తేనె ఒక నేచురల్ స్వీటెనర్. ఇది టేస్టీగా ఉండటమే కాకుండా.. మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. తేనెను ఉపయోగించి మనం జలుబు నుంచి గొంతు నొప్పి వరకు ఎన్నో సమస్యలను తగ్గించుకోవచ్చు. తేనె గాయాలను త్వరగా నయం చేస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రాత్రిపూట బాగా నిద్రపట్టేలా చేస్తుంది.
తేనె ఒంట్లో శక్తిని పెంచడం నుంచి అలెర్జీలు, చర్మ సంరక్షణ, సైనస్ వంటి వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికి, ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి ఇలా ఎన్నో విధాలుగా ఉపయోపడుతుంది. అయితే ఇది కేవలం మన ఆరోగ్యానికి మాత్రమే కాదు.. చర్మానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
నిజానికి తేనె మన చర్మానికి ఔషధం కంటే తక్కువేం కాదు. దీన్ని ఎన్నో రకాల ఫేస్ మాస్క్ ల్లో ఉపయోగిస్తారు. తేనెకున్న ప్రత్యేకత ఏంటంటే? దీన్ని రోజూ చర్మానికి ఉపయోగించొచ్చు.
అలాగే దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు. కానీ తేనెకు అలెర్జీ ఉన్నవారు మాత్రం ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాతే ముఖానికి తేనెను పెట్టాలి. అసలు ముఖానికి తేనెను పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
యాంటీ బాక్టీరియల్
తేనె మన చర్మానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది మన చర్మంపై ఉండే బ్యాక్టీరియాను చాలా వరకు తగ్గిస్తుంది. దీంతో మొఖంపై మొటిమలు ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది. మొటిమలతో బాధపడుతున్న వారికి తేనె మంచి మందులా పనిచేస్తుంది.
ఎక్స్ఫోలియేటర్లు
తేనె మంచి ఎక్స్పోలియేటర్ గా కూడా పనిచేస్తుంది. తేనెలో ఉండే కొన్ని ఎంజైములు దీనిని నేచురల్ ఎక్స్ఫోలియేటర్ గా చేస్తాయి. దీన్ని ముఖానికి, మొత్తం చర్మానికి అప్లై చేయడం వల్ల డ్రై స్కిన్ సమస్య తొలగిపోతుంది. అలాగే చర్మం నీరసంగా మారదు. అలాగే చర్మంలోని మృతకణాలు తొలగిపోతాయి. లోపల ఉన్న కొత్త కణాలు బయటకు వచ్చి మీ చర్మం మెరిసెలా చేస్తుంది.
యాంటీసెప్టిక్
మొటిమల సమస్యతో బాధపడుతున్న వారికి తేనె ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మొటిమలకు తేనెను అప్లై చేయడం వల్ల మీ ముఖంపై ఉన్న దుమ్ము, దూళి తొలగిపోతాయి. దీంతో బ్యాక్టీరియా నుంచి మీ ముఖం రక్షణ పొందుతుంది. తేనె మొటిమలకు యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది.
యాంటీ ఏజింగ్
తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి. ఇది చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీరాడికల్ డ్యామేజ్ నుంచి కాపాడుతాయి. ఇది చర్మాన్ని టైట్ గా, యవ్వనంగా ఉంచుతుంది. అలాగే వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. అలాగే ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది.
క్లియర్ చర్మం
ముఖానికి తేనెను పెట్టడం వల్ల చర్మంపై మూసుకుపోయిన రంధ్రాలను సహజంగా తెరుచుకుంటాయి. అలాగే ఇది చర్మాన్ని క్లియర్ గా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే తేనె పిగ్మెంటేషన్, ముఖంపై ఉన్న మచ్చలను, మరకలను పోగొట్టి చర్మం మెరిసేలాచేస్తుంది.
వడదెబ్బ ఉపశమనం
తేనె వడదెబ్బ వల్ల కలిగే నష్టం నుంచి మన చర్మాన్ని రక్షించడానికి, మంటను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. అలాగే గాయాలు తొందరగా మానడానికి సహాయపడుతుంది. వడదెబ్బ వల్ల కలిగే డ్యామేజ్ నుంచి చర్మాన్ని నేచురల్ గా నయం చేయడానికి కూడా ఇది చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.