గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం దొండపాడులో ఓ రైతు గుండెపోటుతో మరణించాడు. రాజధాని అమరావతి నుంచి తరలిపోతుందనే మనోవేదనతోనే అతను మరణించాడని గ్రామప్రజలు అంటున్నారు.
అమరావతి: అమరావతి నుంచి రాజధాని తరలిపోతుందని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ రైతు గుండెపోటుతో మరణించాడు. రాజధాని అమరావతి నుంచి తరలిపోతుందని కొమ్మినేని మల్లికార్జున రావు అనే రైతు మనోవైదనకు గురయ్యాడని గ్రామప్రజలు అంటున్నారు.
రాజధానిపై ప్రభుత్వం చేస్తున్న అస్పష్ట ప్రకటనలతో కొన్ని రోజులుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం దొండపాడు గ్రామానికి చెందిన మల్లికార్జున రావు కలత చెందాడని చెబుతున్నారు. శనివారం మృతి చెందిన మల్లికార్జున రావుకు తుళ్లూరులో రైతులు, మహిళలు సంతాపం ప్రకటించి, మౌనం పాటించారు.
ఇదిలావుంటే, మందడంలో శనివారం ఉదయం నుంచి బంద్ వాతావరణంనెలకొంది. మహిళలపై దౌర్జన్యానికి నిరసనగా ఉదయమే రైతులు రహదారిపైకి వచ్చారు. పోలీసులకు గ్రామస్థులు సహాయ నిరాకరణ చేయాలని నిర్ణయించుకున్నారు. తమ గ్రామంలో మంచినీళ్లు సహా పోలీసులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించరాదని నిర్ణయం తీసుకున్నారు.
తమ దుకాణాల ముందు కూర్చొటానికి కూడా వీల్లేదని రైతులు పోలీసులకు స్పష్టం చేశారు. పోలీసు వాహనాలను అడ్డుకుని తమ గ్రామం మీదుగా వెళ్ళటానికి వీల్లేదని వెనక్కి పంపించారు. పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దుకాణాలు తెరవనీయకుండా రైతులు సంపూర్ణ బంద్ పాటిస్తున్నారు.