గుంటూరు జిల్లా మాచర్లలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపై ఏపి డిజిపి గౌతమ్ సవాంగ్ స్పందించారు. వెంటనే గుంటూరు ఐజీ, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.
గుంటూరు జిల్లా మాచర్లలో చోటుచేసుకున్న ఘటనలపై డిజిపి గౌతమ్ సవాంగ్ వెంటనే స్పందించారు. అసలు మాచర్లలో ఏం జరిగిందో ప్రత్యక్షంగా వెళ్లి తెలుసుకోవాలని డిజిపి జిల్లాకు చెందిన పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో గుంటూరు ఐజి, ఎస్పీలతో పాటు ఇతర ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించాల్సిందిగా డీజీపీ ఆదేశించడంతో విచారణను ముమ్మరం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మాచర్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు ప్రయాణిస్తున్న కారుపై కొందరు బుధవారం దాడికి పాల్పడ్డారు. వైసీపి నేతలే తమపై దాడి చేయించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
undefined
ఈ దాడిపై బోండా ఉమ మాట్లాడుతూ... మాచర్లలో అంతకుముందు టిడిపి అభ్యర్థి నామినేషన్ సందర్భంగా జరిగిన ఘటనపై పీఎస్‍లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్ కు వెళుతుంటే తాము ప్రయాణిస్తున్న వాహనాలపై వైసీపీ నేతలు కర్రలతో దాడి చేశారని ఆరోపించారు. తమ వాహనాలతో పాటు రక్షణ కోసం వచ్చిన పోలీసు వాహనాలపై కూడా దాడి చేసి భయానక వాతావరణం సృష్టించారని అన్నారు. కర్రలతో తమపైనే కాదు అడ్వొకేట్, డీఎస్పీలపై కూడా దాడి చేశారని అన్నారు.
read more పిల్లాడిని ఢీకొట్టారు, అందుకే..:మాచర్ల ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి
పథకం ప్రకారమే తమపై దాడి జరిగిందని బుద్ధా వెంకన్న ఆరోపించారు. వెంటపడి తమపై దాడి చేశారని బుద్ధా వెంకన్న అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగే పరిస్థితి లేదని ఆయన అన్నారు. ఎపీ నేతలు తెలంగాణకు వెళ్లి రక్షణ పొందాల్సిన పరిస్థితి ఏర్పడిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అన్నారు.
అయితే వైసిపి నాయకులు మాత్రం ఈ దాడిపై మరో వాదన వినిపిస్తున్నారు. పల్నాడులో ప్రశాంత పరిస్థితులను చెదరగొట్టేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోందని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
విజయవాడ నుండి బుద్దా వెంకన్న, బొండా ఉమలతో పాటు గూండాలను చంద్రబాబు నాయుడు 10 కార్లలో పంపించారని పిన్నెల్లి చెప్పారు. విజయవాడ నుండి వస్తుండగా మాచర్ల సమీపంలో ఓ పిల్లాడిని టీడీపీ నేతల కారు ఢీకొట్టిందన్నారు. ఈ విషయమై గ్రామస్తులపై టీడీపీ నేతలు దుర్భాషలాడారని... దీంతొ కోపోద్రిక్తులైన స్థానికులు ఈ దాడికి పాల్పడ్డారని అన్నారు.
read more ప్రాణాలతో వదులుతారని అనుకోలేదు... డిఎస్పీ, అడ్వోకేట్ సైతం: మాచర్ల దాడిపై బోండా ఉమ
ఇలా ఇరు పార్టీల నాయకులు తమకు అనుకూలంగా మాట్లాడుతుండటంతో అసలు నిజాలేమిటో తేల్చాలని జిల్లా పోలీసులకు డిజిపి ఆదేశించారు. ఎన్నికల సమయంలో ఈ ఘటన జరగడంతో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. వీలైనంత త్వరలో అసలు ఏం జరిగిందో తెలుసుకుంటామన్నారు.