
కాస్త లేట్ గా వస్తే బాగుండు అనుకునే వారికంటే.. పీరియడ్స్ టైం కంటే ఇంకొంచెం ముందుగానే రావాలని కోరుకునే వారు చాలా మందే ఉన్నారు. పండుగలు, పెళ్లిళ్లు అంటూ ప్రత్యేక సందర్భాల్లో పీరియడ్స్ కొంచెం ముందుగా రావాలని అనుకుంటారు. ఇలాంటి వారికోసం కొన్ని చిట్కాలు బాగా సహాయపడతాయి. అవేంటంటే..
వ్యాయామం
తేలికపాటి వ్యాయామం కండరాలను సడలించడానికి, తొందరగా పీరియడ్స్ అయ్యేందుకు సహాయపడుతుంది. అయితే హెవీ వ్యాయామాల వల్ల చాలా మందికి ఇర్రెగ్యుర్ పీరియడ్స్ సమస్య వస్తుంది. అందుకే అందుకే మితమైన వ్యాయామాన్నే చేయాలి. ఇది రుతుచక్రాన్ని పునరుద్ధరించడానికి అవసరమైన హార్మోన్లను రిలీజ్ చేయడానికి సహాయపడుతుంది. జర్నల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ప్రమోషన్ లో ఒక అధ్యయనం ప్రకారం.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఊబకాయం తగ్గిపోతుంది. హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. అంతేకాదు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే అవకాశమే ఉండదని కనుగొన్నారు. డ్యాన్స్ చేసినా.. ఏరోబిక్స్, జిమ్ లేదా పార్కులో నడిచినా మంచి ఫలితాలను పొందుతారు. ఏదేమైనా ప్రతిరోజూ కనీసం 30-45 నిమిషాలు వ్యాయామం చేసేలా చూసుకోండి. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
విశ్రాంతి
విశ్రాంతి తీసుకోవడానికి, డీకంప్రెస్ చేసే కొన్ని పద్దతులు కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఒత్తిడితో సతమతమయ్యే వారికి పీరియడ్స్ లేట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఒత్తిడిని తగ్గించేందుకు సున్నితమైన యోగా, ధ్యానం చేయండి. అలాగే స్నేహితులు, ప్రియమైన వారితో కాస్త సమయం గడపండి.
విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారం
విటమిన్ సి ఉన్న పండ్లు, కూరగాయలు శరీరంలో ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటాయి. అలాగే గర్భాశయ పొర షెడ్డింగ్ ను మృదువుగా చేస్తాయి. ఇవి శరీరంలో వేడిని ఉత్పత్తి చేసి రుతుచక్రం ఆరోగ్యంగా పనిచేయడానికి ఉపయోగపడతాయి.
బెల్లం వినియోగం
బెల్లం సహజంగా రుతుచక్రాన్ని ప్రేరేపించడానికి లేదా నియంత్రించడానికి బాగా ఉపయోగపడుతుంది. క్రమం తప్పకుండా బెల్లాన్ని తీసుకోవడం వల్ల రుతుక్రమ అసౌకర్యం తొలగిపోతుంది. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. ఇనుము ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే రుతుస్రావాన్ని కూడా ప్రేరేపిస్తుంది.