సాక్షి దినపత్రిక మీద కేసు

First Published Aug 23, 2017, 8:07 AM IST
Highlights
  • జగన్ కుటుంబ సభ్యులకు చెందిన సాక్షి దినపత్రిక మీద కేసులు
  • ఓబీసి వర్గీకరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం
  • కెసిఆర్ మీద కొత్త జోక్ పేలింది
  • విశాఖపట్నంలో  సైబర్ టవర్ ను ప్రారంబించనున్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్
  • రాఘవపూర్ గ్రామ పరిధిలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్ట్ సమావేశంలో టీఆరెస్, కాంగ్రెస్ నాయకుల భాహాబాహి  

  పట్టణాల అభివృద్ధిలో మహిళల పాత్ర మరింతగా పెంచుతారట (వీడియో)                        
 

పట్టణాల అభివృద్ధిలో మహిళల పాత్రను మరింత పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు తెలియజేశారు. ఈరోజు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఉద్యోగులతో మంత్రి, ఈ రోజు హైదరాబాదులో సమావేశం అయ్యారు. మెప్మా సంస్థ కింద పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్లు, కమ్యూనిటీ 
ఆఫీసర్ల సమస్యల పైన మంత్రి వారిని అడిగి తెలుసుకున్నారు. మెప్మా సంస్థ ద్వారా వారికి ఇంకేమీ సహాయ సహకారాలు కావాలో తెలియజేయాలని కోరారు. మెప్మా కింద పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్లు, ముఖ్యంగా మహిళా సోదరీమణుల సహకారంతో తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను పకడ్బందీగా పట్టణాల్లో అమలు చేస్తున్నదని   తెలిపారు. వీరి సేవలను మరింతగా ఉపయోగించుకునేందుకు త్వరలోనే మరిన్ని కార్యక్రమాలను చేపడతామని తెలియజేశారు. రాష్ట్రంలోని పట్టణాల్లో నివసిస్తున్న పేదల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన పలు కార్యక్రమాలపైన, వారికి అందించాల్సిన సహాయ సహకారాల పైన మంత్రి వివిధ పట్టణాల నుంచి వచ్చిన రిసోర్స్ పర్సన్ లను అడిగి తెలుసుకున్నారు.

ఈ నెల 28న నంద్యాల కౌంటింగ్ 

నంద్యాలలో పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఫలితాలపై పడింది. అయితే పలితాలను ఈ నెల 28 తేదీన ప్రకటించనున్నట్లు ప్రదాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్ తెలిపారు.  ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని, మొత్తం 14 టేబుల్స్ లో కౌంటింగ్ జరగనున్నట్లు, మధ్యాహ్నానికల్లా తుది ఫలితం వెలువడుతుందని ఆయన తెలిపారు.
 

సాక్షి దినపత్రిక మీద కేసు

 

ఎన్నిలక నిబంధనలను ఉల్లంఘించినందుకు జగన్ కుటుంబ సభ్యులకు చెందిన సాక్షి దినపత్రిక మీద కేసులు బుక్ చేస్తున్నారు. పత్రిక మీద కేసులు బుక్ చేయాలని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి బన్వర్ లాల్ ఫిర్యాదుచేశారు. ఐపిసి 126, (126 1 బి), 155 సెక్షన్ లతో పాటు ఎన్నికల చట్టం కింద కూడా కేసులు బుక్ చేస్తారు

శశికళ నాలుగేళ్లు శిక్ష అనుభవించాల్సిందే 

శశికళకు సుప్రీం కోర్ట్ లో మరో పరాభవం ఎదురైంది. ఆమెకు  పడిన నాలుగెళ్ల శిక్షను సవాలుచేస్తు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే దానిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం శిక్షా కాలాన్ని తగ్గించలేమని  తీర్పునిచ్చింది. 
 

కెసిఆర్ వాగ్దానాల మీద కొత్త జోక్ పేలింది

చక్కెర వ్యాపారులకు హెచ్చరిక

నిబంధనలకు విరుద్ధంగా చక్కెర నిల్వలు చేసి కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ శ్రీ సి.వి. ఆనంద్‌ చక్కెర వ్యాపారులను హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ధర కన్నా లైసెన్స్‌ పొందిన వ్యక్తి చక్కెరను అధిక ధరకు అమ్మకూడదన్నారు. లైసెన్స్‌ లేకుండా చక్కెర విక్రయించే వ్యాపారులపై దాడులు నిర్వహించాలని అధికారులలకు ఆదేశించారు. ఎవరైనా ఐదు క్వింటాళ్ల కంటే ఎక్కువ చక్కెర నిల్వలు ఉంచేవారిని చక్కెర డీలర్‌గా పరిగణించబడతారని, వారు హోల్‌సేల్‌, రిటైల్‌ లైసెన్స్‌ను తీసుకోవాలని, లేనిచో వారిపై నిత్యావసరాల చట్టం కింద చర్యలు తీసుకుంటామన్నామని వ్యాపారులకు హెచ్చరించారు.                     

బిగ్ బజార్ లో ఆడుకుంటూ గాయపడిన బాలుడు  
 

హైద్రాబాద్ : నిన్న రాత్రి కాచిగూడ బిగ్ బజార్ లో దిల్ సుఖ్ నగర్ కి చెందిన 3 సంవత్సరాల అభిరామ్ రైడర్ కార్ తో ఆడుకుంటు ఎస్కలేటర్  పైనుండి జారి కిందకు పడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో లక్దికపూల్ లోని లోటస్ ఆసుపత్రికి తరలించారు. దీనిపై తల్లిదండ్రులు  పోలీసులకు పిర్యాదు చేయడంతో   కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.                        

కేంద్ర కేబినెట్ నిర్ణయాలు

ఓబీసి వర్గీకరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.అందుకోసం ఓ కమీషన్ ను ఏర్పాటు చేయాలని  నిర్ణయించింది. త్వరలో ఈ కమీషన్ చైర్ పర్సన్ ను నియమించాలని,  అప్పటినుంచి 12 వారాల్లోగా నివేదికను సమర్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది కేంద్రం. అలాగే ప్రభుత్వ రంగ భ్యాంకుల ఏకీకరణకు కూడా కేబినెట్ ఆమోదం లభించినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.                    

నంద్యాలలో రికార్డు స్థాయిలో పోలింగ్
 

ఓటేసిన  పురుషులు : 75910
మహిళలు   : 81492
 మొత్తం     :   157401
 పోలింగ్ శాతం : 71.91%                        

నంద్యాల సమాచారం

నంద్యాల ఉపఎన్నికలో ఓటర్లు భారీగా పాల్గొంటున్నారు.  మద్యాహ్నం 3 గంటల వరకు 71 శాతం పోలింగ్ నమోదయింది.  మొత్తం  1,57,401 ఓట్లు పోలైనట్లు అధికారిక సమాచారం. 
 

నేరెళ్ల ఘటనపై రాష్ట్రపతికి ఫిర్యాదు

డిల్లీ : నేరెళ్ల ఘటన పై  తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కోదండరామ్ ఆద్వర్యంలో అఖిలపక్ష నాయకులు రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ కు ఫిర్యాదు చేసారు. ఆయన్ను కలిసిన అఖిలపక్ష నాయకుల్లో సిపిఐ నుంచి డి.రాజా, అజీజ్ బాషా, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట రెడ్డి, తెలంగాణ విద్యావంతుల వేదిక  అధ్యక్షుడు గురజాల రవీందర్, తెలంగాణ టి.డి.పి అధ్యక్షుడు ఎల్. రమణ, తెలంగాణ పి.సి.సి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు సంపత్  మరియు గూడూరు నారాయణ రెడ్డి లతో పాటు  టి.జె.ఏ.సి నాయకులు  గోపాలశర్మ, అంబటి శ్రీను తదితరులు ఉన్నారు.
 

విశాఖలో  ఏపి సైబర్ టవర్ ప్రారంభం

విశాఖపట్నంలో 24 వ తేదిన ఐ.టి శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించి వివిధ అభివృద్ది పనులను ప్రారంభించనున్నారు.  ఉదయం 8.25 నుండి 10 గంటల వరకూ టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక రీ లాంచ్ కార్యక్రమం లో  మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు. తర్వాత  10.15 గంటలకు సైబర్ టవర్ ను ప్రారంబించనున్నారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.
 

కెనడాలో ఉద్యోగాల  పేరిట మోసం 
 

ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల వద్ద లక్షల్లో వసూలు చేసి బోర్డు తిప్పేసిన కన్సల్టెన్సీ ఉదంతం సనత్ నగర్ లో  బయటపడింది. స్థానికంగా నిర్వహిస్తున్న సన్ రైస్ కన్సల్టెన్సీ కంపెనీ కెనడాలో ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల వద్ద భారీగా డబ్బులు వసూలు చేసింది. తీరా అభ్యర్థులకు ఉద్యోగాల కోసం ఇచ్చిన టైమ్ ముగియడంతో వారు ఆపీస్ వద్దకు వెళ్లగా అక్కడ అసలు ఏ ఆపీసు లేదు. దీంతో మోసపోయామని తెలుసుకున్న దాదాపు 100 మంది భాదితులు సనత్ నగర్ పోలీసులకు పిర్యాదు చేసారు.   
 

ఉపాధి పనులపై మంత్రి జూపల్లి సమీక్ష

హైదరాబాద్:   ఉపాధి హామీ పనులపై గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుండి మరిన్ని నిధులు సాధించేలా పనుల్లో ఇంకా వేగం పెంచాలని అధికారులకు దిశానిర్దేశం చేసారు. ఈ సమీక్షలో గ్రామీణాబివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్ లతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 

నంద్యాల పోలింగ్ వివరాలు మధ్యాహ్నం   ఒంటి గంటకు


పురుషులు : 56260
మహిళలలు :59954
మొత్తం పోలయినవోట్లు  116214
పోలింగ్ శాతం : 53.1 %

ఈ అవ్వను బ్రతికుండగానే చంపేసారు

ఆరు పదులు దాటిన వయసులో తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన వృద్ధురాలికి నిరాశ ఎదురయింది.  అంగన్వాడీ టీచర్ చేసిన నిర్వాకం వల్ల లక్షమ్మ అనే  వృద్ధురాలు  ఓటు హక్కును కోల్పోయింది. లక్ష్మమ్మ చనిపోయినట్లు  అంగన్వాడీ టీచర్ నివేదిక ఇవ్వడంతో లక్ష్మమ్మ పేరును జాబితా నుండి తొలగించారు. బ్రతికున్న వాళ్ళను చంపేశారని లక్ష్మమ్మ బోరున విలపించింది.
 

పెద్దపల్లి మాజీమంత్రి శ్రీధర్ బాబు సహా పలువురు కాంగ్రెస్ నాయకుల అరెస్ట్

 పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామ పరిధిలోని రెడ్డి పంక్షన్ హాల్ లో నిర్వహించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ సమావేశంలో టీఆరెస్, కాంగ్రెస్ నాయకులు తోపులాటలకు దిగి ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. ఈ ఘటనలో మాజీ మంత్రి శ్రీదర్ బాబు తో పాటు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసారు..

ఉపఎన్నికలో పోలింగ్ అధికారి శ్రీనివాసరెడ్డి గుండెపోటుతో మృతి

నంద్యాల ఉప ఎన్నికలో పోలూరులో పోలింగ్‌ కేంద్రంలో పోలింగ్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరెడ్డికి గుండెపోటుతో మరణించారు. పోలింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే గుండెపోటుతో కుప్పకూలిన ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.

 

నంద్యాల ఎన్జీవో కాలనీలో నిలిచిపోయిన పోలింగ్

నంద్యాల: నంద్యాల ఉపఎన్నిక ఇవాళ ఉదయం 7గంటలకు ప్రారంభమైంది. మొదట్నుంచే కొన్ని బూత్‌లలో ఈవీఎంలు మొరాయించాయి. అప్రమత్తమైన అధికారులు ఈవీఎంలను సరిచేసి పోలింగ్ కొనసాగిస్తున్నారు. మరికొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆపేయాల్సి వచ్చింది.

నంద్యాల ఎన్జీవో కాలనీలోని 94వ పోలింగ్ బూత్‌లో ఉదయం నుంచి రెండుసార్లు ఈవీఎం మొరాయించింది. దీంతో పోలింగ్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు బూత్ దగ్గరికి చేరుకుని ఈవీఎంలను సరిచేసే పనిలో నిమగ్నమయ్యారు. ఓటర్లు క్యూలో కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చింది. మరోవైపు నంద్యాల టౌన్ పోలీస్‌స్టేషన్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ జరుగుతోంది

నంద్యాల ఉప ఎన్నిక అప్‌ డేట్స్‌...


నంద్యాల : చిన్నాచితకా ఇబ్బందులు మినహా నంద్యాల ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటల నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు  పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. తొమ్మిది గంటల వరకూ 17 శాతం పోలింగ్‌ నమోదైంది.  మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో వస్తుండడం విశేషం. బూత్‌ నంబర్ 152లో  సరిగా వెలుతురు లేకపోవడంతో .....ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు.  దాదాపు  255 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది.. సమస్యాత్మక, అతిసమస్యాత్మక కేంద్రాల్లో ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.

ఈ ఉప ఎన్నికలో  టీడీపీ, వైఎస్‌ఆర్‌ సీపీ, కాంగ్రెస్‌తో పాటు మొత్తం 15 మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం  2 లక్షల 18 వేల 858 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఎన్నికల నిబంధనలకు ఉల్లంఘిస్తున్నారు. సుమారు 20మంది అనుచరులతో కలిసి పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లేందుకు యత్నించారు. మరోవైపు బ్రహ్మానందరెడ్డి సోదరి ఏకంగా పోలింగ్‌ బూత్‌లోనే ఎన్నికల ప్రచారం చేపట్టారు. టీడీపీకే ఓటు వేయాలని బ్రహ్మానందరెడ్డి సోదరి నాగ మౌనిక ఆదేశాలు ఇచ్చారు.

♦ఉదయం 9 గంటల వరకూ 17 శాతం పోలింగ్‌ నమోదు
♦ఓటు హక్కు వినియోగించుకున్న 37,236 మంది ఓటర్లు
♦ఓటు వేసిన మహిళలు (18,245) పురుషులు (18,991)

♦ నంద్యాలలో మంత్రి ఆదినారాయణరెడ్డి అత్యుత్సాహం
♦గోస్పాడు మండలం దీబగుంటలో వైఎస్‌ఆర్‌ సీపీ నేత పీపీ నాగిరెడ్డి బంధువులను అరెస్ట్‌ చేయాలని ఒత్తిడి
♦నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసిన అధికారులు

♦నంద్యాలలోని 84, 85, 86 బూత్‌లలో టీడీపీ రిలీవింగ్‌ ఏజెంట్ల హల్‌చల్‌
♦వైఎస్‌ఆర్‌ సీపీ ఏజెంట్లను బయటకు పంపి ఓటర్లను ప్రలోభపెడుతున్న టీడీపీ

 

వైఎస్ జగన్‌పై కేసు నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు

న్యూఢిల్లీ: నంద్యాల బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మీద జగన్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్‌ వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపినా తప్పులేదన్న వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యలు అభ్యంతరకరమని సీఈసీ తెలిపింది. జగన్‌ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తాయ స్పష్టం చేసింది. జగన్‌ వ్యాఖ్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. జగన్‌పై కేసు నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వడంతో వైసీపీ అధినేతకు కొత్త చిక్కు ఎదురైంది.

గాంధీ హాస్పిటల్లో గవర్నర్ పర్యటన 

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఇదివరకు హామీ ఇచ్చినట్లుగానే వైద్యం కోసం గాందీ హాస్పత్రిలో చేరారు. ఆయన  సాదారణ పేషంట్ మాదిరిగా ఎలాంటి ఆర్బాటం లేకుండా గాందీకి వచ్చారు. హాస్పిటల్ సూపరిండెంట్ శ్రవణ్ కుమార్, డిప్యూటి  సూపరిండెంట్ నరసింహరావు, చీఫ్ అడ్యినిస్ట్రేషన్  జయలక్ష్మిలతో కలిసి హాస్పిటల్ ను పరిశీలించారు. గతంతో పోలిస్తే సౌకర్యాలు మెరుగుపడ్డాయని, దీన్ని ఇలాగే కొనసాగించాలని వారికి సూచించారు గవర్నర్. 
 

మావోయిస్టుల తలలపై రివార్డులు 
 

తెలంగాణ కు చెందిన మావోయిస్టు దంపతులపై ఝార్ఖండ్ ప్రభుత్వం రివార్డులు ప్రకటించింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు  సుధాకర్‌పై రూ.25 లక్షలు, ఆయన భార్య నీలిమపై రూ.10 లక్షల రివార్డును ప్రకటించింది. ఝార్ఖండ్‌ పోలీసులు మొత్తం 12 మంది తో కూడిన జాబితా విడుదల చేయగా వాటిలో తొలి రెండు  పేర్లు వీరివే.  నక్సల్స్‌ ఏరివేతను ముమ్మరంచేసి, కనీసం 30 మంది మావోయిస్టు  అగ్ర నాయకులు అరెస్టు చెయ్యాలని పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం కొంతమంది నేతల తలలపై రివార్డులు ప్రకటించినట్లు ఝార్ఖండ్ పోలీసులు  తెలిపారు.

''మన ఊరు మన ఎంపీ''  కార్యక్రమం

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇవాళ బోధన్ మండలం సాలూర గ్రామంలో పర్యటిస్తున్నారు.    ''మన ఊరు మన ఎంపి'' కార్యక్రమంలో భాగంగా ఆమె సాలూర గ్రామంలో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆమెకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు.  
పర్యటనలో భాగంగా గ్రామంలో నిర్మిస్తున్న చాకలి ఐలమ్మ విగ్రహం, మహిళా భవనం, మినీ బస్ స్టాండ్ నిర్మాణాలకు ఎంపి శంకుస్థాపన చేశారు. అలాగే సీసీ రోడ్డు, గ్రంథాలయం, ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంక్ భవనాలను ప్రారంభించారు.  
 

ఏపీ లో ఐటీ ఉరకలు

విశాఖ పట్నం ను  ఐటీ హబ్ గా మారుస్తానని హామీ ఇచ్చిన ఐటీ మంత్రి నారా లోకేష్ అందుకు చర్యలు ప్రారంభించారు.  వైజాగ్ పరిసరాల్లోని రెసపువాని పాలెం టెక్నాలజి హబ్ లో నెలకొల్పిన ఎనిమిది ఐటీ కంపెసీలను ఆయన ప్రారంభించనున్నారు  ఈ కంపెనీల ద్వారా స్థానిక యువతకు భారీగా ఉద్యోగావకాశాలు పెరగనున్నాయని ఆయన తెలిపారు. మొత్తంగా వైజాగ్ లో ఎనిమిది కంపెనీలు, అమరావతిలో 22 కంపెనీలు నెలకొల్పనున్నట్లు లోకేష్ తెలిపారు.  
 

అధికార పార్టీకి మావోయిస్టుల హెచ్చరిక

జయశంకర్ భూపాలపల్లి సింగరేణి గనుల వద్ద ధామోధర్ పేరుతో వేలసిన మావోయిస్టు పోస్టర్లు కలకలం రేపుతున్నాయి . భూపాలపల్లి లో 2వ ఓపెన్ కాస్ట్ ను వ్యతిరేకిస్తూ తెలంగాణ స్పీకర్ మదుసూదనాచారి, అతని ముగ్గురు కోడుకులు అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని ఈ పోస్టర్ లో పేర్కొన్నారు. వారి చర్యలు మార్చుకోకపోతే ప్రజల చేతిలో శిక్ష తప్పదని హెచ్చరించారు. అలాగే మరికొద్ది మంది అధికార పార్టీ నాయకులు కూడా తమ ప్రవర్తన మర్చుకోకపోతే శిక్ష తప్పదన్నారు.

నేటి పెట్రోల్, డీజిల్ ధరలు

కొద్దిరోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలో వ్యత్యాసం కనిపిస్తుంది. పెట్రోల్ ధర ప్రతి రోజూ పెరుగుతుండగా, డీజిల్ ధర పెరగడం, తగ్గడం జరుగుతోంది. రోజు లాగే ఈ రోజు కూడా పెట్రోలు ధర పెరగగా, డీజిల్‌ ధర తగ్గింది. తాజా సమీక్షతో పెట్రోలుపై ఏడు పైసలు పెరగగా, డీజిల్‌పై ఒక పైసా తగ్గింది. పెట్రోల్ పాత ధర రూ.72.70 ఉండగా, కొత్త ధర రూ.72.77కు చేరింది. డీజిల్ పాత ధర 62.98 ఉండగా, కొత్త ధర 62.97కు చేరింది.

అవినీతి అధికారిపై ఏసీబి దాడులు
 

ఆదిలాబాద్ లో పనిచేస్తున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ బాపూజీ ఇంటి పై ఏసీబీ అధికారలు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తుల కలిగి ఉన్నాడన్న సమాచారంతో, ఆయనకు సంభందించిన  3 చోట్ల ఏసీబీ బృందాలు  ఏకకాలంగా దాడులు నిర్వహించాయి.  హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మరియు ఆదిలాబాద్ లోని మరో రెండు చోట్ల ఈ రైడ్స్ కొనసాగుతున్నాయి.

నంద్యాలలో ప్రారంభమైన  పోలింగ్

నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్‌  ఈ రోజు ఉదయం 7గంటలకు ప్రారంభమైంది. తెదేపా.. వైకాపా.. కాంగ్రెస్‌తో కలిపి మొత్తం 15మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సాయంత్రం 6గంటల వరకు సాగే ఈ పోలింగ్‌కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

యూపీలో మరో రైలు ప్రమాదం

ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో రైలు పట్టాలు తప్పింది. అరియా వద్ద కైఫియత్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 9 బోగీలు బుధవారం తెల్లవారుజామున 3గంటల సమయంలో పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 40మందికిపైగా గాయపడినట్లు సమాచారం.
 

రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

హైదరాబాద్‌: రెండేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటనిది. తీవ్ర రక్తస్రావమైన ఆ చిన్నారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. పహాడీషరీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీకాంత్‌రెడ్డి ఈ వివరాలు వెల్లడించారు. 

బెట్టింగ్ రాయుళ్లకు బేడీలు 
 

కాకినాడ: కాకినాడ కేంద్రంగా క్రికెట్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై 17 మంది బుకీలను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా కాకినాడకు చెందిన వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అనుచరులుగా గుర్తింపు.

సమస్యల పరిష్కారం దిశగా ఏపీ ప్రభుత్వం  

ఆంధ్రప్రదేశ్‌ ఆవల ఉన్నవారు ఏపీ ప్రభుత్వం దృష్టికి ఏమైనా సమస్యలు తీసుకురాదలుచుకుంటే 18004254440 నెంబరుకు ఫోన్‌ చేయాలని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన 1100 పరిష్కార వేదిక నెంబర్‌కు రాష్ట్రం వెలుపల ఉన్నవారు ఫిర్యాదు చేయాలంటే సమస్యలు వస్తున్నాయని అందుకే ఈ నంబరును ఏర్పాటు చేసినట్లు వివరించారు.

రైలు ప్రమాదంలో చిరుత మృతి
 

మహానంది: రైలు ప్రమాదంలో రెండేళ్ల వయసున్న ఆడ చిరుతపులి మరణించింది. కర్నూలు జిల్లా మహానంది మండలం నల్లమల అడవిలోని బొగద టన్నెల్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. 

బ్లూవేల్ లింకును తొలగించండి 

 కేంద్ర ప్రభుత్వంతోపాటు గూగుల్‌.. ఫేస్‌బుక్‌.. యాహూ తదితర అంతర్జాల సంస్థలకు దిల్లీ హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. చిన్నారులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న ‘బ్లూవేల్‌ ఛాలెంజ్‌’ క్రీడకు సంబంధించిన లింకులను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై స్పందన తెలపాల్సిందిగా వాటిని కోరింది.

దావూద్ పాకిస్థాన్ లోనే ఉన్నాడు - బ్రిటన్ ప్రభుత్వం
 

మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం పాకిస్థాన్‌లో 21 మారుపేర్లతో చలామణీ అవుతున్నట్లు బ్రిటన్‌ ప్రభుత్వం గుర్తించింది. పాక్‌లో అతడికి మూడు చిరునామాలు ఉన్నాయని పేర్కొంది. బ్రిటన్‌ ఆర్థిక శాఖ తాజాగా విడుదల చేసిన ఆర్థిక ఆంక్షల జాబితాలో ఇవి వెల్లడయ్యాయి.

ఆక్వా సాగుకు లైసెన్సుండాలి
 

నెల్లూరు జిల్లా: లైసెన్సులు లేకుండా ఆక్వా సాగు చేయడం నేరమని, జిల్లా వ్యాప్తంగా పరిశీలించి లైసెన్సులు లేకుండా ఆక్వా సాగుచేస్తున్న వారికి నోటీసులు జారీ చేసి లైసెన్సులు పొందేలా చర్యలు తీసుకుకోవాలని జిల్లా పరిపాలనాధికారి రేవు ముత్యాలరాజు మత్స్యశాఖాధికారులకు ఆదేశించారు. 
 

ఓటేసిన ఏవీ సుబ్బారెడ్డి
 

నంద్యాల..NGOకాలనీలోని మున్సిపల్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం లో టీడీపీ నేత  ఏవీ సుబ్బారెడ్డి సతీసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మొరాయిస్తున్న ఈవీఎంలు

నంద్యాల ఉపఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే భారీ ఓటింగ్ నమోదవుతోంది. అయితే కొన్ని బూత్ లలో ఈవీఎంలు మెరాయిస్తున్నాయి. నంద్యాల NGO'S కాలనీ పోలింగ్ బూత్....మరియు 94 వ పోలింగ్ బూత్ లలో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. 
 

నంద్యాలలో ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ సమాచారం
 

ఎన్నికల అధికారుల సమాచారం ప్రకారం

ఇప్పటివరకు ఓటేసిన పురుషులు : 18991

                     ఓటేసిన మభిళలు:18245
                      మొత్తం    :   37236
                      పోలింగ్ శాతం : 17.0 %
 

ఎన్నికల అధికారికి గుండెపోటు

నంద్యాల ఉపఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న ఎన్నికల అధికారి గుండెపోటుకు లోనయ్యాడు. పూలూరు పోలింగ్‌ కేంద్రంలో పోలింగ్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరెడ్డి విధుల్లో పాల్గొన్న కొద్ది సేపటికే గుండెపోటుతో బూత్ లోనే కుప్పకూలిపోయారు. అక్కడున్న పోలీసులు ఆయన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే దీనిపై స్పందించిన అధికారులు శ్రీనివాసరెడ్డి స్థానంలో మరో ఆఫీసర్‌‌ను నియమించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  

ఓటు వేసిన శిల్పా మోహన్ రెడ్డి

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంజీవ్‌నగర్‌ బూత్‌ నంబర్‌ 81కి కుటుంబ సమేతంగా వచ్చిన శిల్పా.. ఓటు  వేశారు.

నంద్యాలలో ప్రారంభమైన పోలింగ్

కర్నూలు: నంద్యాలలో ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది.  ఉదయం ఏడు గంటల నుంచే తమ ఓటుహక్కను వినియోగించుకోవడానికి పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. నియోజకవర్గంతో మొత్తం 255 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు  ఈసీ, 141 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించింది. వీటి వద్ద పోలీసులను భారీగా మొహరించారు. 
 

click me!