మరో స్వామీజిపై అత్యాచారం కేసు

First Published Sep 25, 2017, 10:59 AM IST
Highlights

విశేష వార్తలు

  • అత్యాచారం కేసులో దత్త పీఠమ్ అధిపతి శ్రీరామ్ శర్మ పై కేసు నమోదు
  • తమిళనాడులోని ఇస్రో పరిశోధన కేంద్రంలో అగ్నిప్రమాదం
  • నయీం కుటుంబ సభ్యులకు ఐటీ నోటీసులు
  • నగ్న ఫోటోలతో భార్యను బెదిరించిన భర్త 
  • విజయనగరం జిల్లాలో చిన్నారిపై వృద్దుడి అత్యాచారం
  • ఏపీ టౌన్ ప్లానింగ్ అధికారులపై ఏసిబి దాడులు

మరో స్వామీజిపై అత్యాచారం కేసు 

భక్తి పేరుతో అమాయక మహిళపై అత్యాచారానికి పాల్పడిన పీఠాధిపతి భాగోతం బయటపడింది. తనపై  దత్త పీఠమ్ అధిపతి శ్రీరామ్ శర్మ అత్యాచారం చేశాడంటూ నాచారం పోలీస్ స్టేషన్ లో ఓ భక్తురాలు  ఫిర్యాదు చేసింది. అత్యాచారంతో పాటు పూజల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసాడని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది.
దీంతో రామ్ శర్మ  పై 354, 420 సెక్షన్ కింద నాచారం పోలీసులు  కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. 

ఇస్రో పరిశోధన కేంద్రంలో అగ్నిప్రమాదం

 

తమిళనాడు లోని మహేంద్రగిరి ఇస్రో పరిశోధన కేంద్రంలో ప్రమాదం సంభవించింది. ద్రవ, ఘన ఇందనం తయారుచేసే యూనిట్ లో అగ్రి ప్రమాదం సంభవించింది. అగ్నికిలలు ఎగిసిపడుతుండటంతో శాస్త్రవేత్తలు ఆందోళనకు గురవుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.
అయితే ఈ మంటలు ప్రమాదవశాత్తు జరిగిందా లేక దీంట్లో ఏదైనా కుట్ర కోణం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.

నయీం కుటుంబసభ్యులకు ఐటీ నోటీసులు

యాదాద్రి భువనగిరి జిల్లా : నయీం కేసులో మళ్లీ కదలిక వచ్చింది. ఆదాయపన్ను శాఖ అధికారులు నయీం కుటుంబసభ్యుల పేరుమీదున్న ఆస్తుల వివరాలను తెలియజేస్తూ.. వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలను సమర్పించాలని..   బినామీ ట్రాన్సాక్షన్స్ కింద  ఆధాయపు పన్ను అధికారులు నోటీసులు జారీ చేశారు.  యాదాద్రి జిల్లాలోని భువనగిరిలోగల నయీం ఇంటికి ఈ నోటీసులు అంటించారు.  
నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత కాస్త హడావిడి చేసిన సిట్‌ పోలీసులు ఆ తర్వాత కేసు విషయంలో కాస్త నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.  అయితే, తాజాగా  నయీం భార్యకు, తల్లికి, సోదరీమణులకు నోటీసులు పంపించారు. మొత్తం 26చోట్ల నయీం ఆస్తులు గుర్తించామని, వాటిల్లో బినామీలు నయీం భార్య, తల్లి, సోదరీమణులు ఉన్నట్లు తాము గుర్తించామని పేర్కొన్న ఐటీ అధికారులు వారి నుంచి వివరాలు కోరారు.  

అటవీ అధికారి  హత్య కేసు నిందితులకు జీవిత ఖైదు 

అటవీ భూములను ఆక్రమణలను అడ్డుకున్న అటవీ అధికారి గంగయ్యను హత్యచేసిన నిందితులకు కోర్టు శిక్షను ఖరారు చేసింది. మొత్తం 14 మందికి జీవిత ఖైదు విధిస్తున్నట్లు ఎస్సీ ఎస్టీ కోర్టు తుదితీర్సును వెలువరించింది.
నిజామాబాద్ జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గంగయ్య హత్య కేసులో మొత్తం 37 మందిపై కేసు నమోదయ్యింది. అయితే వారిలో 14 మందిని కోర్టు దోషులుగా నిర్ధారించింది.
 

నగ్న ఫోటోలతో సొంత భార్యపైనే బెదిరింపులకు దిగిన భర్త

కట్టుకున్న భార్య నగ్న ఫోటోలను, వీడియాలను తీసి బెదిరింపులకు పాల్పడుతున్న సునీల్ అనే వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. తనతో పాటు తన కుటుంబం పెట్టిన కేసులను విత్ డ్రా చేసుకోవాలంటూ బాధితురాలి సోదరుడికి ఫేక్ మెయిల్ ఐడీతో వీడియో, ఫోటోలను సునీల్ పంపించాడు. దీంతో భాధితురాలు ఆందోళన చెంది సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఐపి అడ్రస్ ఆధారంగా విచారణ చేసిన పోలీసులు దీనికి పాల్పడింది ఆమె భర్త సునీలే అని గుర్తించారు. అతడ్ని పట్టుకున్న పోలీసులు రిమాండ్ కు తరలించారు.  
 

కృష్ణా జిల్లాలో గంజాయి సరఫరా ముఠా అరెస్టు

కృష్ణా జిల్లాలోని భారీగా గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.  భద్రాచలం నుంచి చెన్నై తరలిస్తున్న 600 కిలోల గంజాయిని కల్గిన వాహనాలను పక్కా సమాచారంతో కృష్ణా జిల్లా పోలీసులు పట్టుకున్నారు. వీటిని తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, ఓ లారీ, మినీ వ్యాన్ ను స్వాదీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితులను పోలీసులు ఓ రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం.
 

14 ఏళ్ల బాలికపై 50 ఏళ్ల వృద్దుడి అత్యాచారం

అభం శుభం తెలియని పద్నాలుగేళ్ల చిన్నారి పై తాత వరస అయ్యే వ్యక్తి అత్యాచారం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం పిట్టపేటకు చెందిన బాలిక వంటచెరుకు కోసం పొలానికి వెళ్ళగా అక్కడ తోటపని చేస్తున్న 50 ఏళ్ల వ్యక్తి బాలికపై అత్యాచారినికి ఒడిగట్టాడు.
ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలపడంతో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. వారు లక్షరూపాయలు పరిహారం చెల్లించాలని నిందితుడికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు.

అయితే ఈ విషయాన్ని ఓ వ్యక్తి జిల్లా ఎస్పీకి సమాచారం ఇవ్వడంతో విషయం బయటకు పొక్కింది. 
దీంతో స్థానిక ఎస్‌ఐతో కలిసి సిఐ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.బాలికపై అత్యాచారం జరిగినట్టు గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  
 

ఏసిబి వలలో ఏపీ టౌన్ ప్లానింగ్ అధికారులు

ఆంద్రప్రదేశ్ లో అవినీతి అధికారులపై ఎసిబి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఏపీ టౌన్ ప్లానింగ్  డైరెక్టర్ రఘు పై అవినీతి ఆరోపణలు, అక్రమాస్తులకు సంభందించిన సమాచారం రావడంతో  ఏసిబి అధికారుల ఆయన ఆస్తులపై దాడులు నిర్వహించారు. వైజాగ్ లోని ఆయన నివాసంతో పాటు మరో ఆరుచోట్ల అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. షిర్డీ, మంగళగిరి, నెళ్లూరు ప్రాంతాల్లో ఆయన భారీగా ఆస్తులు కల్గి ఉన్నాడని గుర్తించారు. గన్నవరం సమీపంలో 300 ఎకరాల భూమిని కల్గి ఉన్నాడని ఏసిబి అధికారులు గుర్తించి, అందుకు సంభందించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
 

మరోవైపు విజయవాడ టౌన్ ప్లానింగ్ అధికారి శివప్రసాద్ నివాసంలో కూడా ఏసిబి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాడులకు సంభందించి ముందే సమాచారం అందడంతో వాషింగ్ మిషన్ లో దాచిన 10 కేజీల బంగారాన్ని అధికారులు గుర్తించారు. బంగారమే కాకుండా వెండి బిస్కెట్లు,ఆభరణాలు, వస్తువులు భారీగా పట్టుబడ్డాయి. అలాగే గన్నవరంలో 7 కోట్ల విలువచేసే భూములున్నట్లు అధికారులు గుర్తించాయి. ఆయన నివాసంతో పాటు భందువుల ఇళ్లలోను ఏసిబి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
 

ప్రకాశం జిల్లాలో ఎస్సైపై దోపిడిదొంగల దాడి

ప్రకాశం జిల్లాలోని మార్టూరు మండలం బొల్లపల్లి వద్ద స్థానిక ఎస్సై నాగమల్లేశ్వరరావుపై దొంగలు కత్తులతో దాడి చేశారు. రాత్రి జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహిస్తుండగా అదే దారిలో ప్రయాణిస్తున్న దొంగలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఎస్సై తో పాటు తోటి సిబ్బందిని తీవ్రంగా గాయపర్చి దుండగులు పరారయ్యారు.తీవ్రంగా గాయపడిన ఎస్సైని చిలకలూరిపేట హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అనుమానంతో భార్యను చంపిన కసాయి భర్త

అనుమానం పెనుభూతమై ఓ భర్త కట్టుకున్న భార్యను  గొంతునులిమి చంపిన దుర్ఘటన విజయవాడలోని పాయికాపురం సుందరయ్య నగర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే సుధాకర్ రమాదేవిలు భార్యాభర్తలు. రెండు సంవత్సరాక్రితం వీరికి వివాహం జరిగింది. ఈ దంపతులు సుందరయ్య నగర్ లో కాపురముంటున్నారు. అయితే ఆటోడ్రైరవర్ గా పనిచేస్తున్న సుధాకర్ పెళ్లైన నాటినుండి అనుమానంతో  భార్యను చిత్రహింసలు పెట్టేవాడు. దీనిపై ఐదు సార్లు వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఎప్పటిలాగే భార్యపై మరోసారి అనుమానంతో దాడి చేసి కోపంతో గొంతు నులమడంతో ఊపిరాడక రమాదేవి మృతిచెందింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బాయిలర్ పేలి ఓ కార్మికుడి మృతి 

రంగారెడ్డి: కాటేదాన్ పారిశ్రామిక వాడలో ఇవాళ ఉదయం ఓ ఫుడ్ కంపెనీలో ప్రమాదం సంభవించింది. చాక్లెట్స్ తయారు చేసే ఎస్‌ఎ ఫుడ్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలడంతో ఒడిశా రాష్ట్రానికి చెందిన కరన్ అనే కార్మికుడు అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. మరో కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని ఆప్నత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఝార్ఖండ్ లో భారీ అగ్నిప్రమాదం, 8 మంది మృతి

ఝార్ఖండ్ లోని కుమార్ డూబి ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. ఓ బాణసంచా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భారీ మొత్తంలో పరిశ్రమలో పేలుడు పధార్థాలు ఉండటంతో మంటలు ఎగిసి పడ్డాయి. ఈ మంటల్లో 8మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. మరో  25 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఎగిసిపడుతున్న మంటలను ఆర్పడానికి 5 ఫైర్ ఇంజన్లు పనిచేస్తున్నాయి. 

click me!