Weather Update : ఇకపైనే అసలుసిసలైన ఎండలు.. ఈ జిల్లాల్లో అగ్నిగుండమే.. రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ అన్నీ జారీ

Published : May 13, 2026, 05:22 PM IST

IMD Heat Wave Alert : తెలుగు ప్రజలారా తస్మాత్ జాగ్రత్త… ఇకపైనే అసలుసిసలైన ఎండాకాలం ప్రారంభం అవుతోందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రెడ్, ఆరెంజ్, ఎల్లో ఇలా ఎన్ని అలర్ట్స్ ఉంటే అన్నీ జారీ చేసింది.  

PREV
14
ఇక కాస్కొండి... తెలంగాణలో మండుటెండలు

Weather Update : ఇక తెలుగు రాష్ట్రాల్లో అసలుసిసలైన ఎండాకాలం మొదలవబోతోందని వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది. వేసవికాలం మొదలైనప్పటి నుండి మధ్యాహ్నం ఎండలు... ఉదయం, సాయంత్రం చల్లని వాతావరణం ఉంటూ వస్తోంది. కొన్నిచోట్ల వర్షాలు కూడా కురవడంతో వాతావరణం చల్లబడేది. కానీ ఇకపై ఇలా ఉండదట... భానుడి భగభగలు ఉంటాయని... ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరతాయని... వడగాలులు, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తాయని వెదర్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

24
తెలంగాణకు రెడ్ అలర్ట్..

రాబోయే రోజుల్లో తెలంగాణవ్యాప్తంగా ఎండలు మండిపోతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. క్రమక్రమంగా ఉష్ఱోగ్రతలు పెరుగుతాయని... 2 నుండి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. మే 14,15,16 (బుధ, గురు, శుక్రవారం) మూడ్రోజులు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక కొన్ని జిల్లాల్లో 41 నుండి 44 డిగ్రీలు నమోదయ్యే అవకాశాలున్నాయంటూ ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాల్లో 36 నుండి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాబట్టి రెడ్ అలర్ట్ జిల్లాల ప్రజలే కాదు తెలంగాణ ప్రజానీకమంతా ఎండల సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

34
తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనాలివే...

తెలంగాణ వెదర్ మ్యాన్ అయితే ఎండల తీవ్రత మరింత దారుణంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. రేపు (మే 14, గురువారం) నుండి ఉత్తర తెలంగాణ అగ్నిగుండంలా మారుతుందట. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 నుండి 45 డిగ్రీలు నమోదవుతాయని హెచ్చరించారు. హైదరాబాద్ లో కూడా 41 నుండి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయని... ఉక్కపోత, వడగాలులతో నగర ప్రజలు కూడా అల్లాడిపోతారని వెదర్ మ్యాన్ హెచ్చరించారు.

వేసవి ఆరంభంనుండి ఇప్పటివరకు ఉదయం ఉష్ణోగ్రతలు 25-27°C వరకు నమోదవుతున్నాయి. కానీ రేపటి నుండి పరిస్థితి పూర్తిగా మారిపోతుందట... ఉదయం ఉష్ణోగ్రతల కూడా 30 డిగ్రీలకు పైగానే ఉంటాయని వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు ఇంతేనట… 30°C కంటే ఎక్కువగా ఉంటాయట. అంటే ఇకపై కేవలం మధ్యాహ్నమే కాదు ఉదయం, రాత్రి కూడా వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయన్నమాట.

44
నేడు తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు...

ఇవాళ (మే 13, బుధవారం) తెలంగాణవ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్ లో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నిజామాబాద్ లో 42.7, నల్గొండలో 40.5, మహబూబ్ నగర్ లో 40.4, రామగుండంలో 40.1, మెదక్ లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. హైదరాబాద్ హకీంపేటలో 40.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Read more Photos on
click me!

Recommended Stories