నీళ్లను ఎప్పుడు తాగాలి? ఎంత తాగాలో తెలుసా?

By Mahesh RajamoniFirst Published Mar 27, 2023, 1:34 PM IST
Highlights

శరీరానికి సరిపడా నీళ్లను తాగకపోవడం వల్ల స్టామినా తగ్గుతుంది. బాగా అలసిపోతారు. ముఖ్యంగా మూత్రపిండాల సమస్యలతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే రోజుకు సరిపడా నీటిని తాగాలని నిపుణులు చెబుతున్నారు. 

మన శరీరానికి నీరు చాలా చాలా అవసరం. ఎందుకంటే మన శరీరంలో నీరే ఎక్కువ భాగం ఉంటుంది. హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల మన బాడీలో ఉండే విషపదార్థాలు బయటకు పోతాయి. అలాగే శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. మూత్రపిండాలు, మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తొందరగా తగ్గిపోతాయి. అయితే కొంతమంది నీళ్లను అసలే తాగరు. తిన్నప్పుడో.. దాహం వేసినప్పుడో కొన్ని చుక్కలు తాగుతుంటారు. కానీ ఇలా తాగడం వల్ల స్టామినా తగ్గుతుంది. అలసట పెరుగుంది. మూత్రపిండాల సమస్యలతో పాటుగా ఇతర రోగాలు కూడా వస్తాయి. ముఖ్యంగా శరీరం డీహైడ్రేట్ అయ్యి ప్రాణాలు కూడా పోయే ఛాన్స్ ఉంది. అందుకే నీళ్లను బాగా తాగాలని ఆరోగ్య నిపుణులు తరచుగా చెప్తుంటారు. మీకు తెలుసా తగినంత నీటిని తాగడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్కిన్ తేమగా, అందంగా ఉంటుంది. మరి ఇందుకోసం రోజుకు ఎంత నీటిని తాగాలి?  తాగేటప్పుడు కూర్చోవాలా? లేదా నిలబడాలా? నీటిని ఎప్పుడు తాగాలి వంటి ప్రశ్నలకు సమాధానాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందేనంటున్నారు నిపుణులు. 

భోజనం తర్వాత నీళ్లను ఎప్పుడు తాగాలి?

భోజనం చేసిన వెంటనే నీళ్లను తాగితే కడుపు ఆమ్లాలు బలహీనపడతాయి. అంతేకాదు ఆహార జీర్ణక్రియకు ఆటంకం కూడా కలుగుతుందని చాలా మంది అంటుంటారు. ఇది పూర్తిగా నిరాధారమైనదని నిపుణులు అంటున్నారు. వాస్తవానికి భోజనం చేసిన తర్వాత నీటిని తాగడం వల్ల ఆహారం విచ్ఛిన్నం అవుతుంది. అలాగే సులువుగా జీర్ణం కూడా అవుతుంది. అందుకే భోజనం తర్వాత కొన్ని నీళ్లను తాగండి. మరీ ఎక్కువగా తాగేయకండి.

అయితే భోజనం తర్వాత నీళ్లను ఎక్కువగా తాగడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది ఉబ్బరం, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అందుకే ఈ సమస్యలను తగ్గించుకోవడానికి భోజనం తర్వాత నీటిని మితంగా తాగడం మంచిది. 

నిలబడి నీళ్లు తాగుతున్నారా?

కొంతమంది ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నిలబడి నీళ్లను తాగడం మంచిది కాదని సూచించడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇది మోకాళ్లపై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపదు. సరైన ఆర్ద్రీకరణను నిర్వహించడమే అత్యంత కీలకమైన అంశమని నిపుణులు బల్లగుద్ది చెబుతున్నారు. 

నిలబడి ఉన్నప్పుడు విండ్ పైప్ లోకి నీరు ప్రవేశించకుండా ఉండేందుకు నీటిని నెమ్మదిగా, జాగ్రత్తగా  తాగటం మంచిది. ఎందుకంటే ఇది ఎక్కిళ్ళు లేదా దగ్గుకు కారణమవుతుంది. అందుకే నిటారుగా నీరు తాగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

రోజుకు ఎన్ని లీటర్ల నీటిని తాగాలి?

సాధారణంగా ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు  2-3 లీటర్లు లేదా 8-10 గ్లాసుల నీటిని తాగాలని సిఫార్సు చేస్తున్నారు. అయితే వాతావరణ మార్పులు, శారీరక శ్రమ స్థాయిలను బట్టి ఇది మారొచ్చు. మూత్రపిండాలు, కాలేయం లేదా గుండె జబ్బులు వంటి కొన్ని అనారోగ్య సమస్యలున్న వారు డాక్టర్ లేదా డైటీషియన్ సూచించిన ప్రకారమే నీటిని తాగాలి. 

నీరు ఒక ముఖ్యమైన పోషకం. కాబట్టి దానిని సకాలంలో తీసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. ఒకేసారి ఎక్కువ మొత్తంలో నీటిని తాగడం వల్ల ఉబ్బరం వస్తుంది. అయితే క్రమం తప్పకుండా తాగకపోవడం నిర్జలీకరణానికి దారితీస్తుంది. అందుకే నీటిని సమయానుకూలంగా తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. 

click me!