కలబందను తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో ఎరుకేనా..?

By Mahesh RajamoniFirst Published Mar 21, 2023, 9:29 AM IST
Highlights

కలబంద ఒక సూపర్ ఫుడ్. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. దీన్ని మీ భోజనంలో చేర్చడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయిని ఆరోగ్య  నిపుణులు చెబుతున్నారు. 
 

కలబంద  మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే దీన్ని శతాబ్దాలుగా ఔషధ లక్షణాల కోసం ఉపయోగిస్తున్నారు. ఇది ఆఫ్రికాకు చెందిన సక్యులెంట్ మొక్క. కాలిన గాయాలు, గాయాలు, జీర్ణ సమస్యలు వంటి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సాంప్రదాయ వైద్యంలో ఈ కలబందను ఉపయోగిస్తున్నారు. ఏదేమైనా ఈ మధ్యకాలంలో కలబందను బాగా ఉపయోగిస్తున్నారు. ఈ కలబందను జుట్టు, చర్మ సంరక్షణకే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కానీ దీనిని మీ డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అవేంటంటే..

విటమిన్లు

కలబంద ఇంతలా ప్రజాదరణ పొందడానికి ముఖ్య కారణం దీనిలో ఉన్నఆరోగ్య ప్రయోజనాలు. కలబందలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఎన్నో విటమిన్లు, ఖనిజాలు దాగున్నాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇది కణాలకు నష్టం కలిగించే ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి సహాయపడతాయి.

జీర్ణక్రియకు సహాయపడుతుంది

కలబందలో ఎంజైమ్లు కూడా ఉంటాయి. ఇవి ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి, పోషక శోషణను మెరుగుపరచడానికి సహాయపడతాయి. దీనిలో శోథ నిరోధక లక్షణాలు కూడా ఉంటాయి. కలబందను తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, మలబద్ధకం, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

కలబందలో పాలిసాకరైడ్లు ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉండే సంక్లిష్ట చక్కెరలు. ఈ పాలిసాకరైడ్లు తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచేందుకు సహాయపడతాయి. ఇవి అంటువ్యాధులు, ఇతర వ్యాధులతో పోరాడటానికి చాలా చాలా అవసరం.

బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది

కలబందను తీసుకోవడం ద్వారా బరువు కూడా తగ్గుతారని నిపుణులు అంటున్నారు. కలబంద గుజ్జులో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, నిర్విషీకరణ లక్షణాలు ఉంటాయి. అంతేకాదు ఇది జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇది పరోక్షంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

కలబందను ఎలా తినాలి

స్మూతీ: మీరు ఉదయం తీసుకునే స్మూతీకి కలబంద రసాన్ని కలపండి.  రిఫ్రెషింగ్ డ్రింక్ కోసం మీరు కలబంద రసాన్ని ఇతర పండ్ల రసాలలో కూడా కలిపి తాగొచ్చు. దీనివల్ల ఈ డ్రింక్స్ లో పోషకాల విలువ పెరుగుతుంది. నిజానికి కలబందను సలాడ్లు, సూప్లు, ఇతర వంటకాల్లో కూడా కలపొచ్చు. 

అలోవెరా జెల్ : కలబంద జెల్ ను చక్కెర స్థానంలో సహజ స్వీటెనర్ గా కూడా ఉపయోగించొచ్చంటున్నారు నిపుణులు. దీనిని సాస్లు, డ్రెస్సింగ్, డిప్స్ లో చిక్కగా ఉండటానికి కూడా ఉపయోగించొచ్చు. కలబంద జెల్ ను మీరు ఉదయం తీసుకునే వోట్మీల్ లేదా పెరుగులో కూడా కలపొచ్చు.

click me!