జగన్ గారూ... ఆ మహిళా శక్తిని ఆపడం మీ తరం కాదు: వర్ల రామయ్య

By Arun Kumar P  |  First Published Jan 4, 2020, 2:52 PM IST

రాజధాని కోసం నిరసన బాట పట్టి అమరావతి మహిళలపై పోలీసులు జులుం ప్రదర్శించడాన్ని టిడిపి సీనియర్ నాయకులు వర్ల రామయ్య ఖండించారు. మహిళలపై ఇంత అమానుషంగా వ్యవహరించడం సిగ్గుచేటని మండిపడ్డారు.  


అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ కు మూడు రాజధానులు ఏర్పాటుచేయాలన్న సీఎం జగన్ నిర్ణయం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రస్తుతమున్న అమరావతి నుండి రాజధానిని తరలించకూడదని ఆ ప్రాంత ప్రజలు ఉద్యమానికి దిగారు.ఈ  క్రమంలోనే శుక్రవారం మందడంలో నిరసనకు దిగిన రాజధాని మహిళలపై పోలీసులు  దురుసుగా ప్రవర్తించడం మరింత దుమారం రేపింది. 

ఇలా మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై టిడిపి సీనియర్ నాయకులు, పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఘాటుగా స్పందించారు. ''ముఖ్యమంత్రి గారు! అరచేతినడ్డుపెట్టి సూర్యకాంతినాప లేరు, పోలీసులనుపయోగించి ఉద్యమాలనాపలేరు. నిన్న మందడం మహిళా ఉద్యమకారులపై మీ ప్రభుత్వ పాశవికదాడి అమానుషం. ఉద్యమకారులను రెచ్చగొట్టారు. ఆవేశం కట్టలు త్రెంచుకుంది.ఆ మహిళా శక్తిని ఆపశక్యం కాదు. ఇకనైనా అమరావతి తరలింపు ఆపండి. హీనచరితులవకండి'' అని సీఎం జగన్ కు వర్ల రామయ్య చురకలు అంటించారు.  

Latest Videos

undefined

అంతకుముందు కూడా ''ముఖ్యమంత్రి గారు! అమరావతిని తరలించాలన్న మీ దురాలోచన మానుకోండి. అమరావతి రాజధానిగా సముచితమని విజ్ఞులందరు చెపుతున్నారు. పెద్దలమాట పెడచెవిన పెట్టి భ్రష్ట చెరితులు కాకండి. ఈ పాపం తరతరాలకు మిమ్ము వెంటాడుతోంది. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టంది సార్. సదాలోచన చెయ్యండి'' అని సూచించారు. 

రాష్ట్రప్రభుత్వం పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిందని... రాష్ట్రాన్ని మూడుముక్కలు చేయడంకోసం అమరావతి ప్రజల్ని రోడ్డునపడేసిందని టీడీపీ సీనియర్‌నేత,  పొలిట్‌బ్యూరో సభ్యులు వర్లరామయ్య మండిపడ్డారు. రాజధాని విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం రాష్ట్రప్రజల ఆశలపై నీళ్లుచల్లిందని అన్నారు.

ప్రజల భయాందోళనలు తొలగించాల్సిన ప్రభుత్వమే ప్రజల్లో గందరగోళం సృష్టించిందన్నారు. అమరావతి నిర్మాణంపై స్పష్టత కోసం జీ.ఎన్‌.రావు కమిటీవేసిన ప్రభుత్వం దానికి కొనసాగింపుగా నియమించిన బోస్టన్‌ కన్సల్టింగ్‌గ్రూప్‌కు (బీ.సీ.జీ) ఉన్న విశ్వసనీయత,  అనుభవం ఏమిటో స్పష్టంచేయాల్సిన బాధ్యత జగన్‌పైనే ఉందన్నారు. 

read more  అమరావతిలో జగన్ నివసిస్తున్న ఇల్లు ఎవరిదంటే: వర్ల రామయ్య సంచలనం

గతంలో ఎన్ని దేశ, రాష్ట్ర రాజధానుల మార్పు, తరలింపునకు సంబంధించి ఈ గ్రూప్‌ పనిచేసందో...వారికి ఉన్న నైపుణ్యత ఏమిటో ప్రజలకు తెలియచేయాలని రామయ్య డిమాండ్‌ చేశారు.  బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ అనేది కంపెనీస్‌ అడ్వైజింగ్‌ ఏజెన్సీ మాత్రమేనని ఆ సంస్థకు రాజధానులు, వాటితరలింపు, మార్పు గురించి ఏవిధమైన అనుభవం లేనేలేదని తేల్చిచెప్పారు. 

పరిశ్రమలు, కంపెనీల ఏర్పాటు, వాటి తరలింపు వ్యవహారాలు మాత్రమే ఈగ్రూప్‌కు తెలుసునన్నారు. బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ ముఖ్యమంత్రికి ఎలా తెలుసు? ముఖ్యమంత్రి జగన్‌ ఈ గ్రూప్‌తో ఎప్పుడు ఒప్పందం చేసుకున్నారో, దానికి సంబంధించిన జీవో ఏమిటో, ఆ గ్రూప్‌కి ఎంతసొమ్ము ఇవ్వబోతున్నారు, అసలు ఈగ్రూప్‌ గురించి సీఎంకు ఎవరు చెప్పారో, ఆ సంస్థ గురించి ఆయనకెలా తెలుసో ప్రజలకు  స్పష్టం చేయాలని రామయ్య  డిమాండ్‌ చేశారు. 

 ఆ గ్రూప్‌ జగన్‌ కంపెనీలకు, ఆయన బంధుమిత్రుల కంపెనీలకు పనిచేసిందా అని వర్ల ప్రశ్నించారు. పోర్చుగీస్‌ పోలీసులు 2017లో బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌పై రైడ్‌ చేశారని, ఎఫ్‌బీఐ (ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌) నిఘా ఈ గ్రూప్‌పై ఉందని, ఈ సంస్థ 100 మిలియన్‌ పౌండ్ల స్కామ్‌కు పాల్పడినట్లు ఆధారాలున్నాయని రామయ్య పేర్కొన్నారు.  ఇలాంటి గ్రూప్‌కి 5కోట్ల ప్రజల భవిష్యత్‌ని అప్పగించడం వెనుక ఎవరున్నారో ముఖ్యమంత్రి చెప్పాలన్నా రు. 

బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ భట్టాచార్య విజయసాయిరెడ్డి అల్లుడైన రోహిత్‌రెడ్డికి మంచి మిత్రుడని తెలిపారు. రోహిత్‌రెడ్డి అరబిందో ఫార్మా కంపెనీ యజమాని అని రామయ్య తెలిపారు.ఈ ఫార్మా కంపెనీకి విశాఖ-విజయనగరం మధ్యన వేలాది ఎకరాలున్నాయని , ఆభూముల్లోనే రాజధాని ఉండేలా బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ నివేదిక ఇవ్వబోతోందన్నారు. తమ భూములను అభివృద్ధి చేసుకోవాలన్న దురుద్దేశంతో విజయసాయిరెడ్డే ఈ బోస్టన్‌ గ్రూప్‌ని తెరపైకి తీసుకొచ్చాడని రామయ్య వివరించారు. 

విశాఖపట్నం ఇక నుంచి విజయసాయి పట్నంగా పిలువబడుతుందని చెప్తున్న వ్యక్తి, తన అల్లుడి కంపెనీ  భూముల కోసం రాష్ట్రప్రజల భవిష్యత్‌ని పణంగా పెట్టాడన్నారు. బీ.సీ.జీ జనవరి 3న ఇచ్చే నివేదిక ఎలా ఉంటుందో ఇప్పటికే రాష్ట్రప్రజలకు అర్థమైందన్నారు. బోస్టన్‌ గ్రూప్‌ గురించి తెలిశాక మంత్రులంతా నోళ్లు వెళ్లబెట్టారని, నిన్నటి కేబినెట్‌లో చెప్పే వరకు దీని గురించి వారికి కూడా తెలియదన్నారు. బోస్టన్‌ గ్రూప్‌ నియామకానికి సంబంధించిన జీవోను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదన్నారు. 

read more  రాజధానిపై ప్రభుత్వ ప్రకటన ఇప్పుడే ఎందుకంటే...: వర్ల రామయ్య

జీ.ఎన్‌. రావు గ్రూప్‌వన్‌ అధికారని, ఆయన బృందంలో పనిచేసిన కే.టీ.రవీంద్రన్‌ గతంలో సీఆర్డీఏలో పనిచేశాడని, ఆ బృందమంతా కలిసి ఎక్కడ పర్యటించి, ఎంతమంది ప్రజలు, ప్రజాసంఘాలు, నేతల అభిప్రాయాలు సేకరించి, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందో ఆ వివరాలన్నీ బయటపెట్టాలన్నారు. తానిచ్చిన నివేదికను తన కుటుంబసభ్యులు కూడా ఒప్పుకోరన్న విషయాన్ని జీ.ఎన్‌.రావు గ్రహించాలన్నారు. 

దొంగ రిపోర్టులిచ్చి, ప్రభుత్వానికి డూడూ బసవన్నలా తలూపుతూ, ఇంతమంది ప్రజల్ని మన:క్షోభకు గురిచేసిన రావు ఇప్పటికైనా తన తప్పు తెలుసుకొని రాష్ట్రప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు.  ఏవిధమైన అనుభవం, మంచిపేరులేని జీ.ఎన్‌.రావు జగన్‌ దృష్టిలో ఎలాపడ్డాడో తెలియడం లేదన్నారు. జీ.ఎన్‌.రావు తన నివేదికను నాలుగ్గోడల  మధ్యన, ఏసీ గదుల్లో కూర్చొని తయారుచేశాడని, ఆయనకు ప్రజల అభిప్రాయాలు, బాధలు ఎలా తెలుస్తాయని వర్ల నిలదీశారు. 

జీ.ఎన్‌.రావు కమిటీ ఉనికి గురించి ఎవరికీ తెలియదన్నారు. బోస్టన్‌ గ్రూప్‌ ఇవ్వబోయే నివేదిక కూడా జీ.ఎన్‌.రావు కమిటీ నివేదికలానే ఉంటుందన్నారు. తమకు అనుకూలంగా రిపోర్ట్‌ తయారుచేయించడం కోసం విజయసాయి బోస్టన్‌ గ్రూప్‌ని తెరపైకి తీసుకొచ్చాడని, విశాఖకు రాజధానిని తరలించడం కోసం ఆయనెంత కష్టపడుతున్నాడో ప్రజలంతా  తెలుసుకోవాలని వర్ల రామయ్య సూచించారు. 


 

click me!