ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ కు వైసిపి అరాచక పాలన గురించి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని... ఆయన వ్యవహారశైలి చూస్తుంటే వైసిపికి కొమ్ముకాస్తున్నట్లు కనిపిస్తోందని మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ఆరోపించారు.
గుంటూరు: ప్రభుత్వ దుర్మార్గాలు, దౌర్జన్యాలు, అక్రమాలు, ఆకృత్యాలపై గవర్నర్ జోక్యం చేసుకోకపోవడం చూస్తుంటే వైసీపీ అరాచక పాలనకు ఆయన కొమ్ము కాస్తున్నట్లుగా ఉందని... రాష్ట్రంలో ఇంతజరుగుతుంటే రాజ్యాంగబద్ధుడైన వ్యక్తి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయకపోవడం ఏంటని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.
శుక్రవారం ఆయన మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పోలీసులు చట్టపరంగా విధులు నిర్వర్తించకుండా, ప్రభుత్వానికి ఊడిగం చేస్తూ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుంటే ప్రజలకు రక్షణ ఎక్కడినుంచి లభిస్తుందని యనమల వాపోయారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలకు, అప్రజాస్వామిక చర్యలన్నింటికీ ముఖ్యమంత్రే కారణమని, స్థానిక ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన మాటలే అందుకు నిదర్శనమన్నారు.
స్థానికపోరులో వైసీపీవారు గెలవకపోతే మంత్రులంతా నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి రాజీనామాలు సమర్పించాలనడం, ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరిస్తాననడం, మీరు చచ్చినా పర్లేదుగానీ ఎన్నికల్లో గెలిచితీరాలని చెప్పాక రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు ఎలా జరుగుతాయన్నారు. ఇక రెండో అంశానికి వస్తే ప్రతిపక్ష సభ్యులకు భద్రతను తగ్గించడం, టీడీపీలోని అతికీలకమైన నేతలను లక్ష్యంగా చేసుకొని వైసిపి దాడులకు పాల్పడుతోందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు లోబడే ఎన్నికలకు ముందు వారికి భద్రతను తగ్గించడం జరిగిందన్నారు.
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడం ద్వారా శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయన్నారు. స్వతహాగా ఫ్యాక్షనిస్ట్ అయిన వ్యక్తి ఫాసిస్టుగా మారి రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే, అది ఎంతవరకు బాగుపడుతుందో ప్రజలంతా ఆలోచించాలని యనమల సూచించారు. ఎన్నికల వేళ ప్రజాస్వామ్య విలువలను కాపాడటానికి టీడీపీ పోరాటం చేస్తోందన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అప్రజాస్వామిక చర్యలు, పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమవడం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోలీస్ వ్యవస్థ పనిచేయడం, ప్రతిపక్షాలను అణిచివేస్తున్న విధానాలపై చాలా స్పష్టంగా ఇప్పటికే 2-3పర్యాయాలు గవర్నర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.
read more రాజశేఖర్ రెడ్డి మరణానికి కారణమతడే... ఇకపై మీ ఇష్టం: వైసిపి ఎమ్మెల్యేలకు వర్ల సూచన
ప్రభుత్వ పాలన సరిగాలేనప్పుడు గవర్నర్ జోక్యం చేసుకోవాలని, రాష్ట్ర పాలనా వ్యవస్థలకు అధిపతిగా ఉన్న ఆయన ఎందుకు స్పందించడం లేదని రామకృష్ణుడు నిలదీశారు. జరుగుతున్న దారుణాలన్నింటికీ చాలా స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపే అవకాశమున్నాకూడా ఆయన మౌనం వహించడం ఏంటన్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా కూడా రాజ్యాంగం ప్రకారం గవర్నర్ కేంద్రానికి ఫిర్యాదుచేయాలి. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, ఆకృత్యాలు, దారుణాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయనపై ఉందని రాజ్యాంగంలో పొందుపరిచారు. ప్రతిపక్షం ఇచ్చిన ఫిర్యాదులపై ఇప్పటికైనా సరే ఆయన బాధ్యతగా వ్యవహరించాలని కోరుకుంటున్నామన్నారు.
పోలీసులకు, డీజీపీకి ఎన్ని పిటిషన్లు ఇచ్చినా పోలీస్ వ్యవస్థ స్పందించకపోగా, ఫిర్యాదులు చేసినవారిపైనే తిరిగి కేసులు పెడుతూ, వారిపై కక్షసాధింపులకు పాల్పడుతున్నారని యనమల తెలిపారు. ప్రజలను కాపాడాల్సిన పోలీసులు మాట్లాడే స్థితి, చర్యలు తీసుకునే పరిస్థితులు రాష్ట్రంలో లేవన్నారు. ఒకవేళ చర్యలు తీసుకుంటే అవిపూర్తిగా ఏకపక్షంగా ప్రభుత్వ ఆదేశాలప్రకారమే జరుగుతున్నాయన్నారు. పోలీస్ వ్యవస్థ అలా తయారవడంతో కోర్టులను ఆశ్రయించామని, ఒకటి రెండు అంశాల్లో సానుకూలంగానే తీర్పులు రావడం జరిగిందన్నారు.
ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యవస్థలతో ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు, రాజ్యాంగానికి విలువలేనప్పుడు, చట్టానికి అతీతంగా అధికార వ్యవస్థలు పనిచేస్తున్నప్పుడు అంతిమంగా స్పందించాల్సింది న్యాయవ్యవస్థేనని మాజీమంత్రి తేల్చిచెప్పారు. ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా బెదిరించడం, వేయడానికి వెళ్లినవారి చేతుల్లోని నామపత్రాలు లాక్కోవడం, వాటిని చించేయడం, అభ్యర్థులను కొట్టి, బెదిరింపులకు పాల్పడిన వేళ, పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వానికి ఊడిగంచేస్తున్న వేళ, న్యాయస్థానాలే స్వచ్ఛందంగా స్పందించాల్సి ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత గవర్నర్ కు, కోర్టులకు అంతిమంగా ప్రజలకే ఉందన్నారు.
రాష్ట్రంలో ఒకవైపు అమరావతి విధ్వంసం, మరోవైపు అభివృద్ధి విఘాతచర్యలతో, అరాచక పాలన సాగుతుంటే, కోర్టులే రాష్ట్రం బీహార్ ను మించిపోయిందని వ్యాఖ్యానించడం జరిగిందని, ఏపీని బీహార్ తో పోల్చడంతో ఆ రాష్ట్రవాసులు తమను అవమానిస్తున్నారన్నట్లుగా భావిస్తున్నారని యనమల తెలిపారు. రాష్ట్రంలో పాలనావ్యవస్థలు గాడితప్పిన వేళ ప్రజలకు ఓటు అనే అవకాశం వచ్చిందని, దాన్ని ఉపయోగించడం ద్వారా వారంతా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని, ఓటుని సద్వినియోగం చేసుకొని, రాజ్యాంగాన్ని పతనం చేస్తున్న సర్కారుకి తగినవిధంగా గుణపాఠం చెప్పాలని టీడీపీ సీనియర్ నేత పిలుపునిచ్చారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన చక్కని అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందని, కానీ ఎన్నికల తర్వాత కూడా గెలిచిన వారిని శిక్షించవచ్చనే నిబంధన చేర్చడం ద్వారా, గిట్టనివారిపై ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతోందన్నారు. రిప్రజంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ చూస్తే ఎన్నికల షెడ్యూల్, కోడ్ అమల్లోకివచ్చాక, ఎన్నికలుజరిగి ఫలితాలు వెలువడేవరకు, ఇష్టానుసారం ప్రవర్తించడానికి ఏప్రభుత్వానికి కూడా అధికారం ఉండదన్నారు. ఇది తెలిసీకూడా ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియలో, ఎలా జోక్యం చేసుకుంటుందన్నారు.
read more తమ్ముడి రాజీనామాపై కేఈ కృష్ణమూర్తి స్పందన... ఎన్నికల బహిష్కరణ నిర్ణయం
ఎన్నికలు పూర్తయ్యాక అభ్యర్థులపై చర్యలుతీసుకునే అధికారం ప్రభుత్వానికి లేనేలేదని, ఏవైనా అభ్యంతరాలుంటే, తగిన ఆధారాలతో ఎన్నికలకమిషన్ ను, కోర్టులను ఆశ్రయించడం తప్ప, చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉండబోదన్నారు. తామే చర్యలు తీసుకుంటామని చెప్పడంద్వారా, ప్రభుత్వం కావాలనే అభ్యర్థులపై బెదిరింపులకు పాల్పడుతోందన్నారు. ఎన్నికల నిబంధనావళికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తించినా, ఏవైనా సంఘటనలు జరిగినా స్పందించాల్సింది ఎన్నికల సంఘం మాత్రమేనని, ఎన్నికలవిధుల్లోగానీ, ఎన్నికల నియమావళికి సంబంధించిన ఇతరేతర అంశాల్లోగానీ జోక్యం చేసుకునే అధికారం, ఏ ప్రభుత్వానికి ఉండబోదని యనమల తేల్చిచెప్పారు.
ఎన్నికలు జరుగుతున్నవేళగానీ, పూర్తయ్యాక గానీ ఎవరిపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్, ప్రజలద్వారా, ప్రజలచేత గెలిపించబడిన వారిపై చర్యలు తీసుకొనేలా ఉందని, అది చట్టప్రకారం చెల్లదని, కోర్టులు కూడా తిరస్కరిస్తాయని, ఆబిల్లు మండలి ముందుకొచ్చినప్పుడు కచ్చితంగా తిరస్కరిస్తామని యనమల స్పష్టంచేశారు.
పార్టీలు మారేవారు వారి స్వార్థంకోసం వెళుతున్నారు తప్ప, వారి ప్రభావం పార్టీలపై ఉండదని, ఎవరుపోయినా, ఉన్నా... దాని ప్రభావం టీడీపీపై ఉండబోదని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా యనమల అభిప్రాయపడ్డారు. గతంలో నాయకులు చెబితే ఓటర్లు వినేవారని, ఇప్పుడున్న పరిస్థితులు అందుకూ పూర్తి విరుద్ధంగా తయారయ్యాయని, ప్రస్తుతకాలంలో ఓటర్లే నాయకులుగా మారిపోయారన్నారు. ఎన్నికల్లో ఏపార్టీ గుర్తుపై పోటీచేసి గెలిచారో, అలా గెలిచినవారంతా ఆపార్టీవారిగానే పరిగణింపబడతారని, అసెంబ్లీ రికార్డుల్లో కూడా ఆయా పార్టీ అభ్యర్థులగానే పేర్కొనబడతారన్నారు.