మానవ శరీరంలో చాలా వేగంగా పెరిగేవి ఏమైనా ఉన్నాయి అంటే… అవి గోళ్లు, వెంట్రుకలే. ఈ రెండూ మనం కత్తిరిస్తూ ఉన్నా కూడా పెరుగుతూనే ఉంటాయి. రెగ్యులర్ గా స్త్రీ, పురుషులు సెలూన్ కి వెళ్లి హెయిర్ కట్ చేసుకుంటూ ఉంటారు. మరి కొందరు దేవుడికి మొక్కుల పేరిట జుట్టు ఇస్తూ ఉంటారు. కానీ.. అలా కట్ చేసిన జుట్టు మొత్తం ఎక్కడికి పోతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆ జుట్టుతో కొన్ని రూ. కోట్ల వ్యాపారం జరుగుతుందని మీకు తెలుసా? ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం…
పనికి రాని జుట్టుతోనే రూ. కోట్లు…
ఊడిపోయిన, రాలిపోయిన, కత్తిరించిన జుట్టును మనం పనికి రానిదిగా భావిస్తూ ఉంటాం. కానీ.. వాటితో రూ. కోట్ల వ్యాపారం చేస్తున్నారని మీరు ఊహించి ఉండరు. మార్కెట్లో కూడా జుట్టుకు చాలా మంచి డిమాండ్ ఉంది. జుట్టు ధర.. దాని నాణ్యత, పొడవు ఆధారంగా నిర్ణయిస్తారు. ముఖ్యంగా.. కత్తిరించిన జుట్టు కంటే… మహిళలు దువ్వుకుంటున్నప్పుడు రాలే జుట్టుకు ఎక్కువ డిమాండ్ ఉంటుందట. స్త్రీలకు పొడవాటి జుట్టు ఉంటుంది కాబట్టి.. ఆ జుట్టుకు ఎక్కువ డిమాండ్ ఉంటుందట.అయితే, పురుషుల జుట్టు స్త్రీల జుట్టు కంటే బలంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
మీ జుట్టు ధర వింటే మీరు షాక్ అవుతారు...
ప్రస్తుతం మార్కెట్లో జుట్టుకు మంచి డిమాండ్ ఉంది. సాధారణంగా 8 నుంచి 12 అంగుళాల పొడవున్న జుట్టు ధర కిలోకు 8 నుంచి 10 వేల రూపాయలు ఉంటుంది. ఈ ధర జుట్టు నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఈ జుట్టుతో ఏమి చేస్తారు అని అనుకుంటున్నారా..?. ఈ జుట్టు నుండి విగ్గులు తయారు చేస్తారు. సముద్రంలో ఓడలను లంగరు వేయడానికి పురుషుల జుట్టును ఉపయోగిస్తారు. పురుషుల జుట్టు బలంగా ఉంటుంది. నీటిలో కరగదు, కాబట్టి దానితో తయారు చేసిన తాడును లంగరు వేయడానికి ఉపయోగిస్తారు. అందుకే జుట్టుకు అంత డిమాండ్ ఉంది.
భారతదేశంలో జుట్టు తో కోట్ల విలువైన వ్యాపారం…
ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో జుట్టు వ్యాపారం కోట్ల రూపాయల విలువైనదని గణాంకాలు చెబుతున్నాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. భారతీయ మహిళలు ఇప్పటికీ పొడవాటి జుట్టుకు విలువ ఇస్తారు. అలాగే, భారతీయ మహిళల జుట్టు నాణ్యత కూడా ఒక కారణం. దీనికి ప్రధాన కారణం ఇక్కడ తక్కువ రసాయనాలు వాడటం. భారతదేశం నుండి జుట్టు ప్రధానంగా చైనా, మలేషియా, థాయిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, బర్మా దేశాలకు ఎగుమతి అవుతుంది. వెంట్రుకల వ్యాపారంలో ఎక్కువ భాగం దేవాలయాల నుండి సేకరించిన వెంట్రుకలే కావడం గమనార్హం.