యువతకు ఉద్యోగావకాశాలు... విశాఖ, తిరుపతి లలో ప్రత్యేక యూనివర్సిటీలు

By Arun Kumar P  |  First Published Dec 18, 2019, 4:39 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతి పార్లమెంట్ నియోజకర్గానికి ఓ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. వీటన్నింటిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక యూనివర్సిటీలను కూడా ఏర్పాటు చేయనున్నారు.  


అమరావతి: ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికీ ఒక కేంద్రం చొప్పున 25 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు  ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ యూనివర్శిటీ ఏర్పాటుపై సమీక్షించాలని ముఖ్యమంత్రి... తిరుపతిలో స్కిల్‌డెవలప్‌మెంట్‌ యూనివర్శిటీ, విశాఖపట్నంలో హైఎండ్‌ స్కిల్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

స్కిల్ డెవలప్‌మెంట్‌పై ముఖ్యమంత్రి జగన్‌ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఇవన్నీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్శిటీ కింద నడవాలని..దీనివల్ల ఏం జరుగుతోందన్న దానిపై ఒక అవగాహన ఉంటుందన్నారు. దీంతో సమీక్షించడం, పర్యవేక్షించడం సులభతరం అవుతుందన్నారు. 

Latest Videos

undefined

ఇలా స్కిల్‌ డెవలప్‌సెంటర్లలో అవినీతికి ఆస్కారం లేకుండా  చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈసెంటర్లలో ఏ అంశాలపై శిక్షణ ఇవ్వాలన్నదానిపై స్కిల్స్‌ యూనివర్శిటీ నిర్ణయిస్తుందని... ఏయే కేంద్రాల్లో ఏ తరహా శిక్షణ దొరుకుతుందన్న దానిపై విద్యార్థులకు పూర్తిస్థాయి అవగాహన ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 
దీనివల్ల పటిష్టమైన ఒక వ్యవస్థ ఏర్పడుతుందన్నారు.

read more  ap capital: సచివాలయం వద్ద టిడిపి, వైసిపి వర్గాల ఘర్షణ

ఒక్కో పార్లమెంటుకు ఒక పాలిటెక్నిక్‌ కాలేజీగాని లేదా అవసరమైతే రెండు కాలేజీలనుగాని తీసుకునే ఆలోచనలు చేయండన్నారు. ఎంపిక చేసుకున్న ఈ పాలిటెక్నిక్‌ కాలేజీని నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా మార్చాలని ఆదేశించారు. వీటిపైన ఒక యూనివర్శిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

వివిధ సాంకేతి కోర్సులను నేర్చుకున్నవారికి మరింత నైపుణ్యాన్ని వీటిద్వారా కలిగించాలని అధికారులకు సూచించారు. ఇంజినీరింగ్‌ అయిపోయిన, డిప్లమో పూర్తిచేసిన, ఐటీఐ లాంటి కోర్సులను పూర్తిచేసిన వారికి మరింత నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఈ స్కిల్స్‌ యూనివర్శిటీ, స్కిల్స్‌ కేంద్రాల ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు. 

తదుపరి సమావేశం నాటికి  ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక పాలిటెక్నిక్‌ కాలేజీని గుర్తించాలని  సీఎం ఆదేశించారు. ఆ కాలేజీలో మౌలిక సదుపాయాలను అభివృద్ది చేద్దామని... సదరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలన్నీ ఈ కాలేజీలో జరగాలన్నారు. శాశ్వతంగా నైపుణ్యాభివృద్ధికి ఇది కేంద్రం కావాలన్నారు. 
మంచి మౌలిక సదుపాయాలను ఇక్కడ ఏర్పాటు చేయడంతో పాటు మంచి బోధకులను నియమించాలని ఆదేశించారు. 

read more  చంద్రబాబు, లోకేశ్ మధ్య విబేధాలు... ఇదే నిదర్శనం: పేర్ని నాని

నైపుణ్యాభివృద్ధి కోసం ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలతో అనుసంధానం కావాలని అధికారులను ఆదేశించారు. ఉదాహరణకు కారు రిపేరులో శిక్షణ ఇవ్వాలనుకుంటే మెర్సిడెజ్‌ బెంజ్‌తో శిక్షణ ఇప్పించాలని సూచించారు. దీనివల్ల ప్రపంచదేశాల్లో కూడా మన నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో ఇచ్చే శిక్షణకు మంచి విలువ ఉంటుందని...  వారి సహకారంతో మంచి పాఠ్యప్రణాళికను రూపొందించండని సీఎం ఆదేశించారు.

ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికెట్‌ చూసి తప్పకుండా ఉద్యోగం ఇచ్చే పరిస్థితి ఉండాలన్నారు. స్థానిక పరిశ్రమలు, వారి అవసరాలను గుర్తించి ఆ మేరకు శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో అక్కడున్న స్థానిక పరిశ్రమల ప్రతినిధులను బోర్డులో సభ్యులుగా చేర్చాలని... దీనివల్ల శిక్షణ కార్యక్రమాలకు ఊతమిచ్చినట్లు అవుతుందన్నారు. 

హైఎండ్‌ స్కిల్స్‌కోసం కూడా మరో యూనివర్శిటీని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు జగన్. రోబోటిక్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ లాంటి స్కిల్స్‌ను ఇక్కడ నేర్పిస్తారని... 
దీనిపైన కూడా అధికారులు ప్రణాళికను తయారు చేయాల్సి ఉంటుందన్నారు.  స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ అనేది ఒక స్కాంగా మిగిలిపోకూడదని... నైపుణ్యాభివృద్ధి అనేదానికి ఒక అర్థం తీసుకురావాలన్నారు.

ప్రస్తుతం జరుగుతున్న నైపుణ్యభివృద్ధి కార్యక్రమాలపై పూర్తిస్థాయి సమీక్ష చేయాలని సీఎం అధికారులకు ఆదేశించారు. దీనికింద నిజంగా పిల్లలు లబ్ధి పొందుతున్నారా? లేక మాటలకు మాత్రమే పరిమితం అవుతుందా? అన్నది పరిశీలించాలన్నారు. 2100 చోట్ల నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్న అధికారులకు వీటిపై పూర్తిస్థాయి పరిశీలన చేయాలని సీఎం ఆదేశించారు. 

click me!