
రాత్రిపూట ఆకలి వేయడం చాలా మందికి సర్వసాధారణ విషయం. ఒత్తిడి, ఆందోళన ఫలితంగా ఇలా అర్థరాత్రి ఆకలి కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ అర్థరాత్రి ఆకలి కోరికలు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు దారితీస్తాయి. ఇది చివరికి ఊబకాయానికి దారితీస్తుంది. హార్మోన్ల అసమతుల్యత, నిద్ర లేకపోవడం, ఒత్తిడి, పేలవమైన ఆహారపు అలవాట్లు వంటివి రాత్రిపూట ఆకలి కోరికలను పెంచుతాయి. హార్మోన్ల అసమతుల్యత గ్రెలిన్ వంటి ఆకలి హార్మోన్ల పెరుగుదలకు కారణమవుతుంది. ఇది మీరు కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాలనే తినేలా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. నిద్రలేమి ఆకలిని నియంత్రించే హార్మోన్లను కూడా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల కూడా అనారోగ్యకరమైన ఆహారాన్ని కోరుకునే అవకాశం ఉంది.
రాత్రిపూట తినాలనిపించడానికి దారితీసే కారకాలలో ఒత్తిడి కూడా ఒకటి. ఒత్తిడికి గురైనప్పుడు శరీరం కార్టిసాల్ అనే హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది చక్కెర లేదా అధిక కొవ్వు ఆహారాల కోసం ఆకలిని పెంచుతుంది. దీనికి తోడు రోజంతా పేలవమైన ఆహారపు అలవాట్లు, భోజనాన్ని స్కిప్ చేయడం లేదా తగినంత ప్రోటీన్ ను తీసుకోకపోవడం వంటివి కూడా రాత్రిపూట ఆకలి కోరికలకు దారితీస్తాయి.
రాత్రిపూట ఆకలి కోరికలను నిరోధించడం చాలా కష్టం. అయినప్పటికీ వాటిని నివారించడానికి కొన్ని చిట్కాలు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అర్థరాత్రి ఆకలి కాకూడదంటే రోజంతా సమతుల్య, పోషకమైన ఆహారాన్ని తినాలి. తగినంత ప్రోటీన్, ఫైబర్ ను తీసుకుంటే మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. ఆకలి కోరికలు తగ్గుతాయి.
రోజంతా భోజనాన్ని స్కిప్ చేయడం లేదా తక్కువ కేలరీల ఫుడ్ ను తినడం అస్సలు మంచిది కాదు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పడిపోతాయి. దీనివల్ల రాత్రిపూట చక్కెర లేదా కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాన్ని కోరుకునే అవకాశం ఉంది. ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని నివారించి పోషకాలు దట్టంగా ఉండే ఆహారాలను తింటే అర్థరాత్రి ఆకలయ్యే అవకాశం తగ్గుతుంది.
రాత్రిపూట ఆహార కోరికలను నివారించడానికి తగినంత నిద్ర కూడా అవసరమే. అలాగే ఒత్తిడి స్థాయిలను తగ్గించుకోవాల్సి ఉంటుంది. ప్రతి రాత్రి కనీసం 7 నుంచి 8 గంటల నిద్రపోవాలి. అలాగే వ్యాయామం లేదా ధ్యానం వంటి కార్యకలాపాలతో ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.
మానసిక ఆరోగ్యంపై ఊబకాయం ప్రభావం ఎలా ఉంటుంది?
ఊబకాయం మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. నిరాశ, ఆందోళన, తక్కువ ఆత్మగౌరవం వంటి సమస్యలను కలిగిస్తుంది. ఊబకాయం తగ్గడానికి శారీరక శ్రమను పెంచండి. అలాగే ఆహారపు అలవాట్లను మెరుగుపరచండి. బరువును పెంచే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ జోలికి వెళ్లకండి.