చలికాలమైనా, వానాకాలమైనా, ఎండాకాలమైనా ఫ్రిజ్ ను ఎప్పుడూ వాడుతూనే ఉంటారు. ఎందుకంటే ఫ్రిజ్ ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంచడానికి సహాయపడుతుంది. చాలా మంది ఫ్రిజ్ లో ఏవి పెట్టినా పెట్టకపోయినా.. కూరగాయల్ని మాత్రం పక్కాగా పెడుతుంటారు. ఎందుకంటే బయట ఉంటే కూరగాయలు తొందరగా పాడవుతాయి. మురిగిపోతాయి.
అదే ఫ్రిజ్ లో పెడితే వారమైనా చెక్కు చెదరకుండా ఫ్రెష్ గా ఉంటాయి. అందుకే పండ్లను, కూరగాయల్ని ఫ్రిజ్ లో ఖచ్చితంగా పెడుతుంటారు. కానీ కొన్ని రకాల కూరగాయల్ని ఫ్రిజ్ లో మాత్రం పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఫ్రిజ్ లో పెట్టి తింటే ఆరోగ్యం దెబబ్తింటుంది. అందుకే ఏయే కూరగాయల్ని ఫ్రిజ్ లో పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఆకు కూరలు
చలికాలంలో ఆకు కూరల్ని ఎక్కువగా తింటుంటారు. అయితే ఈ ఆకు కూరలు తొందరగా పాడవుతాయి. అందుకే వీటిని కొనేసి ఫ్రిజ్ లో పెట్టి వారం పాటు వండుకుని తింటుంటారు. కానీ ఆకు కూరల్ని ఫ్రిజ్ లో పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ పెట్టినా వీటిని శుభ్రంగా కడిగి 12 గంటలు మాత్రమే ఫ్రిజ్ లో ఉంచాలి. ఇంతకంటే ఎక్కువ గంటలు ఉంచితే మాత్రం వాటి సహజ రుచి, ఆకృతి మారుతాయి. అలాగే వీటిలోని పోషకాలు కూడా తగ్గుతాయి.
Garlic in Winter
వెల్లుల్లి, ఉల్లిపాయలు
వెల్లుల్లి, ఉల్లిపాయలు లేని కూర ఉండదు. అందుకే ఆడవారు వీటిని ఒకేసారి ఎక్కువ కొనేస్తుంటారు. ఇక ఇవి బయటపెడితే తొందరగా పాడవుతాయని ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. అవసరమున్నప్పుడు కొంచెం కొంచెం తీసుకుని వాడుకుంటుంటారు. కానీ వీటిని ఫ్రిజ్ లో పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఈ రెండూ అంత తొందరగా పాడవవు. నిజమేంటంటే? వీటిని ఫ్రిజ్ లో పెడితే మొలకెత్తడం ప్రారంభిస్తాయి. దీనివల్ల వాటి రుచి మారుతుంది. అందుకే వీటిని ఫ్రిజ్ లో కాకుండా.. చల్లని లేదా పొడి ప్రదేశంలో నిల్వ చేయండి.
అల్లం
చాలా మంది అల్లాన్ని చలికాలంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది మన శరీరాన్ని చలికి తట్టుకునేలా చేస్తుంది. అంటే అల్లంలో ఉండే వేడి స్వభావం మన శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు సహాయపడుతుంది. నిజానికి ఇది వంటలను టేస్టీగా చేయడమే కాకుండా.. దీనిలో ఉండే ఔషదగుణాలు మనల్ని ఎన్నో రోగాల నుంచి కాపాడుతాయి. అయితే కొంతమంది అల్లాన్ని కూడా ఫ్రిజ్ లో పెడుతుంటారు. కానీ అల్లాన్ని ఫ్రిజ్ లో అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే ఫ్రిజ్ లో అల్లాన్ని పెడితే తొందరగా బూజు పడుతుంది. దీనివల్ల అది చెడిపోతుంది. ఇలాంటి అల్లాన్ని తింటే కాలెయం, మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటుంది.
బంగాళాదుంపలు
ఎండాకాలమైనా, చలికాలమైనా.. కాలంతో సంబంధం లేకుండా ఆలుగడ్డలను తింటుంటారు. చాలా మంది ఆలుగడ్డలను ఒకేసారి ఎక్కువగా కొనేసి ఇంట్లో నిల్వ చేస్తుంటారు. ఇంట్లో ఏ కూరగాయలున్నా వాటితో పాటుగా వీటిని కలిపి వండేస్తుంటారు. అయితే బంగాళాదుంపలను కూడా ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు కొంతమంది. కానీ ఇలా ఆలుగడ్డలను ఫ్రిజ్ లో పెట్టడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఆలుగడ్డలను ఫ్రిజ్ లో పెడితే అవి తొందరగా మొలకెత్తుతాయి. అలాగే వీటిలో ఉండే పిండి పదార్థం కాస్త చక్కెరగా మారుతుంది. వీటిని తింటే మధుమేహుల ఆరోగ్యమే కాకుండా ఇతరుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
tomatoes
టమాటాలు
ఏ కూరగాయ ఉన్నా లేకున్నా ప్రతి ఒక్క ఇంట్లో టమాటాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఈ టమాటాలు చాలా తొందరగా మురిగిపోతాయి. పాడైపోతుంటాయి. అందుకే వీటిని ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. దీనివల్ల టమాటాలు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయి. కానీ టమాటాలను ఫ్రిజ్ లో అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే టమాటాలను ఫ్రిజ్ లో పెడితే వాటి రుచి, ఆకృతి తగ్గుతాయి. అలాగే టమాటాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కూడా నశిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.