందించడానికే వాటర్ ఏటిఎంలను ప్రారంభిస్తున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. ఆయన ఇవాళ ఇందిరా పార్క్ సమీపంలో వాటర్ ఎటిఎంలను ప్రారంభించారు. జోస‌బ్ ఇంట‌ర్నేష‌న‌ల్, నేచ‌ర్స్ స్ప్రింగ్ ఎకో టాప్ కంపెనీల ఆధ్వ‌ర్యంలో వాట‌ర్ ఏటీఎంను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలోజీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ జ‌నార్ధ‌న్ రెడ్డి, స్వీడ‌న్ కౌన్సిల‌ర్ జోసఫ్ లు పాల్గొన్నారు.

ఏసిబి వలలో అవినీతి తహసీల్దార్

పట్టాదార్ పాస్ పుస్తకాలివ్వడానికి రైతు దగ్గర లంచం తీసుకుంటుండగా తహసీల్దారును ఏసీబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా బాలాయపల్లి తహసీల్దార్ గా పనిచేస్తున్న పోకూరు రాంబాబు లంచాలకు బాగా రుచి మరిగాడు. ఆకరికి నిరుపేద రైతులను కూడా లంచాల పేరుతో వేధించేవాడు.అలాగే స్థానిక రైతు అద్దూరు చెంచయ్యకు పట్టాదార్ పాసు పుస్తకం కోసం దరఖాస్తు చేస్తే రూ. 50000 వేలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేసాడు. అయితే 30000 వేలకు బేరం కుదుర్చుకున్న చెంచయ్య ఈ విషయాన్ని ఏసీబి అధికారులకు తెలిపాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసిబి అధికారులు తహసిల్దార్ కార్యాలయంలో మాటువేసి రైతు దగ్గర డబ్బులు తీసుకుంటుండగా  రాంబాబు ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
  

శ్రీవారి సేవలో నేపాల్ ప్రధాని

భారత పర్యటనలో భాగంగా నేపాల్ ప్రధానమంత్రి షేర్ బహదూర్  దేవ్‌బా ఇవాళ తిరుమలలో  శ్రీవారిని దర్శించుకోనున్నారు. అందుకోసం ప్రత్యేక విమానంలో ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి దేవ్‌బా రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకుని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అందుకోసం టీటిడి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. 
 

ఈ నెల 28 న హైకోర్టు వద్ద లాయర్ల ధర్నా

అడ్వొకేట్ చట్ట సవరణ బిల్లు 2017వ్యతిరేకిస్తూ ఈనెల 28 న హైకోర్టు వద్ద ధర్నా చేపట్టనున్నట్లు ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ సవరణ న్యాయవాదుల హక్కులను, బార్ కౌన్సిల్ ఉనికిని , స్వయం ప్రతిపత్తిని దెబ్బ తీసే విధంగా ఉందని  లాయర్స్ అసోసియేషన్ పేర్కొంది. లా కమిషన్ తీసుకొచ్చిన ఈ బిల్లు ను వెంటనే వెనక్కి తీసుకొవాలని డిమండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో అందర న్యాయవాదులు పాల్గొనాలని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

టీచర్ అవతారమెత్తిన సీఎం
 

మ‌ధ్య ప్ర‌దేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న "మిల్ బంచే మద్యప్రదేశ్'' కార్యక్రమంలో స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంది. రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇవాళ భోపాల్ పట్టణంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో టీచ‌ర‌్ అవతారం ఎత్తారు. విద్యార్థులు చదువు పై ప్రేమను పెంచుకోవాలని, పుస్తక పఠనాన్ని అలవాటుగా మార్చుకోవాలని సూచించారు.   కొద్దిసేపు స్కూల్ లోసరదాగా గడిపిన ఆయన, స్కూల్ లో వున్న సమస్యలపై విద్యార్థులను, ఉపాద్యాయులను అడిగి తెలుసుకున్నారు.  

పంచకుల ఘటనపై ప్రభుత్వ చర్యలు షురూ

హై కోర్టు తీవ్ర హెచ్చరికల నేపద్యంలో  హర్యానా ప్రభుత్వం పంచకుల ఘటనపై చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా ఈ అరాచక ఘటనలను అడ్డుకోలేక పోయిన డీఎస్పీని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే డేరా బాబా ఇద్దరు అనుచరులను దేశ ద్రోహం కేసు కింద అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పంచశిల లో ప్రస్తుతం శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని పోలీసులు తెలిపారు. 

ప్రజల ప్రాణాలకంటే, రాజకీయాలే ముఖ్యమా 

డేరా బాబ అరాచకాలను అడ్డుకోలేక పోయిన హర్యానా ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు అక్షింతలు వేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం ఓ పట్టణం తగలబడిపోతున్నా పట్టించుకోక పోవడం దారుణయని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.ప్రజల ప్రాణాలకన్నా, రాజకీయాలే ముఖ్యమా అని ప్రశ్నించిన ధర్మాసనం,  సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పై  విరుచుకుపడింది. నిన్న పంచకులలో జరిగిన ఘటనపై సమగ్రమైన నివేదిక ఇవ్వాలని హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ  సేకరణ

భూపాలపల్లి జిల్లా: భూపాలపల్లి పట్టణ శివారులోని ఏఎస్ఆర్ గార్డెన్ లో కాళేశ్వరం ప్రాజెక్టు పై ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభమైంది. వివిధ ప్రాంతాల నుంచి వందలాదిగా తరలి వచ్చిన కాంగ్రెస్, టిఆర్ ఎస్ కార్యకర్తలు, రైతులు, భూనిర్వాసితులు పాల్గొన్నారు. ఇటీవల పెద్దపల్లిలో టిఆర్ ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల గొడవను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమానికి పోలీసు యంత్రాంగం భారీగా బందోబస్తును ఏర్పాటు చేసి అడుగడుగున తనిఖీలు నిర్వహిస్తున్నారు. 
 

మిస్ ఫైర్ కాదు, ఆత్మహత్య

కరీంనగర్ లో ఏఆర్ కానిస్టేబుల్ చంద్రయ్య తుపాకి మిస్ ఫైర్ అయి చనిపోలేదని, ఆయన ఆత్మహత్యకు చేసుకున్నట్లు కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి  తెలిపారు. గత ఐదేళ్లుగా అతడు  తీవ్ర  ఒత్తిడితో భాధపడుతున్నాడని, డిప్రెషన్ తగ్గడానికి చికిత్స చేయించుకుంటున్నాడని తెలిపారు. కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆత్మహత్య కేసు నమోదు చేస్తున్నట్లు సీపి వివరించారు.
 

మిషన్ భగీరథ పై పోచారం సమీక్ష

కామారెడ్ఢి, నిజామాబాద్ జిల్లాలో  మిషన్ భగీరథ పనులపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ రెండు జిల్లాల పరిధిలోని  ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. మిషన్ భగీరథ నిర్మాణ పనులు‌, అందుకు అదనంగా అవసరమైన ఉపరితల నీళ్ళ ట్యాంకుల ప్రతిపాధనలపై వీరు చర్చించారు.

ఎంపీ కవిత వికారాబాద్ జిల్లా పర్యటన 

వికారాబాద్ జిల్లాలోని తాండూరు పట్టణంలో  సెంటర్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఆండ్ ట్రేయినింగ్ సెంటర్ పనులకు నిజామాబాద్ ఎంపి కవిత శ్రీకారం చుట్టారు. ఈ సందంర్బంగా ఆమెకు రవాణా మంత్రి మహేందర్ రెడ్డి తో పాటు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నూతనంగా ఏర్పడిన వికారాబాద్ అభివృద్దికి తనవంతు కృషి చేస్తానని ఆమె జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు.    

హాస్పిటల్లో చేరిన ప్రియాంక గాంధీ

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి కూతురు ప్రియాంక గాంధి అనారోగ్యానికి గురయ్యారు. ఆమె డెంగీ జ్వరంతో భాదపడుతూ సార్ గంగారామ్ హాస్పిటల్లో చేరారు. ఆమెను సీనియర్ కన్పల్టెంట్ డాక్టర్ అరుప్ బసు ఆద్వర్యంలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆమె పరిస్థితి మెరుగ్గానే వుందని,   ప్రస్తుతం జ్వరం నుంచి కోలుకుంటోందని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.  
 

డేరా బాబా స్థావరంలోకి  ప్రవేశించిన సైన్యం

Army & Rapid Action Force have entered the premises of #DeraSachaSauda HQ in Haryana's Sirsa #RamRahimSingh pic.twitter.com/hoq3mCXcLx

— ANI (@ANI) August 26, 2017

సిర్సాలోని డేరా బాబా రామ్ రహీం సింగ్ కేంద్ర స్థావరంలోకి సైన్యం ప్రవేశించింది. నిన్న ఒక రేప్ కేసులో దోషి అని తేలాక పంచకులా తోపాటు అనేక పంజాబ్, హర్యానా, ఢిల్లీలో హింసాకాండ చెలరేగిన సంగతి తెలిసిందే. దీనితో సైన్యం రంగం ప్రవేశం చేసింది.

కరీంనగర్ లో తుపాకీ పేలి కానిస్టేబుల్ మృతి ( వీడియో)

ప్రమాదవశాత్తు తుపాకీ  పేలి కానిస్టేబుల్ మరణించిన ఘటన కరీంనగర్ లో జరిగింది. సిటీ ఆర్ముడ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్ లో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న డి చంద్రయ్య ప్రమాదవశాత్తు తుపాకి పేలి చనిపోయాడు.    

ఖతార్ ఎయిర్ వేస్ ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్

దోహ నుండి రోమన్ వెళ్తున్న ఖతార్ ఎయిర్ వేస్ కు చెందిన ఓ విమానంలో కో ఫైలెట్ గుండెపోటు కు గురవడంతో ప్లైట్ ను  శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా లాండ్ చేశారు.  ఆమెను జూబ్లీహిల్స్ అపోలో హాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే విమానంలో వున్న  227 మంది ప్రయాణికులు సురక్షితంగానే ఉన్నట్లు ఎయిర్ లైన్స్  అధికారులు తెలిపారు.  

ఉపరాష్ట్రపతి  వెంక‌య్య‌నాయుడుకి ఘన స్వాగతం( వీడియో)

ఉప రాష్ట్రపతిగా  ఎన్నికైన తర్వాత వెంకయ్య నాయుడు  తొలిసారిగా సొంత రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు  వచ్చారు.  ఆయన పర్యటన సంద‌ర్భంగా  ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఘనంగా స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు  లక్షమందితో భారీ మానవహారంతో ఆయనకు ఆత్మీయ స్వాగతాన్ని పలికారు. భారీ రోడ్ షో  సంధర్బంగా ఆ మార్గంలో వాహనాల రాకపోకలు మళ్లించారు. అలాగే ఉప‌రాష్ట్రప‌తి పౌర సన్మానానికి సంబంధించి  గుంటూరు జిల్లా  అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. వెలగపూడి వద్ద భారీ వేదిక ఏర్పాటు చేశారు.  గన్నవరం నుంచి  ప్రకాశం బ్యారేజీ వరకు  విద్యార్ధులు, మహిళలు, మానవహారంగా ఏర్పడి  ఉపరాష్ట్రపతికి పూలతో స్వాగతం పలికారు.  దాదాపు 23 కిలోమీట‌ర్ల మేర‌ లక్షమందితో   మానవహారంగా ఏర్ప‌ాటుచేశారు. పాఠశాలలు, కళాశాలల నుంచి 70 వేల మంది విద్యార్థులు, మరో 30 వేల మందిని  డ్వాక్రా సంఘాల మహిళలు ఈ స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు.    
 

click me!