ఏప్రిల్ నెల నుంచి ఎండల తీవ్రత బాగా పెరిగింది. ఇక మే నెలలో ఎండలు ఏ తీరులో మండుతాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎండల వల్ల ఆరోగ్యం దెబ్బతినకూడదంటే మాత్రం మనల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా ఈ సీజన్ లో నీటిని బాగా తాగాలి. అయితే చాలా మంది కూల్ వాటర్ ను తాగడానికే ఇష్టపడతారు. అందుకే ఫ్రిజ్ లో ఎప్పుడూ వాటర్ బాటిల్స్ ను పెడుతుంటారు. అలాగే మిగిలిపోయిన ఆహారాలను కూడా ఫ్రిజ్ లోపల పెట్టెస్తుంటారు. కానీ ఫ్రిజ్ లో ఎక్కువ వస్తువులను పెట్టడం వల్ల ఫ్రిజ్ దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే కరెంట్ బిల్లు కూడా బాగా వస్తుంది. ఫ్రిజ్ వల్ల కరెంట్ బిల్లు పెరగకూడదంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఫ్రిజ్ ఉంచే ప్రదేశం
ఫ్రిజ్ పాడవకూడదంలే మీరు దానిని ఏ ప్లేస్ లో పెడుతున్నారో చూసుకోవాలి. ఫ్రిజ్ ను ఎప్పుడూ కూడా సూర్యరశ్మి వచ్చే ప్రదేశంలో అస్సలు పెట్టకూడదు. అలాగే ఓవెన్, మైక్రోవేవ్, గ్యాస్ స్టవ్, కుక్కర్ దగ్గర కూడా ఫ్రిజ్ ను పెట్టకూడదు. ఈ ప్రదేశాల్లో ఫ్రిజ్ ను పెడితే ఫ్రిజ్ త్వరగా వేడెక్కి కంప్రెషర్ చల్లబరచడానికి ఎక్కువ శక్తిని ఉపయోగించాల్సి ఉంటుంది. దీనివల్ల కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంది.
ఎక్కువ వస్తువులను పెట్టడం మానుకోండి
కొంతమంది ఫ్రిజ్ ను వస్తువులతో నింపేస్తుంటారు. ఫ్రిజ్ లో ఎప్పుడూ కూడా దాని సామర్థ్యానికి మించి ఎక్కువ వస్తువులను పెట్టకూడదు. ఎందుకంటే ఎక్కువ వస్తువులను పెట్టడం వల్ల చల్లని గాలి ప్రసరణ ఆగిపోతుంది. ఫ్రిజ్ చల్లబడటానికి చాలా టైం పడుతుంది. దీనివల్ల ఎక్కువ సమయం, ఎక్కువ శక్తి ఖర్చు అవుతాయి. దీని ప్రభావం కరెంట్ బిల్లుపై పడుతుంది.
refrigerator
ఆహారం నిల్వ
వేడి వేడి ఆహారాన్ని ఫ్రిజ్ లో పెట్టకపోవడమే మంచిది. ఎందుకంటే దీనివల్ల ఫ్రిజ్ లోపల ఉష్ణోగ్రత పెరగడం మొదలవుతుంది. అధిక ఉష్ణోగ్రత వల్ల ఫ్రిజ్ కంప్రెసర్ పై ఎక్కువ పీడనం పడుతుంది. దీనివల్ల విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండి కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంది.
ఫ్రిజ్ క్లీనింగ్
రిఫ్రిజిరేటర్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం మర్చిపోకూడదు. లేదంటే ఫ్రిజ్ లో దుర్వాసన వస్తుంది. అలాగే మరకలు కూడా పడతాయి. అందుకే ఫ్రిజ్ ను అప్పుడప్పుడు క్లీన్ చేస్తుండాలి. ఫ్రిజ్ లోని కాయిల్స్ ఫ్రిజ్ ను చల్లబరచడానికి ఉపయోగపడతాయి. ఆ కాయిల్ దుమ్ము, ధూళితో కప్పబడి ఉంటే రిఫ్రిజిరేటర్ ను చల్లబరచడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే ఫ్రిజ్ ను నెలకు ఒకటి లేదా రెండుసార్లు శుభ్రం చేసుకోవాలి.