పల్నాడులో పోలీసుల అత్యుత్సాహం... ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు

Arun Kumar P   | Asianet News
Published : Mar 13, 2020, 10:27 AM IST
పల్నాడులో పోలీసుల అత్యుత్సాహం... ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు

సారాంశం

అధికార వైసిపి పోలీసులను ఉపయోగించి తమ అభ్యర్ధులను నామినేషన్ వెయ్యకుండా అడ్డుకుందని జనసేన పార్టీ ఆరోపిస్తోంది. పల్నాడు ప్రాంతంలో పోలీసుల బెదిరింపులతో తమ అభ్యర్ధులు కనీసం నామినేషన్ కూడా  వెయ్యలేకపోయారని జనసేన ఆరోపిస్తోంది. 

గుంటూరు: స్థానికసంస్థల ఎన్నికల సందర్భంగా పల్నాడు ప్రాంతం అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మాచర్లలో టిడిపి నాయకులపై జరిగిన దాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. తమ అభ్యర్ధుల నామినేషన్ తిరస్కరణకు గురవడంతో అక్కడికి వెళ్లిన నాయకులపై వైసిపి శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. తాజాగా జనసేన పార్టీ అభ్యర్థులు తమపై దౌర్జన్యానికి పాల్పడి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.   

గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని దుర్గి మండలంలో జనసేన అభ్యర్థులను పోలీస్ అధికారులు బెదిరించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. కంచరగుంట ఎంపీటీసీ స్థానం నుంచి నామినేషన్ దాఖలుకు వెళ్ళిన ఎస్సీ మహిళ బొంత నిర్మలను దుర్గి ఎస్ఐఎం రామాంజనేయులు దుర్భాషలాడి అడ్డుకున్నారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫలితంగా ఆమె నామినేషన్ దాఖలు చేయలేకపోయారని ఆరోపించారు. 

read more   మాపై మాచర్లలో హత్యాయత్నం...స్కెచ్ వేసింది ఎక్కడంటే...: బోండా ఉమ

అలాగే దుర్గి మండలంలోని ధర్మవరం ఎంపీటీసీ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా నిలిచిన తోట పద్మావతి, ఆమె కుటుంబ సభ్యులను ఎస్సై రామాంజనేయులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఈసీకి పిర్యాదు చేశారు. ఈ బెదిరింపుల ఫలితంగా ఆమె కుటుంబం గ్రామం వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని... కాబట్టి వారికి రక్షణ కల్పించాలని జనసేన ఈసీని కోరింది. 

దుర్గి మండలంలో చోటుచేసుకున్న పరిస్థితులను రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి జనసేన పార్టీ లీగల్ విభాగం బుధవారం తీసుకెళ్ళింది. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కలిసి సంఘటన వివరాలను తెలిపి ఫిర్యాదు పత్రం అందజేసింది. జనసేన అభ్యర్థిని అడ్డుకోవడం, భయభ్రాంతులకు గురి చేస్తున్న సదరు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కోరింది.

PREV
click me!

Recommended Stories

రైల్వేకోడూరు: అభ్యర్ధిని మార్చిన జనసేన, భాస్కరరావు స్థానంలో శ్రీధర్
ఆటోలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం: డ్రైవర్ల సమస్యలపై జనసేనాని ఆరా