
Rose Plant Care in Summer: తోటలో గులాబీ మొక్క ఉంటే ఆ అందమే వేరు. కానీ మండు వేసవిలో వాటిని కాపాడుకోవడం కొంచెం కష్టమైన పనే. తీవ్రమైన ఎండ, గాలిలో తేమ లేకపోవడం, వేడి గాలుల వల్ల గులాబీ మొక్కలు త్వరగా వాడిపోతుంటాయి. అయితే సరైన జాగ్రత్తలు తీసుకుంటే, వేసవిలోనూ గులాబీ మొక్కలు పచ్చగా, పూలతో నిండుగా ఉంటాయి. అవేంటో వివరంగా తెలుసుకుందాం.
వేసవిలో గులాబీ మొక్కలకు సరిపడా నీళ్లు పోయడం చాలా ముఖ్యం. ఉదయం పూట త్వరగా లేదా సాయంత్రం వేళల్లో నీళ్లు పోయడం బెస్ట్. ఎందుకంటే ఆ సమయంలో ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి, మట్టిలో తేమ ఎక్కువసేపు ఉంటుంది. మట్టి పూర్తిగా ఎండిపోకుండా చూసుకోవాలి. అలా అని మరీ ఎక్కువగా నీళ్లు పోయకూడదు. దానివల్ల వేర్లు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
గులాబీ మొక్కలకు ఎండ మంచిదే అయినా, వేసవిలో మధ్యాహ్నం పూట వచ్చే తీవ్రమైన ఎండ వాటికి హానికరం. మధ్యాహ్నం ఎండ మరీ ఎక్కువగా ఉంటే, మొక్కలను కొంచెం నీడలో ఉంచడం మంచిది. మీ మొక్కలు తోటలో ఉంటే, వాటిపై షేడ్ నెట్ లేదా ఏదైనా పలుచని బట్ట కప్పి నీడ కల్పించవచ్చు.
వేసవిలో మొక్కలను కాపాడుకోవడానికి మల్చింగ్ ఒక అద్భుతమైన పద్ధతి. దీనికోసం, మట్టి పైభాగంలో ఎండిన ఆకులు, గడ్డి ముక్కలు లేదా కొబ్బరి పీచును పరవాలి. ఇది మట్టిలో తేమను ఎక్కువసేపు నిలిపి ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే వేర్లు మరీ వేడెక్కకుండా కాపాడుతుంది. మల్చింగ్ వల్ల మొక్కలు ఆరోగ్యంగా ఉండి, ఎక్కువ పూలు పూస్తాయి.
గులాబీ మొక్కలు ఆరోగ్యంగా ఉండటానికి పోషకాలతో నిండిన ఎరువులు చాలా అవసరం. వేసవిలో, వర్మీకంపోస్ట్ లేదా పశువుల ఎరువు వంటి తేలికపాటి సేంద్రియ ఎరువులను వాడటం మంచిది. దీనివల్ల మొక్కలకు అవసరమైన పోషకాలు అంది, ఆరోగ్యంగా పెరుగుతాయి. అయితే, ఎక్కువ ఎరువు వేయడం కూడా మొక్కలకు హానికరం అని గుర్తుంచుకోవాలి.
గులాబీ మొక్కలకు ఎండిన ఆకులు లేదా పాడైపోయిన కొమ్మలు కనిపిస్తే, వాటిని ఎప్పటికప్పుడు కత్తిరించాలి. ఇలా చేయడం వల్ల మొక్క తన శక్తిని కొత్త ఆకులు, పువ్వుల పెరుగుదలకు ఉపయోగిస్తుంది. అంతేకాకుండా, ఇది మొక్కను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనివల్ల వేసవిలోనూ గులాబీలు పూస్తూనే ఉంటాయి.