మిరపకాయలు కోసిన తర్వాత చాలా సార్లు చేతుల్లో మంటగా అనిపిస్తుంటుంది. ఇది చాలా కామన్. ఇలా మంటగా అనిపించినప్పుడు చాలా మంది చేతులను నీళ్లతో కడగడమో లేదా నీళ్లలో పెట్టడమో చేస్తుంటారు. కానీ దీనివల్ల కూడా మంట తగ్గదు. అసలు మిరపకాయలను కోస్తే చేతుల్లో ఎందుకు మంట వస్తుంది? ఇది తగ్గాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మిరపకాయలను కోసిన తర్వాత చేతుల్లో మంట ఎందుకొస్తుంది?
మిరపకాయల్లో క్యాప్సైసిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది కొన్ని మిరపకాయల్లో ఎక్కువగా, కొన్ని దాంట్లో తక్కువగా ఉంటుంది. అయితే మీరు క్యాప్సైసిన్ ఎక్కువగా ఉండే మిరపకాయను కోసినప్పుడు మీ చేతుల్లో మంటగా అనిపించడం మొదలవుతుంది. ఇది ప్రమాదకరమైన సమస్య కాదు. ఇది కొన్ని గంటల్లో దానంతట అదే తగ్గిపోతుంది.
చేతుల మంట తగ్గాలంటే ఏం చేయాలి?
పెరుగు, నెయ్యి లేదా పాలు వాడండి
మిరపకాయలు కోసిన తర్వాత చల్లటి పాలు, నెయ్యి, వెన్న లేదా పెరుగును చేతులకు రాసుకుంటే చేతుల మంట తగ్గుతుంది. అయితే మీరు వీటిలో దేన్ని చేతులకు రుద్దుకున్నా కనీసం రెండు నిమిషాలైనా ఉంచాలి. అప్పుడే మంట తగ్గుతుంది.
కలబంద జెల్
కలబంద గుజ్జు చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అలొవేరా జెల్ మిరపకాయను కోసిన తర్వాత మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందుకోసం అలోవెరా జెల్ తీసుకొని మీ చేతులకు క్రీమ్ లాగా అప్లై చేయండి లేదా జెల్ తో చేతులను మసాజ్ చేయండి. ఇది మంటను వెంటనే తగ్గిస్తుంది.
honey
తేనె
చిన్న చిన్న గాయాలను నయం చేయడానికి, మంటను, చికాకును తగ్గించడానికి తేనె కూడా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మిరపకాయలు కోసిన తర్వాత చేతులకు తేనెను రాసుకుంటే మంట వెంటనే తగ్గుతుంది. అయితే తేనెను చేతులకు అప్లై చేయడం సాధ్యం కాదు. కాబట్టి మీరు దీన్ని కొద్దిగా నిమ్మరసంతో కలిపి పెట్టుకోవాలి.
ఐస్ క్యూబ్స్
ఐస్ క్యూబ్స్ కూడా చేతుల మంటను తగ్గించడానికి సహాయపడతాయి. ఇందుకోసం మిరపకాయను కట్ చేసిన తర్వాత ముందుగా ఐస్ క్యూబ్ ను చేతుల్లో పెట్టుకోండి. ఐస్ తో చేతులకు మసాజ్ చేయొచ్చు. అలాగే చల్లని నీటిలో చేతులు ముంచడం వల్ల కూడా మంట నుంచి ఉపశమనం కలుగుతుంది.