నిమిషానికి ఎన్ని అడుగులు నడిస్తే ఆరోగ్యం..?

By ramya Sridhar  |  First Published Jan 3, 2025, 1:51 PM IST

నడక ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే.. మనం ఎంత వేగంగా నడుస్తున్నాం అనే విషయం పై కూడా మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని మీకు తెలుసా?


నడక ఆరోగ్యానికి చాలా మంచి వ్యాయామం. శారీరకంగా మనల్ని ఫిట్ గా ఉంచడానికి మాత్రమే వాకింగ్ సహాయపడుతుందని అందరూ అనుకుంటారు. కానీ.. మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే.. మనం నడవడమే కాదు... ఎంత వేగంగా నడుస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యమే. ఒక నిమిషానికి మనం ఎంత వేగంగా నడుస్తున్నాం అనే విషయంపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందట. ఒక వ్యక్తి నడక వేగం, వారి భంగిమ ఆధారంగా ఆ వ్యక్తి శారీరక ఆరోగ్యాన్ని అంచనా వేయవచ్చు. ఒక వ్యక్తి నడక విధానం వారి ఆరోగ్యాన్ని ఎలా ప్రతిబింబిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Latest Videos

నడక వేగం:

ఒక వ్యక్తి నడక వేగం వారి ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తి నిమిషానికి 100 అడుగులు వేస్తే వారి ఆరోగ్యం బాగుందని తెలుసుకోవచ్చు. నెమ్మదిగా నడిచే వారి ఆరోగ్యం వేగంగా నడిచే వారిలా ఉండదు. వీరికి జ్ఞాపకశక్తి సమస్యలు, కండరాల బలహీనత వంటివి ఉండవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.

చురుగ్గా , వేగంగా నడిచే వారి గుండె ఆరోగ్యంగా ఉంటుందని తేలింది. వీరికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువ. అంతేకాకుండా వీరికి ఊపిరితిత్తుల పనితీరు కూడా బాగుంటుంది. మీరు రోజూ వాకింగ్ చేయని  వారైతే ఇక నుండి చేయడం ప్రారంభించండి. మీ నడక వేగం తక్కువగా ఉంటే క్రమంగా వేగాన్ని పెంచడానికి ప్రయత్నించండి.

 

21 రోజుల ఛాలెంజ్:

మీరు నడక చేయని వారైతే మీ శక్తిని పెంచుకోవడానికి ఈ అలవాటును మీ జీవితంలో చేర్చుకోండి. మొదట 21 రోజులు రోజూ నడక చేయడం ప్రారంభించండి. ఒక రోజుకు 30 నిమిషాలు చొప్పున 21 రోజులు నిరంతరం నడవడం ప్రారంభించాలి. ఇలా నిరంతరం చేసినప్పుడు మీ శరీరంలో వచ్చే మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ తర్వాత మీరే వ్యాయామం చేయడానికి ఆసక్తి చూపుతారు.

 

నడక విధానం మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రతిబింబిస్తుంది?

మీరు ఎలా నడుస్తారో అనే దాని ఆధారంగా మీ మానసిక ఆరోగ్యాన్ని చెప్పవచ్చు. ఇప్పటికే మానసిక ఆరోగ్యం బాగాలేని వారు నడిచేటప్పుడు వారి ఆందోళన వ్యక్తమవుతుంది. వారి భంగిమ నడిచేటప్పుడు ఇతరుల మాదిరిగా ఉండదు. శరీరాన్ని వంగిన భంగిమలో ఉంచుతారు. భుజాలు ముందుకు కనిపిస్తాయి. ఎల్లప్పుడూ నేరుగా చూడకుండా తల వంచుకుని నేలను చూస్తూ నడవడానికి ఇష్టపడతారు.

నేరుగా చూస్తూ నిటారుగా నడిచేవారే సంతోషకరమైన మానసిక స్థితిలో ఉంటారు. వంగిన భంగిమలో తల వంచుకుని నడిచేవారి కంటే సరైన భంగిమలో నడిచేవారు ఎక్కువ సంతోషంగా ఉంటారు. మీ మానసిక ఆరోగ్యం బాగాలేకపోతే మీరు నడిచేటప్పుడు దాని లక్షణాలను గుర్తించవచ్చు. డిప్రెషన్ లో ఉన్నవారు నడిచే సమయంలో వారి కాళ్ళు లాగినట్లు అనిపిస్తుంది. నడక భంగిమ భిన్నంగా ఉంటుంది. అడుగులు కూడా తడబడతాయి. ఇలా ఉంటే మానసిక నిపుణుడిని సంప్రదించాలి.

నడక యవ్వనంగా ఉండటానికి సహాయపడుతుందా?

నడక వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. దీని కారణంగా వృద్ధాప్య ప్రక్రియ ఆలస్యమై యవ్వనంగా ఉంటారు. ఫ్రాంటియర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్‌లో వచ్చిన అధ్యయనాల్లో, సాధారణ నడక,  వేగమైన నడక రెండూ ఒక వ్యక్తి ఆయుష్షును పెంచుతాయని తేలింది. దీనివల్ల గుండె సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. మీ కండరాలు కుంచించుకుపోకుండా బలంగా ఉండటానికి నడక సహాయపడుతుంది. మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది. వయసు కారణంగా వచ్చే సమస్యల నుండి మిమ్మల్ని కాపాడటానికి నడక ఉత్తమ ఎంపిక.

click me!