హైదరాబాద్ మహా నగరంలో జీవించే వారి లైఫ్ స్టైల్ చాలా బిజీగా ఉంటుంది.. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకొనే వరకు పనులన్నీ ముందే షెడ్యూల్ అయిపోయి ఉంటాయి. అందుకే అందరూ వీకెండ్స్, హాలిడేస్ కోసం చాలా ఆశగా ఎదురు చూస్తుంటారు. వీకెండ్ వచ్చిందంటే రెస్టారెంట్స్ కి వెళ్లడం, మూవీస్ చూడటం, పబ్స్, పార్టీలు ఇలా సిటీలోనే తిరిగి ఎంజాయ్ చేస్తుంటారు.
లేకపోతే చార్మినార్, ఫిల్మ్ స్టూడియోలు, ట్యాంక్ బండ్, నెక్లస్ రోడ్, గోల్కొండ, శిల్పారామం ఇలాంటి ప్రాంతాలకు వెళ్లి సరదాగా కాసేపు తిరిగొస్తారు. ఇవన్నీ సిటీకి సమీపంలోనే ఉంటాయి కాబట్టి హాయిగా ఒక్కరోజులో అన్నీ కవర్ చేసేయొచ్చు. కాని ఒక్క రోజులోనే హైదరాబాద్ కు సమీపంలో ఉన్న జలపాతాలను కూడా చూసి రావచ్చని మీకు తెలుసా? ప్రకృతి ఒడిలో కాసేపు సేద తీరాలనుకుంటే మీకు కచ్చితంగా ఈ ప్లేసెస్ ను ఒక్కసారైనా చూడాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎత్తిపోతల జలపాతం
చుట్టూ కొండలు, గుహలు, పచ్చదనంతో ఆహ్లాదకరమైన ఎత్తిపోతల జలపాతం హైదరాబాద్ కు సుమారు 176 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడకు వెళ్లాలంటే సుమారు 3 గంటల సమయం చాలు. మీరు ఉదయం బయలుదేరి వెళితే సాయంత్రం వరకు ఎంజాయ్ చేయొచ్చు. చీకటి పడిన తర్వాత తిరిగి స్టార్ట్ అయితే రాత్రికి ఇంటికి వచ్చేయొచ్చు. ఈ అందమైన జలపాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా పరిధిలోకి వస్తుంది. నకిరికల్లు మండలంలో ఈ ఎత్తిపోతల జలపాతం ఉంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే 70 అడుగుల ఎత్తు నుండి నీరు జాలువారుతూ ఉంటుంది. ప్రకృతి అందాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి.
మల్లెలతీర్థం జలపాతం
ఈ జలపాతం శ్రీశైలానికి దగ్గర్లో ఉంటుంది. ఇది హైదరాబాద్ కి సుమారు 230 కి.మీ. దూరంలో ఉంటుంది. అక్కడికి చేరుకోవడానికి దాదాపు 5 గంటలు సమయం పడుతుంది. కాని ఒక్కసారి మీరు అక్కడికి వెళితే ప్రకృతి అందాలకు మంత్రముగ్దులైపోతారు. ఎందుకంటే శ్రీశైలం అడవుల మధ్య ఎత్తైన కొండల నుంచి నీరు జాలువారుతుంటే చూడటానికి రెండు కళ్లు చాలవు. ఈ వాటర్ ఫాల్స్ ను "జలాల మల్లిక" అని కూడా అంటారు. ఈ ప్లేస్ కు కూడా హైదరాబాద్ నుంచి ఒక్క రోజులోనే వెళ్లి రావచ్చు.
కుంతల జలపాతం
హైదరాబాద్ కు సుమారు 260 కి.మీ. దూరంలో ఉన్న కుంతల జలపాతం ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి ఒక చక్కటి టూరిస్ట్ స్పాట్. హైదరాబాద్ నుంచి సుమారు 5 గంటలు ప్రయాణిస్తే ఈ అద్భుతమైన జలపాతాన్ని చూడొచ్చు. ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ఇది తెలంగాణలోనే ఎత్తైన జలపాతంగా గుర్తింపు పొందింది. ఇక్కడ ట్రెక్కింగ్ చేయడానికి కూడా అవకాశం ఉంది.
పొచేరువు జలపాతం
కుంతల జలపాతానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో రాళ్ల మధ్య నుంచి ప్రవహించే చిన్న జలపాతం ఇది. పిల్లలతో వచ్చే ఫ్యామిలీస్ కి ఈ ప్లేస్ బాగుంటుంది.
ఇది కూడా చదవండి సాహసోపేతమైన అమర్‌నాథ్ యాత్ర చేస్తారా? రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యింది. ఆన్‌లైన్‌లో ఎలా చేయాలంటే?