కామన్ గా వచ్చే నోటి సమస్యలు.. తగ్గించే చిట్కాలు

By Mahesh RajamoniFirst Published Mar 21, 2023, 1:08 PM IST
Highlights

చాలా మంది నోటి ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోరు. దీనివల్లే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా నోటికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తాయి. 
 

నోటి ఆరోగ్యం బాగుంటేనే మనం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటాం. అందుకే మనం సమస్యతోని హాస్పటల్ కు వెళినప్పుడు మన నాలుకను, నోరును చెక్ చేస్తారు. కానీ మనలో చాలా మంది నోటి ఆరోగ్యం గురించి అంతగా పట్టించుకోరు. దీనివల్లే ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా నోటికి సంబంధించిన సమస్యలు. నోటి ఆరోగ్యం మీ దంతాలను ప్రభావితం చేయడమే కాదు, ఇది మీ మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది

నోటి వ్యాధులకు కారణాలు

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎప్పుడూ తియ్యని పదార్థాలను తిన్నప్పుడు దంతాల బయటి పొర క్షీణిస్తుంది. దీంతో నోటి వ్యాధులు వస్తాయి. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే క్షయం మరింత లోతుగా వ్యాపిస్తుంది. దీనివల్ల దంతాల రంగు మారుతుంది. నొప్పి కలుగుతుంది. సరిగా బ్రష్ చేయకపోవడం వల్ల దంతాలపై ఆహారం, ఫలకం పేరుకుపోతాయని నిపుణులు అంటున్నారు. ఇది దంత క్షయానికి దారితీయడమే కాకుండా చిగుళ్ళ నుంచి రక్తస్రావం, చిగుళ్ళ వాపు, దుర్వాసన వంటి సమస్యలు వస్తాయి.  కామన్ గా వచ్చే నోటి సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

దంత క్షయం

ఈ రోజుల్లో చాలా మంది దంత క్షయం లేదా కావిటీస్ తో బాధపడుతున్నారు. నోట్లో బ్యాక్టీరియా ఉండటం, తరచుగా బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయడం, తీయని పానీయాలను తాగడం, దంతాలను సరిగ్గా శుభ్రం చేయకపోవడం వంటి వివిధ కారణాల వల్ల దంతక్షయం సమస్య వస్తుంది. ఇది దంతాలకు శాశ్వత నష్టాన్ని కలిగిస్తుంది. ఇది చిన్నచిన్న రంధ్రాలను ఏర్పరుస్తుంది. పిల్లలు, టీనేజర్లు, వృద్ధులలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కావిటీస్ కు సకాలంలో చికిత్స తీసుకోకపోతే అవి దంతాల లోతైన పొరలను ప్రభావితం చేస్తాయి. ఇది సంక్రమణకు,  తీవ్రమైన పంటి నొప్పికి, దంతాల నష్టానికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

చిగుళ్ల వ్యాధి

చిగుళ్ల వ్యాధి ఒక తీవ్రమైన చిగుళ్ల ఇన్ఫెక్షన్. ఇది దంతాల చుట్టూ ఉన్న మృదు కణజాలానికి నష్టాన్ని కలిగిస్తుంది. వీలైనంత తొందరగా చికిత్స తీసుకోకపోతే చిగుళ్ల సంక్రమణకు దారితీస్తుంది. దంతాల నష్టానికి కూడా దారితీస్తుంది. చిగుళ్ల సంక్రమణను నివారించడానికి రోజుకు కనీసం రెండుసార్లైనా  మీ దంతాలను బ్రష్ చేయండి. అలాగే ప్రతిరోజూ ఫ్లోస్ చేయండి. తరచుగా దంత పరీక్షలు చేయించుకోండి.

దంతాల నష్టం

వయసు పెరుగుతున్న పిల్లలలో దంతాలు ఊడిపోవడం సర్వ సాధారణం. అయితే పెద్దవారిలో కూడా దంతాలు ఊడిపోతాయి. పెద్దవారిలో దంతాల నష్టం కోలుకోలేనిది. దంతాల మార్పిడి ద్వారా మాత్రమే చికిత్స చేయొచ్చు. చిగుళ్ల వ్యాధులు, దంత క్షయం, గాయంతో సహా వివిధ కారకాల వల్ల దంతాలు ఊడిపోతాయి. 

దంతాల అరుగుదల

దంతాల అరుగుదల వల్ల కూడా ఎన్నో సమస్యలు వస్తాయి. దీనివల్ల దంతాల ఆకారం బాగుండదు. దీనికి మరమ్మత్తు చేయడం కష్టం. చాలా ఖరీదుతో కూడుకున్నది కూడా. ఆమ్ల ఆహారాలు లేదా పానీయాల వల్ల దంతాలు అరిగిపోతాయి. దంతాలను ఒకదానికొకటి రుద్దడం, ఎక్కువగా బ్రష్ చేయడం, టూత్పిక్ ను పదేపదే ఉపయోగించడం, దంతాల మధ్య హెయిర్ పిన్లను ఉపయోగించడం వల్ల కూడా దంతాలు అరిగిపోతాయి. 

నోటి వ్యాధులను నివారించడం ఎలా?

  • ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ తో రోజూ రెండుసార్లు పళ్లు తోముకోవాలి. దంత క్షయాన్ని నివారించడానికి చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలకు బదులుగా కూరగాయలు, పండ్లను ఎక్కువగా తినాలి. 
  • దంతడాక్టర్ నిర్వహించే బేసిక్ స్కేలింగ్ అండ్ రూట్ ప్లానింగ్ (డెంటల్ క్లీనింగ్) విధానాలను ఫాలో అవ్వాలి.
  • బ్రష్ తో పాటు రోజూ ఫ్లోసింగ్ చేయాలి. దీనివల్ల దంతాల మధ్య ఫలకం ఏర్పడకుండా ఉంటుంది.
  • దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పొగాకుకు దూరంగా ఉండాలి. పొగాకు దంతాల మరకలు, దుర్వాసన, చిగుళ్ళ వ్యాధి, దంత క్షయం, నోటి సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ ప్రమాదాన్ని పెంచుతుంది.
click me!