రాష్ట్ర యువతకు మంచి ఉద్యోగావకాశాలు కల్పించడానికి వారిలోని నైపుణ్యాన్ని పెంపొందించేలా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం వుందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. అందుకోసం ఏర్పాటుచేయాలని భావిస్తున్న స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
అమరావతి: ఐటీ పాలసీ, నైపుణ్యాభివృద్దిపై ముఖ్యమంత్రి జగన్ ఇవాళ(సోమవారం) క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి పలు సలహాలు, సూచనలిచ్చారు.
స్కిల్ డెవలప్ మెంట్ కాలేజీల్లో పాఠ్యప్రణాళిక, అప్‌గ్రేడేషన్ పర్యవేక్షణలకు ఒక సెంట్రలైడ్జ్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందుగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.
పార్లమెంటు నియోజకవర్గానికి కనీసం ఒకటి చొప్పున స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.దీంతోపాటు రాష్ట్రంలో ఏర్పాటు చేయదలచిన 30 కాలేజీల్లో పాఠ్య ప్రణాళిక, దాని అమలు తీరు, ఎప్పటికప్పుడు కోర్సులను ఆధునీకరించడం, పర్యవేక్షణ తదితర కార్యకలాపాలన్నీ ఈ వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు.
ఐటీ రంగంలో హై ఎండ్ స్కిల్స్‌పై ఒక సంస్థను విశాఖపట్నంలో ఏర్పాటుచేయాలని సీఎం ఆదేశించారు. ఇంజినీరింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఇందులో ప్రవేశం కల్పించి వారిని మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దాలన్నారు. మొదటగా విశాఖపట్నంలో ఆతర్వాత దీనికి అనుబంధంగా సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతంలో కూడా రెండు సంస్థలను ఏర్పాటుచేసేదిశగా ప్రణాళిక రూపొందించాలని జగన్ ఆదేశించారు.
read more వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొత్తు వారితోనే...: ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ రెడ్డి
హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలతో పోటీపడే పరిస్థితి రావాలంటే నైపుణ్యాలను ఆ నగరాలతో ధీటుగా అభివృద్ధి చేయడమే మార్గమన్నారు. నైపుణ్యకేంద్రాలన్నీ ఒకే నమూనాలో ఉండాలన్నారు. దీనికి సంబంధించిన ఆర్థిక వనరులను సమకూర్చుకుని ఒక సంవత్సరం వ్యవధిలో వాటి నిర్మాణం పూర్తయ్యేలా చూడాలన్న సీఎం ఆదేశించారు.
దీనికి సంబంధించిన ప్రణాళిక పూర్తయ్యేలా చూడాలన్నారు.
రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి గొప్ప ఊతమిచ్చేలా ఈ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. 45 రోజుల్లోగా భూముల గుర్తింపు, ఆర్థిక వనరుల సమీకరణ పూర్తి కావాలని ఆదేశించారు.
ఐటీఐ కాలేజీల్లో నాడు–నేడు కార్యక్రమం కింద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఖాళీల భర్తీపైనా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వంలో వివిధ విభాగాలు నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలన్నీ స్కిల్‌డెవలప్‌మెంట్ విభాగం ద్వారానే చేయాలని స్పష్టంచేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు నాణ్యతతో ఉండడానికి, దీనిపై పర్యవేక్షణకు ఈ విభాగం అవసరమన్నారు సీఎం.
విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి విభాగాలు కలిసి పనిచేయాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో నెపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై కమిటీ వేయాలని నిర్ణయించారు. ఈ కమిటీ మంత్రి గౌతంరెడ్డి ఆధ్వర్యంలో వుంటుందన్నారు. ప్రతి శిక్షణ కార్యక్రమాన్నీ, కోర్సులనూ, నాణ్యతనూ ఈ కమిటీ ద్వారా పరిశీలించాలని సూచించారు. ఉన్నత విద్యామండలి, ఐటీ విభాగాలకు చెందిన వారిని ఇందులో సభ్యులుగా నియమించాలని ఆదేశించారు.
read more ముఖ్యమంత్రి జగన్ కంటే విజయ్ మాల్యానే నయం...: బుద్దా వెంకన్న
ఈ కమిటీ నివేదికలో పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికోసం ఏర్పాటు చేస్తున్న కాలేజీలు, కోర్సులు, ఇతర ప్రణాళికలో ఈ అంశాలను పొందుపరచాలన్నారు. కోస్తా ప్రాంతంలోని పరిశ్రమలకు వీలైనంత వరకూ డీశాలినేషన్ నీటినే వినియోగించేలా ప్రణాళిక తయారు చేయాలన్నారు. సంబంధిత కంపెనీలతో మాట్లాడి డీ శాలినేషన్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రాష్ట్రంలో ఐటీ రంగం పరిస్థితులు, ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులను సీఎంకు వివరించారు అధికారులు. ఐటీ రంగంలో రాష్ట్రానికున్న అవకాశాలపై చర్చించారు. అలాగే అనుసరించాల్సిన పాలసీపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. గత ప్రభుత్వం హయాంలో రూ.4500 కోట్లకుపైగా పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలు పెండింగులో పెట్టారన్న సీఎం...మనల్ని నమ్మి ఇక్కడ పరిశ్రమలు పెడితే రాయితీలను కూడా ఇవ్వని పరిస్థితి చూశామన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ చల్లా మధు, స్కిల్ డెవలప్‌మెంట్ స్పెషల్‌చీఫ్ సెక్రటరీ అనంతరాము, ఐటీ, సివిల్ సప్లైయిస్ ప్రిన్సిపల్ కార్యదర్శి కోన శశిధర్ తదితరులు పాల్గొన్నారు.