ఒంట్లో కొలెస్ట్రాల్ ను కరిగించుకోవడానికి తిప్పలు పడుతున్నారా? వీటిని తినండి తొందరగా తగ్గుతుంది

By Mahesh RajamoniFirst Published Mar 21, 2023, 7:15 AM IST
Highlights

శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గించడం మరీ అంత కష్టమేమీ కాదు. ఓట్స్, కాయలు, కొవ్వు చేపలు, పండ్లు, కూరగాయలు, నిమ్మకాయలు వంటి ఆహారాలను రోజూ తింటే కొలెస్ట్రాల్ కరగడం మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

కొలెస్ట్రాల్ అనేది మన రక్తంలో కనిపించే మైనపు పదార్థం. ఇది మన కణాల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఎంతో సహాయపడుతుంది. అయినప్పటికీ.. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతే గుండె జబ్బులు, స్ట్రోక్, అధిక రక్తపోటుతో సహా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఒంట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా జాగ్రత్త పడాలి. 

మందులు, జీవనశైలి మార్పులు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. అయితే కొన్ని రోజువారీ ఆహారాలు కూడా మన శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఓట్స్

 ఓట్స్ లో బీటా-గ్లూకాన్ అని పిలువబడే ఒక రకమైన ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎల్డిఎల్ (చెడు) కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందుకోసం రోజుకు కేవలం 3 గ్రాముల బీటా-గ్లూకాన్ ను తీసుకోండి. అంటే ఒక బౌల్ వోట్మీల ను తీసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిలు 5% వరకు తగ్గుతాయి. 

గింజలు

బాదం, వాల్ నట్స్, పిస్తా వంటి గింజలలో మోనోశాచురేటెడ్, పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయని పలు పరిశోధనల్లో తేలింది. ప్రతిరోజూ గుప్పెడు గింజలను చిరుతిండిగా తీసుకున్నా లేదా సలాడ్లు, ఇతర వంటకాలకు జోడించినా కొలెస్ట్రాల్ స్థాయిలు బాగా తగ్గిపోతాయి. 

కొవ్వు చేపలు

సాల్మన్, ట్యూనా, మాకేరెల్ వంటి కొవ్వు చేపలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయని పలు పరిశోధనల్లో తేలింది. వారానికి కనీసం రెండుసార్లైనా కొవ్వు చేపలను తింటే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. 

పండ్లు, కూరగాయలు

పండ్లు, కూరగాయలలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. ఇందుకోసం  ప్రతిరోజూ వివిధ రకాల పండ్లు, కూరగాయలను తినండి. ఇవి మనల్ని ఎన్నో రోగాల నుంచి కాపాడుతాయి. 

నిమ్మకాయలు

నిమ్మకాయ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి టాక్సిన్స్  ను తొలగించడానికి సహాయపడతాయి. శరీరంలో మంటను తగ్గిస్తుంది. సిట్రస్ పండ్లలో హెస్పెరిడిన్ ఉంటుంది. ఇది రక్తపోటు లక్షణాలను తగ్గిస్తుంది. 

మీ రోజు రోజు వారి ఆహారంలో వీటిని చేర్చడంతో పాటుగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. స్మోకింగ్ అలవాటును మానుకోండి. అలాగే మందును ఎక్కువగా తాగకండి. ఈ జీవనశైలి మార్పులు మీ శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. 

click me!