ఆంధ్ర ప్రదేశ్ కు మూడు రాజధానులు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం జగన్ చేసిన ప్రకటనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు జనసేన పీఏసి మెంబర్ బొనబోయిన శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతిపై అసెంబ్లీలో చేసిన ప్రకటనను బట్టి రాజధానిపై ఏర్పాటుచేసిన నిపుణులు కమిటీ ఉత్తిత్తి కమిటేనని అర్థమవుతోందని జనసేన నాయకులు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ శంకుస్థాపన చేశారని అమరావతి అంటే మీకు ఇష్టం లేదా లేకపోతే చంద్రబాబు నాయుడు మీద కోపంతో దీన్ని రాజధానిగా వ్యతిరేకిస్తున్నారా అని ప్రశ్నించారు. అసలు అమరావతి ఎందుకు తరలించాలని చూస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇలా ఇష్టం వచ్చినట్లు చేస్తే భవిష్యత్ లో కూడా ప్రభుత్వం మారినప్పుడల్లా రాజదానిని మార్చాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. అమరావతి నుండి రాజదాని మార్చితే భూములు ఇచ్చిన రైతులు పరిస్థితి, ఆ భూములు పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రైతులకు భూములను ఎలా తిరిగి ఇస్తారు అని ప్రశ్నించారు.
అన్ని ప్రాంతాల అభివృద్ధికి వైసిపి పార్టీ కట్టుబడి ఉందని.. అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉండాలని జగన్ కూడా ప్రతిపక్షంలో వుండగా ఆమోదించారని గుర్తుచేశారు.
రాజధానిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగితే వారిపై చర్యలు తీసుకోవాలి కానీ ఎవరిపైనో కోపంతో రాజధానిపై గందరగోళం సృష్టించడం భావ్యం కాదన్నారు.
read more రాజధాని అంటే చంద్రబాబు చెప్పినట్లు సంపదసృష్టే...కానీ అలా కాదు: అంబటి సెటైర్లు
జనసేన పార్టీ తరపున తాము రేపు(శుక్రవారం) రాజధాని కోసం భూములిచ్చిన రైతులను కలవడం జరుగుతుందని శ్రీనివాస్ ప్రకటించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాజదాని కోసం భూములు ఇచ్చిన చిన్న, సన్నకారు రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ చర్యలు రాజధాని రైతులను రోడ్డునపడేసేలా ఉన్నాయన్నారు.
జగన్ ముఖ్యమంత్రి కాగానే కేవలం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై మాత్రం కక్షసాధిస్తారని ఇంతవరకు బావించామమని... కానీ బిసి, ఎస్సీ, ఎస్టీ రైతులపై కూడా కక్షసాధిస్తున్నారని అనుకోలేదన్నారు. జనసేన తరపున రాజధాని రైతులకు, ప్రజలకు అండగా ఉంటామని... అక్కడున్న అన్ని వర్గాలకు న్యాయం జరిగే వరకు పోరాడమని అన్నారు.
ప్రస్తుతానికి తాము రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నట్లు...అతిత్వరలో పవన్ కళ్యాణ్ కూడా ఆ ప్రాంతంలో పర్యటిస్తారని వెల్లడించారు. సీఎం జగన్ ప్రకటించిన మూడు రాజధానుల నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేయడానికి అనుకూలమని తెలిపారు.
read more రాజధానిని మారుస్తామంటే కేంద్రం చూస్తూ ఊరుకోదు: సుజనా హెచ్చరిక
రాజధానిపై నిపుణులు కమిటీ రిపోర్ట్ వచ్చిన తరువాత ప్రకటన చేసివుంటే బాగుండేదన్నారు. రాజదాని రైతులు చేపట్టే దీక్షలను తాము నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో మంగళగిరి పార్టీ కార్యాలయం నుండి బయలుదేరి వెళతామన్నారు.
అనంతరం పోతినవెంకట మహేష్ మాట్లాడుతూ... మూడు రాజదానుల నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు చెందుతున్నారన్నారు. రాజదాని తరలింపు విషయంలో జగన్మోహన్ రెడ్డి, విజయ్ సాయి రెడ్డి ల ఆర్ధిక లబ్ది ఉందని ఆరోపించారు. రాజధాని రైతుల భవిష్యత్, వారి ఆశలు కుప్పకూలే విదంగా జగన్ ఆలోచనలు ఉన్నాయని మహేష్ పేర్కొన్నారు.