
నేడు అత్యంత సాధారణంగా వచ్చే ప్రమాదకరమైన వ్యాధులలో క్యాన్సర్ ఒకటి. జీవనశైలిలో మార్పులు, తప్పుడు ఆహారపు అలవాట్లు క్యాన్సర్ కు ప్రధాన కారణాలు. అంతేకాదు గాలి, పర్యావరణ కాలుష్యం, పురుగుమందులను అధికంగా వాడటంతో పాటుగా వంశపారంపర్యంగా కూడా క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ ను చికిత్సతో నయం చేసుకోవచ్చు. కానీ కొన్ని రకాల ఆహారాలు కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.
ఉత్తమ క్యాన్సర్ నిరోధక ఆహారాలలో బలమైన యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇంపీరియల్ కాలేజ్ లండన్ లోని స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ తో చనిపోయే ప్రమాదం ఉందని కనుగొన్నారు. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
బెర్రీలు
బెర్రీలు ఉత్తమ క్యాన్సర్ నిరోధక ఆహారాలలో ఒకటి. సలాడ్లు తయారు చేయడానికి లేదా స్వీట్లు తయారు చేయడానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. బెర్రీలలో విటమిన్లు, ఖనిజాలు, డైటరీ ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. బెర్రీలలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో ఆంథోసైనిన్, మొక్కల వర్ణద్రవ్యాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. బెర్రీలలో ముఖ్యంగా ఎలీజిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది.
బ్రోకలీ
బ్రోకలీలో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఎ, ఫోలేట్, కాల్షియం, భాస్వరం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్ తో పాటుగా మరెన్నో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బ్రోకలీలో సల్ఫోరాఫేన్ ఉంటుంది. ఇది బలమైన క్యాన్సర్ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. బ్రోకలీ వంటి కూరగాయలను ఎక్కువగా తినడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు కనుగొన్నాయి.
ఆపిల్
రోజుకు ఒక ఆపిల్ పండును తింటే హాస్పటల్ కు దూరంగా ఉండొచ్చని నిపుణులు చెబుతుంటారు. ఆపిల్స్ లో ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ తో పోరాడటానికి సహాయపడతాయి. క్రమం తప్పకుండా యాపిల్స్ తినేవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ తో పాటుగా కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం తగ్గుతుంది.
మొలక్కాయ
టమోటాలు యాంటీ క్యాన్సర్ లక్షణాలను కలిగి ఉంటాయని పరిశోధనలు కనుగొన్నారు. ఈ పండులో లభించే సహజ సమ్మేళనాలు గ్లైకో ఆల్కలాయిడ్లు క్యాన్సర్ ను నివారించడానికి సహాయపడతాయి. టమోటాల్లో యాంటీ ఆక్సిడెంట్ లైకోపీన్ ఉంటుంది. ఇది ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తులు, కడుపు క్యాన్సర్ నుంచి రక్షించడానికి సహాయపడుతుందని నిరూపించబడింది.
పసుపు
పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది రేడియేషన్ థెరపీ, కెమోథెరపీ దుష్ప్రభావాలను తగ్గించడానికి సహాయపడుతుంది. పసుపులోని క్రియాశీల పదార్ధం కర్కుమిన్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే శోథ నిరోధక, యాంటీ ఆక్సిడెంట్, క్యాన్సర్ నిరోధక ప్రభావాలను కలిగి ఉంటుంది.