భారతీయ రైల్వే నెట్ వర్క్ ఎంత పెద్దదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోజూ కొన్ని లక్షల మంది రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. ఇందుకు ఇండియన్ రైల్వే కల్పించే సౌకర్యాలు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. రైల్వే సీనియర్ సిటిజన్ల కోసం చాలా సౌకర్యాలు కల్పిస్తోంది. వీటితో వారు హాయిగా ప్రయాణం చేయవచ్చు. మరి వయసు పైబడిన వారికోసం ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయో ఇక్కడ చూద్దాం.
సీనియర్ సిటీజన్లకోసం...
సాధారణంగా చాలామంది సీనియర్ సిటిజన్లు ఎక్కువగా ఎదురు చూసేది రైలు ఛార్జీ రాయితీ కోసమే. కరోనా మహమ్మారీ రాకముందు ఇండియన్ రైల్వే 60 ఏళ్లు పైబడిన మగవాళ్లకి, 58 ఏళ్లు పైబడిన ఆడవాళ్లకి టికెట్ మొత్తంలో కొంతమేర రాయితీ ఇచ్చేది. ప్రస్తుతం అలాంటివి లేకపోయినా మరికొన్ని సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది.
లోయర్ బెర్త్..
సీనియర్ సిటిజన్లు సులువుగా ప్రయాణం చేయడానికి ఇండియన్ రైల్వే చాలా సదుపాయాలు కల్పిస్తోంది. వాటిలో ప్రధానమైంది లోయర్ బెర్త్ కేటాయింపు. వయసు పైబడిన వారికి అప్పర్ బెర్త్, మిడిల్ బెర్త్ ఇస్తే ఎక్కడం కష్టమవుతుంది. కాబట్టి వారికి ఈజీగా ఉండేందుకు లోయర్ బెర్త్ లను కేటాయిస్తారు.
ప్రత్యేక టికెట్ కౌంటర్
చాలా రైల్వే స్టేషన్లలో సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. వయసు పైబడిన వారు లైన్లో నిలబడి టికెట్ తీసుకోవడం శ్రమతో కూడుకున్న పని కాబట్టి.. ఈ ప్రత్యేక కౌంటర్ వారికి బాగా ఉపయోగపడుతుంది.
ప్రత్యేక సీట్లు
పెద్ద పెద్ద రైల్వే స్టేషన్లలో సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు స్టేషన్ లోపలికి వెళ్లడానికి వీల్ చైర్స్, పోర్టర్ లాంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై లాంటి నగరాల్లో లోకల్ ట్రైన్లలో సీనియర్ సిటిజన్ల కోసం కొన్ని సీట్లను కూడా కేటాయించారు.