చల్ల చెమటలు పడుతున్నయా.. అయితే మీకు ఈ రోగాలున్నట్టే..!

By Mahesh RajamoniFirst Published Mar 23, 2023, 11:15 AM IST
Highlights

చల్లని చెమటలు పట్టడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని రకాల క్యాన్సర్లు, తీవ్రమైన ఒత్తిడి, డయాబెటీస్, తక్కువ రక్తపోటు వంటి ఎన్నో రోగాలకు కూడా ఇలాగే చెమట పడుతుంది. 

మండుతున్న ఎండల్లో చెమటలు పట్టడం చాలా కామన్. శరీరానికి గాలి తగలనప్పుడు ఇలాగే చెమట పడుతుంది. అయితే కారణం లేకుండా చెమటలు పట్టడం మాత్రం ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కొన్ని రోగాల వల్లే ఇలా అవుతుందంటున్నారు నిపుణులు. ఇంతకీ చల్లని చెమట ఎందుకు పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఆందోళన

చల్లని చెమటలు పట్టడానికి భయాందోళనలు కూడా ఒక కారణమేనంటున్నారు నిపుణులు. ఆందోళన శరీరంలో స్ట్రెస్ ను పెంచుతుంది. ఇది హృదయ స్పందన రేటును, రక్తపోటును పెంచే ఆడ్రినలిన్ వంటి హార్మోన్లను విడుదల చేస్తుంది. అలాగే చెమట పట్టడానికి కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. ఆందోళన వల్ల చల్లని చెమటలు పడితే తరచుగా వణుకు, మైకము, శ్వాస ఆడకపోవడం వంటి ఇతర సమస్యలు వస్తాయి. 

తక్కువ రక్తపోటు లేదా సింకోప్

రక్తపోటు అకస్మాత్తుగా పడిపోవడం వల్ల మెదడుకు రక్త ప్రవాహం తగ్గుతుంది. దీనివల్ల కొన్ని సెకన్ల పాటు స్పృహ కోల్పోయే అవకాశం ఉంది. దీనిని సింకోప్ అంటారు. దీనికి ముందు చల్లని చెమటలు పడతాయి. తక్కువ రక్తపోటు వల్ల నిర్జలీకరణం, రక్త నష్టం, గుండె సమస్యలు లేదా మందుల వల్ల వస్తుంది. సింకోప్, చల్లని చెమటలు పట్టే వ్యక్తులు హెల్త్ చెకప్ లు చేయించుకోవాలి. 

హైపోగ్లైసీమియా లేదా రక్తంలో తక్కువ చక్కెర

మందులు, భోజనం లేదా స్నాక్స్ ను మిస్ చేసే డయాబెటిస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలు 70 మి.గ్రా / డిఎల్ కంటే తక్కువగా పడిపోతాయి. అలాగే  చెమట ఎక్కువగా పడుతుంది లేదా స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు హైపోగ్లైసీమియాను ఎలా నివారించాలి? ఎలా నిర్వహించాలి? అనే దాని గురించి డాక్టర్ సలహాను తీసుకోవాలి. 

క్యాన్సర్లు

లింఫోమా, లుకేమియా, ఎముక క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్లు కూడా చల్లని చెమటలకు కారణమవుతాయి. ఈ క్యాన్సర్ల వల్ల రాత్రిపూటే ఎక్కువగా చల్ల చెమటలు పడతాయి. ఈ రకమైన చెమటల వల్ల ఒంటిమీదున్న బట్టలు చెమటతో తడిసిపోతాయి. రాత్రి సమయంలో చల్లని చెమటలు ఇతర పరిస్థితుల లక్షణం కూడా కావొచ్చు. అందుకే ఈ చెమటలు ఎందుకు పడుతున్నాయో ఖచ్చితంగా తెలుసుకోవడానాకి డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. 

గుండెపోటు, ఆంజినా

ఛాతీ నొప్పి, విపరీతమైన చెమట, శ్వాస ఆడకపోవడం వంటివి గుండెపోటు లేదా ఆంజినా (ఒక రకమైన ఛాతీ నొప్పి) కు సంకేతాలు కావొచ్చు. ఇలాంటి సమయంలో వెంటనే హాస్పటల్ కు వెళ్లాలి. కొన్ని కొన్ని సార్లు గుండెపోటు ఛాతీ నొప్పి లేకుండా వస్తుంది. అయితే గుండెపోటుకు ముందు చల్లని చెమటలు పట్టడం ప్రధాన లక్షణం. వీటిలో ఏ ఒక్క లక్షణం కనిపించినా వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. 
 

click me!