తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆంధ్ర ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రమణి ఆరోపించారు. మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నా వాటిని నిలువరించేందుకు ప్రభుత్వాలు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.
విశాఖపట్నం: మొన్న నిర్భయ... నిన్న ప్రియాంక రెడ్డి... నేడు రోజా... దేశంలో రోజురోజుకి మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు పెరుగిపోతున్నాయని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రమణి కుమారి ఆరోపించారు. ఇలా విచక్షణారహితంగా కొనసాగుతున్న అఘాయిత్యాల వల్ల మహిళలు, చిన్నారులు బలవుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు.
ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ శనివారం నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ మహిళా నేతలతో కలిసి రమణి మీడియాతో మాట్లాడారు. మొన్న ఢిల్లీలో జరిగిన నిర్భయపై అత్యాచారం మరవకముందే వరంగల్ లో మానస, హైదరాబాద్ లో ప్రియాంక రెడ్డి, తమిళనాడు కాంచీపురంలో రోజా అనే యువతిపై అత్యాచారం జరగటం దారుణమన్నారు.
undefined
ఈ ఘటనలపై అటు రాష్ట్ర ప్రభుత్వాలు గానీ...దేశంలో అధికారంలో వున్న బిజెపి ప్రభుత్వం గానీ స్పందించడం లేదని... మహిళా రక్షణపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రస్తుతం మహిళలు కనీసం స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి కూడా లేదని... రోజురోజుకు పెరిగిపోతున్న దారుణాలను చూసి వారు భయకంపితులవుతున్నారని అన్నారు.
read more ప్రియాంక రెడ్డిపై అత్యాచారం, హత్య... ఏపిలోనూ ఇదే పరిస్థితి..: పంచుమర్తి అనురాధ
దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని... మహిళల రక్షణకు కేంద్ర ప్రభుత్వం మరో కఠిన చట్టం తీసుకురావాలన్నారు. అత్యాచారాలకు పాల్పడే నేరగాళ్లకు అత్యంత కఠినమైన శిక్షలు విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
ఈరోజు దేశంలో మోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో తమ ఉనికిని చాటుకోవడంపై మాత్రమే దృష్టిసారించిందన్నారు. మొన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పరిపాలన సాగించాలని చూశారని... దాన్ని ప్రజలే అడ్డుకుని తగినవిధంగా బుద్ధి చెప్పారన్నారు.
అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ప్రభుత్వం ఈరోజు ఉన్న ఉద్యోగులను తొలగించే పరిస్థితి వచ్చిందన్నారు. ఇక నల్లధనాన్ని తిరిగి తీసుకొస్తామన్న బిజెపి ప్రభుత్వం ఈరోజు వరకు ఒక రూపాయి కూడా తీసుకువచ్చినట్లు బయట పెట్టలేదని తెలిపారు.
read more చంద్రబాబు వాహనంపై దాడి... పార్లమెంట్ లో ఆందోళనకు టిడిపి నిర్ణయం
కేంద్రం దేశ భవిష్యత్తు, మహిళలు భవిష్యత్తు కోసం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ముఖ్యంగా మహిళలకు రక్షణ కల్పించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని తెలిపారు.
రాష్ట్రంలో కూడా ప్రభుత్వం మహిళల రక్షణకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. మొన్నటి వరకు ఉన్న ఇసుక సమస్య పోకముందే ఈరోజు రాష్ట్రంలో ఉల్లిపాయ ధర కొండెక్కి కూర్చుందని.. సామాన్య మానవుడు ఈరోజు ఉల్లిని కొనే పరిస్థితి లేదన్నారు. ఉల్లి ధర వంద రూపాయల పైన దాటిందని... వెంటనే ప్రభుత్వం సబ్సిడీ ధరకు ఉల్లిపాయలు అందించాలని రమణి డిమాండ్ చేశారు.