
కాలెయంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల వచ్చే సమస్యనే ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. అయితే కాలెయంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడానికి కారణాలెన్నో ఉండొచ్చు. ఆల్కహాల్ ను ఎక్కువగా తాగడం, జీవనశైలి సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. అ వ్యాధిని స్టార్టింగ్ స్టేజ్ లో గుర్తించడం చాలా కష్టం. అయితే చాలా కాలం నుంచి అలసట, కడుపు నొప్పి, బరువు తగ్గడం వంటి సమస్యలను ఎదుర్కొంటుంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ ను సంప్రదించాల్సిందేనంటున్నారు నిపుణులు.
అయితే ఫ్యాటీ లివర్ డిసీజ్ కు సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే హార్ట్ ఎటాక్, స్ట్రోక్, డయాబెటీస్ వంటి రోగాల ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఈ వ్యాధిని వీలైనంత తొందరగా తగ్గించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఫ్యాటీ లివర్ డిసీజ్ తో బాధపడుతున్న వారు వారానికి 5 రోజులు ఖచ్చితంగా వ్యాయామం చేయాలని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ చికాగో పరిశోధకులు చెబుతున్నారు. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్న 80 మంది పేషెంట్లపై అధ్యయనం చేశారు. అయితే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ రోజూ వ్యాయామం చేసి రోజులో కొన్ని గంటలు ఉపవాసం ఉండటం వల్ల ఈ సమస్య నుంచి తొందరగా బయటపడొచ్చని పరిశోధకులు కనుగొన్నారు.
అమెరికాలోని పెన్సిల్వేనియాలోని హెర్షేలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు ఒక అధ్యయనంలో.. ప్రతి వారం 150 నిమిషాల తీవ్రమైన ఏరోబిక్స్ కొవ్వు కాలెయ వ్యాధి నుంచి బయటపడేస్తుంది. ఈ అధ్యయనం అమెరికన్ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీలో ప్రచురితమైంది.
మధ్యధరా ఆహారాన్ని అనుసరించడం వల్ల కూడా ఫ్యాటీ లివర్ సమస్య తగ్గిపోతుందని ఒక అధ్యయనం పేర్కొంది. మధ్యధరా ఆహారం అంటే మొక్కల ఆధారిత ఆహారం అని అర్థం. అంటే ఈ డైట్ లో పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. ఈ ఆహారంలో రకరకాల పండ్లను, ధాన్యాలను, కూరగాయలను, వివ్తనాలను చేర్చుతారు.
అయితే ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించుకోవాలంటే ముందుగా దాని ప్రమాదకారకాల గురించి తెలుసుకోవాలి. స్లీప్ అప్నియా, హై కొలెస్ట్రాల్, స్థూలకాయం, హైపోథైరాయిడిజం, డయాబెటీస్ వంటి సమస్యలు కొవ్వు కాలెయ వ్యాధిని బాగా పెంచుతాయి. అయితే కొన్ని రకాల మందుల వల్ల కూడా కాలెయంలో కొవ్వు పేరుకుపోతుందని నిపుణులు చెబుతున్నారు.
ఫ్యాటీ లివర్ సమస్య నుంచి పూర్తిగా బయటపడాలంటే మాత్రం మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడంతో పాటుగా బరువును కూడా నియంత్రణలో ఉంచుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. దీంతో పాటుగా దీని ప్రమాద కారకాలను తగ్గించుకోవాలి.