
ఎన్నో మూలికలు, సుగంధ ద్రవ్యాల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఇవి మనల్ని ఎన్నో రోగాల నుంచి కాపాడుతాయి. వీటిలో శోథ నిరోధక లక్షణాలు ఉంటాయి. అంతేకాదు ఇవి క్యాన్సర్ తో పోరాడటానికి కూడా సహాయపడతాయి. పోషకాలు ఎక్కువగా ఉండే మసాలా దినుసులను మన రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఒక్కటేమిటీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ఇవి కేలరీల పరిమాణాన్ని తగ్గిస్తాయి. అలాగే వంటను రుచిగా చేస్తాయి. ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి మసాలా దినుసులను రోజూ తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
యాలకులు
యాలకులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగున్నాయి. యాలకులను ఎక్కువగా టీ, కాఫీ, పేస్ట్రీలు, కొన్ని రకాల ఆహారాలల్లో వేస్తుంటారు. యాలకులు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడతాయని పలు పరిశోధనల్లో తేలింది. యాలకులు హృదయ సంబంధ వ్యాధులు, తలనొప్పి, మూర్ఛ, కోలిక్, విరేచనాలు, వాంతులను తగ్గిస్తాయి. యాలకుల విత్తనాలలో ఉండే నూనెల్లో అనాల్జేసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీస్పాస్మోడిక్ లక్షణాలు ఉంటాయి.
లవంగం
లవంగాలు ఫుడ్ టేస్టీగా మారుస్తాయి. లవంగాల్లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. లవంగాలలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. పలు పరిశోధనల ప్రకారం.. లవంగాలలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధిస్తాయి.
పసుపు
పసుపులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీనిలో ఉండే కర్కుమిన్ ఎన్నో వ్యాధులను నయం చేస్తుంది. కర్కుమిన్ అద్భుతమైన శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది ఆక్సీకరణ నష్టాన్ని నివారించడానికి సహాయపడుతుంది. అంతేకాదు మన శరీరంలో సహజ యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్లను పెంచుతుంది. కర్కుమిన్ శక్తివంతమైన శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది.
దాల్చినచెక్క
దాల్చిన చెక్క మన ఆరోగ్యాన్ని ఎన్నో విధాలుగా మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా జీవక్రియను. దాల్చిన చెక్క మీ శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిను నియంత్రిస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దాల్చినచెక్కలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. ఆహార కోరికలను తగ్గించడానికి సహాయపడుతుంది.
మెంతులు
ఆయుర్వేదంలో మెంతులను ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా లిబిడో, మేల్ ఫెర్టిలిటీని పెంచడానికి వీటిని బాగా ఉపయోగిస్తారు. మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. మెంతులు టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది. మెంతుల్లో మొక్కల ప్రోటీన్ 4-హైడ్రాక్సీసోలూసిన్ ఉంటుంది. ఇది ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
జీలకర్ర
జీలకర్రను పోపులో పక్కాగా ఉపయోగిస్తారు. ఇది ఒత్తిడి, కొలెస్ట్రాల్, బరువు నిర్వహణకు బాగా ఉపయోగపడుతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పలు పరిశోధనల ప్రకారం.. జీలకర్ర యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది.