చంద్రబాబు కుటుంబంపై దుష్ప్రచారం...సాక్షిని వదిలేదే లేదు...: యనమల

By Arun Kumar P  |  First Published Feb 17, 2020, 6:48 PM IST

చంద్రబాబు నాయుడుపై తప్పుడు ప్రచారం చేస్తున్న సాక్షి మీడియాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు హెచ్చరించారు. 


గుంటూరు: చంద్రబాబుపై, ఆయన కుటుంబసభ్యులపై అప్రస్తుతంగా తప్పుడు ప్రచారం చేసిన వైసీపీనేతలు, సాక్షి మీడియా ఐటీశాఖ పంచనామా నివేదిక రాగానే తెల్లమొహాలేశారని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. విష ప్రచారం చేసిన వ్యక్తులు, సాక్షి మీడియాపై చట్టపరంగా చర్యలు ఎందుకు తీసుకోకూడదని ఆయన ప్రశ్నించారు.

సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఐటీశాఖ తన పంచనామా నివేదికలో  రూ.2.63లక్షలు స్వాధీనం చేసుకున్నట్లుగా చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ సరైన లెక్కలుచూపడంతో వాటిని కూడా తిరిగిచ్చేసిందని, దాన్ని వదిలేసి రూ. 2వేలకోట్లు దొరికాయని అడ్డగోలుగా, అవాస్తవాలతో దుష్ప్రచారం చేశారని యనమల మండిపడ్డారు. 

Latest Videos

undefined

మూడు ఇన్ ఫ్రా కంపెనీల గురించి ఐటీశాఖ తన నివేదికలో చెప్పిందని... ఆ కంపెనీలన్నీ జగన్ కు అత్యంత సన్నిహితమైనవి కావడం వల్లే వాటిని గురించి మంత్రులుగానీ, సాక్షి మీడియా గానీ ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో ఎక్కడా రూ.2వేలకోట్లు దొరికినట్లు ఐటీ చెప్పలేదన్నారు. బోగస్ కంపెనీలు కొన్ని రూ.2వేలకోట్ల వరకు పన్నులావాదేవీలకు సంబంధించిన బకాయిలు ఎగ్గొట్టాయని చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. 

read more  నిరుద్యోగులకు శుభవార్త... ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల భర్తీకి సీఎం ఆదేశం

ఐటీశాఖ నివేదికలో ఏ వాక్యంలో కూడా మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లోనే రూ.2వేలకోట్లు దొరికినట్లుగా చెప్పలేదన్నారు. సబ్ కాంట్రాక్టులు, ఇన్ ఫ్రా కంపెనీల ద్వారానే రూ.2వేలకోట్లవరకు అక్రమలావాదేవీలు జరిగాయన్నారు. రాజ్యాంగం ఇచ్చిన వ్యక్తి స్వేచ్ఛను హరించేలా  తప్పుడు రాతలు రాయిసినందుకు సాక్షి మీడియాపై, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు, ఎడిటర్స్ గిల్డ్ కు ఫిర్యాదు చేస్తామని యనమల హెచ్చరించారు. 

ప్రజాస్వామ్యంలో అతికీలకమైన ఫోర్త్ ఎస్టేట్ పతనమైతే ప్రజాస్వామ్యం కూడా పతనమవుతుందని... అటువంటి ఫోర్త్ ఎస్టేట్ లో ఉంటూ తప్పుడు ప్రచారం చేసినందుకు సాక్షి మీడియాను బ్లాక్ లిస్ట్ లో పెట్టి తీరుతామని యనమల తేల్చిచెప్పారు. ఫోర్త్ ఎస్టేట్ తప్పుడు మార్గంలో  వెళుతున్నప్పుడు దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత రాజ్యాంగంపై ఉంటుందన్నారు. 

కేవలం ఫిర్యాదులతోనే సరిపెట్టకుండా సాక్షిమీడియాపై పరువు నష్టం దావా కూడా వేస్తామని... ఐపీసీ చట్టాల ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికైనా మంత్రులు, ప్రభుత్వపెద్దలు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే వారికీ, ఎదుటివారికీ కూడా మంచిదన్నారు.

read more  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొత్తు వారితోనే...: ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ రెడ్డి

మండలిరద్దు చేయడమే ప్రభుత్వం చేసిన అతిపెద్ద నేరమన్నారు. సెలెక్ట్ కమిటీ అంశం ఛైర్మన్ పరిధిలోనే ఉంటుందని, ఆయన తనకున్న అధికారంతోనే మూడు రాజధానుల బిల్లు అంశాన్ని కమిటీకి పంపుతారని, శాసనమండలి కార్యదర్శికి, ఛైర్మన్ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం ఉండబోదన్నారు. ఛైర్మన్ నిర్ణయాన్ని ఇప్పటికే మండలి కార్యదర్శి రెండుసార్లు తిరస్కరించారని... మూడోసారి ఛైర్మన్ నిర్ణయమే అంతిమమని యనమల స్పష్టంచేశారు. 

మండలి రద్దు చేయాలనే ఆలోచన చేయడమే ప్రభుత్వం చేసిన అతిపెద్ద నేరమని, దానిపై కూడా మండలి  సభ్యులందరూ రాష్ట్రపతిని, గవర్నర్ ని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు మాజీమంత్రి తెలిపారు. కౌన్సిల్ లో బిల్లులు పెండింగ్ లో ఉండగానే దాన్ని రద్దు చేయడం,  మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ రద్దు నిర్ణయాలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోయిందన్నారు యనమల.         

 


 
 
 

click me!