జగన్ ప్రభుత్వానికి ముందుంది ముసళ్ల పండగ... త్వరలోనే 'రంగు'పడుద్ది: వర్ల రామయ్య

By Arun Kumar PFirst Published Dec 19, 2019, 8:16 PM IST
Highlights

టిడిపి పొలిట్‌‌బ్యూరో సభ్యులు వరల రామయ్య జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో తప్పుడు సమాచారాన్ని అందించి సభ్యులనే కాదు యావత్ రాష్ట్ర ప్రజలను ఈ  ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు.  

గుంటూరు: రాష్ట్ర మంత్రులకు, అధికార యంత్రాంగానికి మధ్య సమన్వయ లోపముందని టీడీపీ సీనియర్‌నేత, పొలిట్‌బ్యూరోసభ్యులు వర్ల రామయ్య తెలిపారు. మంత్రులకు పాలనపై పట్టులేకపోతే అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారని శాసనమండలిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిన సమాధానమే అందుకు రుజువని పేర్కొన్నారు. 

గురువారం ఆయన ఆత్మకూరులోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ కార్యాలయాలకు అధికార  పార్టీ రంగులేయాలని పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ 28ఆగస్ట్‌ 2019న ఒక లెటర్‌జారీ చేశారని (లెటర్‌ నెం-751/సీపీఆర్‌ఎన్‌ ఆర్‌డీఎస్‌ 2019) రామయ్య పేర్కొన్నారు. ఆ లెటర్‌ని అన్నిజిల్లాల కలెక్టర్లకు ఏ విధంగా రంగులు వేయించాలో కూడా సూచించారని తెలిపారు.

దాంతో ప్రభుత్వ కార్యాలయాలన్నింటి మీద వైసీపీరంగు పడిందని ఇదే అంశంపై మండలిలో టీడీపీ సభ్యులు చిక్కాల రామచంద్రరావు ప్రశ్నిస్తే పంచాయతీరాజ్‌ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాంటి ఆదేశాలివ్వలేదని చెప్పడం జరిగిందన్నారు. మండలిలో మంత్రి అబద్ధాలాడారో, కమిషనర్‌ తనకు తానుగా తప్పుచేశారో స్పష్టంచేయాలని వర్ల కోరారు. 

read more  రాజధానిపై జగన్ ప్రకటన... ప్రజాభిప్రాయం ఎలా వుందంటే: అవంతి శ్రీనివాస్

ముఖ్యమంత్రికి, మంత్రికి తెలియకుండా తనకుతానుగా ఒక అధికారి ఆదేశాలిచ్చాడంటే ప్రజలు నమ్మరన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రంగులేయడానికే రూ.1300కోట్లు ఖర్చయినట్లు ప్రజలు అనుకుంటున్నారని... ఈరంగుల బాగోతం వెనకున్న గజదొంగెవరో, రూ.1300 కోట్లు ఎటువెళ్లాయో సమాధానం చెప్పాలని రామయ్య డిమాండ్‌ చేశారు. 

మంత్రిని గుడ్డివాడిని చేసి  ఆదేశాలిచ్చే ధైర్యం కమిషనర్‌కు ఉండదని, ఒకవేళ అధికారే తప్పుచేసిఉంటే అతనిపై చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి పెద్దిరెడ్డే ఆదేశాలిచ్చి ఉంటే మండలిలో పచ్చిఅబద్ధాలు చెప్పినందుకు ఆయన్ని తక్షణమే సస్పెండ్‌ చేయాలని రామయ్య డిమాండ్‌ చేశారు. నైతిక విలువలకు తానే నమూనా అన్నట్లుగా మాట్లాడే జగన్ తన కేబినెట్‌లోని మంత్రిని బర్తరఫ్‌ చేయాలన్నారు. 

మండలిలో అబద్ధం చెప్పిన మంత్రిపై ప్రివిలేజ్‌ మోషన్‌ ఇచ్చే అంశాన్ని కూడా టీడీపీ పరిశీలిస్తోందన్నారు.  ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నీలం సాహ్నికి కూడా ఫిర్యాదు చేయనున్నట్లు రామయ్య తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న రంగులద్దే కార్యక్రమం కోర్టులో  నడుస్తోందని... జగన్‌ ప్రభుత్వానికి ముసళ్ల పండగ ముందుందన్నారు.

read more  కనెక్ట్‌ టు ఆంధ్రా సక్సెస్... చేయూతకు కార్పోరేట్ సంస్థల ఆసక్తి

 రాష్ట్ర సర్కారుకి  రంగుపడేలా న్యాయస్థానం చర్యలుంటాయని రామయ్య చెప్పుకొచ్చారు. పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజాశంకర్‌ ఇచ్చిన ఉత్తర్వుల కాపీని, ప్రభుత్వ భవనాలకు రంగులేసిన ఫొటోలను వర్లరామయ్య విలేరుల సమావేశంలో ప్రదర్శించారు.
 

  


 

click me!