
శరీరంలో తగినన్ని ఎర్ర రక్త కణాలు లేనప్పుడు రక్తహీనత సమస్య వస్తుంది. అంటే ఈ సమస్య వల్ల శరీరంలో రక్తం తగ్గుతుంది. ఎర్ర రక్త కణాలు ఊపిరితిత్తుల నుంచి శరీరంలోని ఇతర భాగాలకు ఆక్సిజన్ ను రవాణా చేస్తాయి. శరీరంలోని అన్ని అవయవాలు, కణజాలాలు పనిచేయడానికి ఆక్సిజన్ చాలా అవసరం.
మీ రక్తంలో తగినంత ఆక్సిజన్ లేకపోతే.. అలసటగా, బలహీనంగా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ ను తీసుకెళ్లడానికి సహాయపడే హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ను తయారు చేయడానికి ఇనుము చాలా అవసరం.
రక్తహీనత సమస్య ఉన్నవారిలో కనిపించే అత్యంత సాధారణ లక్షణాలు అలసట, శక్తి లేకపోవడం, ఏమీ చేయాలనిపించకపోవడం, మైకము. రక్తహీనత సమస్య పోవాలంటే ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. రక్తహీనత సమస్యలను పోగొట్టే ఆహారాలేంటంటే..
గుడ్లు, చేపలు
ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు రక్తాన్ని పెంచడానికి బాగా సహాయపడతాయి. ముఖ్యంగా గుడ్లు, చేపలు, కూరగాయలు, ఆకుకూరలు. పాలకూర, బ్రొకోలీ మొదలైన వాటిలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.
ఖర్జూరాలు
ఖర్జూరాలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. ఖర్జూరాలు పోషకాల భాండాగారం. వీటిలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. వీటిని రెగ్యులర్ గా తింటే రక్తహీనత సమస్య తొందరగా తొలగిపోతుంది.
దానిమ్మ పండ్లు
దానిమ్మ పండ్లు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. దానిమ్మ పండులో క్యాల్షియం, ఐరన్, స్టార్చ్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దానిమ్మలో ఉండే విటమిన్ సి శరీరంలో ఐరన్ శోషణను పెంచుతాయి. అలాగే రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది.
విటమిన్ సి
రక్తహీనత సమస్యను పోగొట్టడానికి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను కూడా తినొచ్చు. నారింజ, నిమ్మకాయలు, ఉసిరి, టమోటాలు, ద్రాక్షలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీరంలో హిమోగ్లోబిన్ ను పెంచడానికి సహాయపడతాయి.
బీట్ రూట్
రోజూ బీట్ రూట్ ను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. బీట్ రూట్ లో ఐరన్ కంటెంట్ తో పాటుగా ఫోలిక్ యాసిడ్, పొటాషియం కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. నైట్రేట్ పుష్కలంగా ఉన్న బీట్రూట్ జ్యూస్ ను రోజూ తాగితే హిమోగ్లోబిన్ స్థాయిలు బాగా పెరుగుతాయి.