దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమనే వాళ్లే వాళ్లంతా...: అచ్చెన్నాయుడు

By Arun Kumar P  |  First Published Feb 17, 2020, 7:23 PM IST

ఏపి మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై ఐటీ దాడులు జరిగినట్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ మంత్రులు, నాయకులు తప్పుడు ప్రచారం చేయడాన్ని కింజారపు అచ్చెన్నాయుడు తప్పుబట్టాడు. 


గుంటూరు: వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపులతో ప్రతిపక్షాన్ని దెబ్బతీయటం... కల్లబొల్లి మాటలతో, తప్పుడు సమాచారంతో ప్రజలను మభ్యపెట్టడమనే రెండు అంశాల ప్రాతిపదికనే రాష్ట్రంలో నయవంచక పాలన సాగిస్తోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 

సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతటి నయవంచక పాలన ఎన్నడూ చూడలేదని ప్రజలు వాపోతున్నారన్నారు.  టీడీపీ స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీకి అండగా ఉన్న బడుగు, బలహీన వర్గాలకు రాజశేఖర్ రెడ్డి తీరని అన్యాయం చేస్తే జగన్మోహన్ రెడ్డి వారిపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాడని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. 

Latest Videos

ఎన్నికల వేళ బిసిలకు న్యాయం చేస్తానని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చాక ఆయా వర్గాలపై కపట ప్రేమ చూపుతున్నాడన్నారు.  బలహీన వర్గాల దుస్థితి గురించి ప్రభుత్వం వారిపై చూపుతున్న వివక్షను గురించి ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన నేరానికి ఒక వ్యక్తిని ఉగ్రవాది మాదిరి అరెస్టు చేయటం జరిగిందన్నారు. బిసి కార్పొరేషన్ నిధులను అమ్మ ఒడి పథకానికి ఎలా మళ్లిస్తారని ప్రశ్నించినందుకు సదరు వ్యక్తిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి పోలీసులు అతి దారుణంగా ప్రవర్తించారని మాజీ మంత్రి తెలిపారు. 

రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు జగన్మోహన్ రెడ్డి ఈ 8 నెలల్లో ఏం చేశాడో సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో నుంచి ఒక్క రూపాయి కూడా  ఆయా వర్గాలకు వెచ్చించలేదన్నారు.  అమ్మ ఒడి పథకానికి నిధులు కేటాయించడం కోసం ఎస్సి, ఎస్టి, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల నిధులు మళ్లించడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనం కాదా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. 

read more  

జగన్ కు బీసీలపై విశ్వాసం, నమ్మకం, ప్రేమ ఉంటే వారికి కేటాయించిన నిధులను ఇతర పథకాలకు మళ్లించడని మాజీ మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం బీసీ బాలికలకు సైకిళ్లు పంపిణీ చేయాలని భావిస్తే జగన్ వాటిని నిరుపయోగంగా మార్చారన్నారు. చంద్రబాబు ఆదరణ పథకం తీసుకొచ్చి బీసీలను ఆర్థికంగా ఆదుకోవడానికి కృషి చేస్తే వైఎస్ వచ్చాక ఆ పథకాన్ని అటకెక్కించాడన్నారు. గత ప్రభుత్వం ఆదరణ -2 కింద బీసీలకు పంపిణీ చేసిన వివిధ రకాల పనిముట్లను ఆయా వర్గాలకు అందించడానికి కూడా జగన్ కి మనసు రాకపోవడం విచారకరమన్నారు. 

వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తూతూ మంత్రంగా పథకాలు ప్రారంభించడం,  వెయ్యి మంది లబ్ధిదారులుంటే వందమందికి నిధులివ్వడం, గొప్ప పథకాలు అమలు చేస్తున్నామని డబ్బాలు కొట్టుకోవడమే పనిగా పెట్టుకుందన్నారు . ధాన్యం రైతులకు రూ. 2 వేల కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం పట్టించుకోడంలేదన్నారు. అమాయకులపై కేసులు పెట్టడం తప్ప వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏం ఒరగబెట్టలేదన్నారు. 

నీచాతినీచమైన, అన్యాయమైన రాతలు రాస్తున్న సాక్షి పత్రిక తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని... అవినీతి పునాదులపై నిర్మితమైన సాక్షి రాతలు చూస్తుంటే అసహ్యం వేస్తోందన్నారు. ఐటీ దాడులను తప్పుదోవ పట్టించేలా పంచనామా నివేదిక వచ్చే వరకూ ఆగకుండా రాష్ట్ర మంత్రులంతా మూకుమ్మడిగా దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్టుగా ప్రవర్తించారని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. 

చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో రూ. 2 వేల కోట్లు దొరికాయంటే చంద్రబాబు ఇంట్లో ఇంకెన్ని వేల కోట్లు ఉంటాయోనని పెడార్ధాలు తీస్తూ వెకిలితనంతో ప్రవర్తించారన్నారు. మంత్రి బొత్స తానే స్వయంగా లెక్కపెట్టి రూ. 2 వేల కోట్లు ఇచ్చినట్టుగా మోతాదుకు మించి ప్రవర్తించారన్నారు. ఐటీ దాడులను అడ్డం పెట్టుకుని సాక్షి మీడియా, రాష్ట్ర మంత్రులు నిన్నటి వరకూ ఇష్టానుసారం ప్రవర్తించారన్నారు. ఐటీ శాఖ పంచనామా బయటపడినా ....దాన్ని పట్టించుకోకుండా జరిగిన పొరపాటు తెలుసుకోకుండా మంత్రి బొత్స మేమెప్పుడన్నాం ...రెండు వేల కోట్లని మేమెప్పుడు చెప్పామంటూ బుకాయించడం సిగ్గుచేటన్నారు. 

read more  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొత్తు వారితోనే...: ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ రెడ్డి

ఎదుటి వ్యక్తులను విమర్శించే ముందు వాస్తవాలు తెలుసుకోకుండా, అపరిపక్వతతో జగన్ మెప్పుకోసం ప్రవర్తించి రాష్ట్ర మంత్రివర్గం మొత్తం అభాసుపాలయ్యింది. అక్రమాస్తుల కేసులో జగన్ కు సంబంధించి ఈడీ జప్తు చేసిన రూ. 43 వేల కోట్లకు సంబంధించిన కథనాన్ని సాక్షిలో ఏనాడైనా ప్రచురించిడం కానీ అవినీతి కేసుల్లో ప్రథమ ముద్దాయిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారని కానీ ఏనాడైనా రాసారా అని నిలదీశారు. 

దినపత్రికలంటే తరతమ భేదాలు లేకుండా వాస్తవాలు వెల్లడించేవిగా ఉండాలని... అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న సాక్షి అసలు పత్రిక ఎలా అవుతుందని ప్రశ్నించారు.  ఆ పత్రిక జగన్ రెడ్డి కరపత్రం అనడానికి ఇంతకంటే నిదర్శం ఏముంటుందని అచ్చెన్నాయుడు విమర్శించారు. 
 

click me!